పరబ్రహ్మం

 

పరబ్రహ్మం :


1) పరబ్రహ్మం గూర్చి తెల్పండి?


పరబ్రహ్మం అంటే శూన్యమే! ఈ శూన్యమునకు మరోపేరే పరమాత్ముడుగా పిలవబడుతుంది. ఈ పరమాత్మ అంటే బ్రహ్మాండమునకు ఆధారమైనవాడు, లేదా నియమకుడు. ఎలా అంటే ఈ సమస్త విశ్వములో అంటే భూగోళం, నవగ్రహాలు, సూర్యచంద్రులు, నక్షత్ర మండలాలు లేనపుడు ఈ విశ్వం నిండా ఏమి ఉంటుంది? 'శూన్యమే' గదా! అంటే సృష్టి జరగాలంటే ఈ శూన్యం నుంచే గదా జరిగి ఉంటుంది. అంటే సృష్టి చేసేందుకు శక్తి శూన్యానికే గదా ఉన్నదని మనము అనుకోవచ్చుగదా! మన శాస్త్రాలు ఈ సకల చరాచర సృష్టికి మూలము పరమాత్ముడని చెపుతున్నాయి గదా! అంటే ఆ పరమాత్ముడు ఎవరు ఈ శూన్యమే గదా! మనకి ఆత్మ సాక్షాత్కారనంతరం మన ఆత్మ, పరమాత్మలో కలుస్తుంది గదా! మరి శూన్యానికి రూపముండదు గదా! అందుకే పరబ్రహ్మమును నిర్గుణుడు లేదా రూపము లేని వాడు అందురు! ఈ శూన్యం ఈ జగత్తు అంతటా వ్యాపించి ఉంటుంది. గదా! అందుకే పరబ్రహ్మమును సర్వాంతర్యామి అందురు.


2) పరమాత్ముడిని ఎందుకు పూజించాలి?


మనం చూస్తున్న ఈ విశ్వం, ఒక నియమానుసారంగా, క్రమపద్ధతిగా, లయపద్ధతిగా, ఒక వ్యవస్థకు లోబడి నడుస్తున్నట్లుగా తోస్తుంది గదా! అంటే నవగ్రహాలు సూర్యుని చుట్టూ పరిభ్రమించటం, తమ చుట్టూ తాము తిరగటం మున్నగు విషయాలు గమనిస్తే మనకు అర్ధము అగును. లేకపోతే మనము ఈ జగత్తులో మనం ఇష్టం వచ్చినట్లుగా బ్రతికేవాళ్లము గదా! అంటే మనకు స్వేచ్ఛ అనేది ఉంటే మనము సుఖాలనే అనుభవించే వాళ్లమే గాని కష్టాలను అనుభవించే వాళ్లము గాదు కదా! ఈ కష్టసుఖాలకు, సుఖ దుః ఖాలకు కారణ భూతుడైన ఆ నియమాకుడును తెలుసుకోవాలి! అలాగే మనము అనేక విషయ వాంఛలకు, విషయవాసనలకు లోనై, దుర్గందపూరితమైన యోని మార్గములో జన్మిస్తున్నాం గదా! ఇలాంటి పునః జన్మలకు కారణమైన వాడిని తెల్సుకోవాలి! ఆయనను ప్రసన్నము చేసుకోవాలి! ఆయన అనుగ్రహము కావాలంటే ధ్యానము, జపతపాలు, ప్రాణాయామాలు, అనుష్ఠానాలు మున్నగు సాధనాలు ప్రవేశపెట్టారు. అందువలన ఆ పరమాత్మ అనుగ్రహము పొందుటకు మనము పూజలు చేయవలెను. చేసినచో ఆ పరమాత్మ అనుగ్రహమును పొంది, మనము జీవన్ముక్తి పొందుతాము..


3)పరబ్రహ్మం నిరాకారుడా లేదా ఆకారుడా? వివరించండి?

