యోగి తత్వము

 యోగి తత్