పరబ్రహ్మ నిరాకారుడిగా ఉంటాడు లేదా ఆకారుడిగా ఉంటాడు. ఈ రెండు సత్యములే! కాని ఒకటి సత్యము అయితే మరియొకటి అసత్యము అవ్వాలి గదా అని నీ సందేహము! ఇపుడు సైన్సులో (E= MC$^2$) అనే సిద్ధాంతమున్నది గదా! ఇది ఏమని చెపుతుంది. ఈ విశ్వంలో ప్రతి పదార్థము మనకు కంటికి కనిపించని అణువులతో నిర్మితమైనదని కదా! అంటే ఉదాహరణకు మీరు ఒక చెట్టును చిన్న చిన్న ముక్కలుగా చేసుకొంటూ పోతే, చివరకు మిగిలేది అణువే కదా! మరి ఈ అణువును విచ్ఛేదనం చేస్తే 'శక్తి' తో కూడిన ప్రేలుడు సంభవించును గదా! యోగపరిభాషలో శక్తి అంటే అమ్మవారు గదా! అంటే ఈ జగత్తులోని ప్రతి భౌతిక పదార్థము శక్తివలన ఏర్పడినదని ఐన్స్టీన్ చెప్పక మునుపే, మన వేదాలు, ఉపనిషత్తులలో ఈ విషయాన్ని మన పూర్వీకులు చెప్పారు. మరి పరమాత్ముడంటే ఈ అణువుల యొక్క శక్తి రూపమే గదా! మరి అణువు అంటే కంటికి కనిపించదు గదా! అంటే పరమాత్ముడు నిరాకారుడు అనవచ్చుగదా! చాలా క్షేత్రాలలో దేవుళ్లు స్వయంభువులుగా వెలసినారని తెలుసుగదా! అంటే మన కంటికి కనిపించడానికి ఆ పరమాత్ముడు నిరాకారతత్త్వము (ఆకారము లేని స్థితి) నుండి సాకారతత్త్వము (ఆకారము ఉండే స్థితి) ఏర్పడినాడని అర్థము చేసుకోవచ్చు గదా! అంటే శూన్యము నుండి ఆకారము కోసము విగ్రహాలుగా, సాలగ్రామములుగా, లింగాలుగా పరమాత్ముడు అవతరించాడని అనవచ్చుగదా! అందువలన దీనిని బట్టి చూస్తే పరమాత్ముడుని నిరాకారుడు లేదా ఆకారుడు అనవచ్చుగదా!


4)పరమాత్ముడు గూర్చి వివిధరకాల శాస్త్రాలు ఏమి అంటున్నాయి?


పరమాత్ముడు గూర్చి అనేకమంది అనేక రకాలుగా చెపుతారు. మతాలు భగవంతుడని అంటున్నాయి. కేవలం భౌతిక రసాయన శాస్త్రాలు అణుశక్తి అని, రసాయనిక శక్తి అని, అయస్కాంతశక్తి, అని, విద్యుత్ తరంగ శక్తి అని, కాంతిశక్తి అని అంటున్నాయి. వేదాంత శాస్త్రాలు పరమాత్ముడని అంటున్నాయి. కాని ఎవరు, ఏవిధంగా చెప్పినా, ఆ "సత్త" అందరిలోను, అన్నింటిలోనూ స్వయం ప్రకాశమానమై ఉండనే ఉన్నది. ఆ సత్తయే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనే మూడు శక్తులకు ఆధారం. ఇచ్ఛాశక్తికి శివుడిని, జ్ఞానశక్తికి బ్రహ్మను, క్రియాశక్తికి విష్ణువును ప్రతీకలుగా ఉంచారు. కాలం, నియమం, యదృచ్ఛ, పదార్థం, శక్తి, జీవుడు అనే ఈ అన్నింటిని పరివేక్షించేది, వీటి అన్నింటికి ఆధారమైనది ఆ "సత్త"యే! ఈ "సత్త"నే పరబ్రహ్మము! ఈ బ్రహ్మాండం - సృష్టి చక్రము అంతా ఇలా తిరగడానికి కారణం ఆ పరమాత్ముని మహిమే!


5)బ్రహ్మచక్రము గూర్చి తెల్పండి?

మహర్షులు ధ్యాన యోగము ద్వారా ధ్యానములో ఈ బ్రహ్మచక్రము దర్శించారు. వారు దర్శించిన బ్రహ్మచక్రాన్ని ఈవిధంగా వర్ణించారు. ఈ చక్రానికి మూడు ఇనుపపట్టాలు, అలాగే 16 కొనలు, 50 ఆకులు ఉన్నాయి. అంటే సత్త్వ, రజో, తమో గుణాలు అనేవి మూడు ఇనుప పట్టాలుగా చట్రం చుట్టూ బిగించబడి ఉన్నాయి. అలాగే పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు (5+5+5+1) మొత్తం పదహారు కొనలుగా చెప్పారు. అలాగే 5 విపర్యయాలు, 28 ఆశక్తులు, 9 తుష్టులు, 8 యోగ సిద్ధులు (5+28+9+8) మొత్తం 50 ఆకులుగా చెప్పారు.


6)అసలు పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడు? ఎలా చూడగలము?

శూన్యము లేని ప్రదేశముంటుందా? ఎందుకంటే శూన్యమే గదా పరమాత్ముడంటే! అణువును చూడాలంటే మనము మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే చూడగలము. ఎందుకంటే అణువు అనేది మన బాహ్యనేత్రాలకు కనిపించదు గదా! అలాగే మన బాహ్య నేత్రాలకు కనిపించని ఆ పరమాత్ముడిని చూడాలంటే మనకు జ్ఞాననేత్రం లేదా మనోనేత్రం ఉండాలి! దీని ద్వారానే మాత్రమే ఆ పరమాత్ముడిని చూడగలము. అందుకే శివుడికి మూడవ నేత్రమును ఉంచారు. ఈ మనోనేత్రం యోగికి మాత్రమే తెరచుకొని ఉంటుందని గ్రహించండి. సాధారణ మానవుడికి ఈ నేత్రం మూసుకొని వుంటుంది! ఈ నేత్రం భృకుటి స్థానంలో వుంటుందని గ్రహించండి!


7)పరబ్రహ్మమునకు, పరమాత్ముడికి తేడా ఉన్నదా?

ఉన్నది! గాఢ అంధకారమైన శూన్యమును పరబ్రహ్మం అందురు. ఈయన నిరాకారుడు. ఈయన సంకల్పము నుండి ఒక సత్ జ్యోతి స్వరూపములో ఈయన నుండి ఆకారముగా బయటికి వచ్చినది! ఈ ఆకార పరబ్రహ్మమునే పరమాత్ముడు అందురు. అనగా పరబ్రహ్మం నిరాకారుడు (శూన్యం), ఆకార పరబ్రహ్మమును పరమాత్ముడు (సత్జ్యోతి) అందురు. ఈ సత్ జ్యోతి నుండి అండ, పిండ, బ్రహ్మాండాలు ఏర్పడినాయి. అనగా పరమాత్ముడి నుండి అన్నమాట! ఈ సత్ జ్యోతి స్వరూపమును సాధకుడు తన సహస్ర చక్ర తత్త్వములో ఉన్నప్పుడు చూస్తాడు. దీనినే ఆత్మ సాక్షాత్కారం అందురు. ఈ పరమాత్ముడి నుండి సాకారమైన పరబ్రహ్మమైన ఆదిపరాశక్తి ఏర్పడినది. అందుకే శ్రీ చక్రము యొక్క అధిష్ఠాన దేవతలు అయిన కామినీకామేశ్వరులలో కామేశ్వరుడి తొడ మీద అమ్మవారు ఉంటుంది. అనగా పరమాత్ముడి నుండి ఆదిపరాశక్తి ఏర్పడినది. అంటే నిరాకారమును పరబ్రహ్మమని, ఆకారమును పరమాత్ముడని, సాకారమును శక్తి అని అందురు.


8)ఆత్మ గూర్చి తెల్పండి?

ఆత్మ అంటే దేహములోని శూన్యమే! అంటే దేహములోని శూన్యమును ఆత్మ లేక జీవాత్మ అందురు. లేదా ఈ పిండ చక్రమునకు ఆధారమైనవాడు లేదా నియామకుడిని ఆత్మ అనవచ్చును.

9)వివిధ దేహాలలో ఆత్మ ఒకటేనా? లేదా వేరువేరా?

దేహములోని శూన్యము ఆత్మయేగదా? ఈ లెక్కనా వివిధ ప్రాణుల దేహములోని ఉంటే శూన్యమును ఆత్మ అనవచ్చు గదా! అంటే మీ దేహములోను, ఇతర జీవుల దేహములలోను ఉండే శూన్యము ఒక్కటే అయినపుడు తద్వారా ఆత్మ కూడా ఒక్కటే అవుతుంది కదా! శూన్యము అణువు నిర్మితమని మనకు తెలుసుగదా! అణువుల కలయిక తేడా వలన మనకు వివిధ రకాల దేహాలు అంటే శరీరాలు ఏర్పడుతున్నాయి.

10)జీవచక్రము గూర్చి తెల్పండి.

పిండచక్రము, శరీర చక్రము కలిపి జీవచక్రమందురు. ఈ జీవచక్రమునకు ఆధారమైనదానిని జీవాత్మ లేదా ఆత్మ అందురు. ఈ పిండచక్రము శుభ, అశుభ కర్మలచే తిరుగుతుంది. అదే విధంగా శరీరచక్రము సత్వ, రజో, తమోగుణాలచేత మరియు ప్రాణం, ఇంద్రియాలు వాటి విషయాలు వీటి ఆకులుగా ఉన్నాయి. మనస్సు, బుద్ధి, అయిదు జ్ఞానేంద్రియాలు మొత్తం ఈ ఏడు శరీర చక్రమును ఎల్లప్పుడూ, చాలా జాగ్రత్తగా పరిరక్షిస్తూ ఉంటారు. ఈ ఏడింటినే సప్త ఋషులందురు.

11)మనస్సుకు, ఆత్మకు గల బేధము ఏమిటి?

బుద్ధికి లోబడి చేసేది 'మనస్సు' అయితే బుద్ధిని వశపర్చుకొని తద్వారా మనస్సుతో చేయించేది 'ఆత్మ' అవుతుంది.

12)ఆత్మ, జీవాత్మ, ప్రేతాత్మ, విముక్తి ఆత్మ అంటే ఎవరు?

కోరికలు తీరినవాడు ఆత్మగా అంటే యోగిగా, కోరికలు అనుభవించువాడు జీవాత్మగా అంటే జీవుడిగా, కోరికలు తీరనివాడు ప్రేతాత్మగా అంటే శాకిని, ఢాకిని మున్నగు వారిగా ఉంటారు. కోరికలయందు వైరాగ్యమున్నవాడు విముక్తి ఆత్మగా ఉంటే ముముక్షువుగా ఉంటాడు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గ్రంథ పరిచయం

   అరుణాచల శివ పరమేశ్వరుడి లీల అనుగ్రహం  యోగ దర్శనం అంకితం : పరబ్రహ్మ స్వరూపులైన  పరమేశ్వరి , పరమేశ్వరుల  పాదారవిందములకు…. నా ఆది గురువైన శ్...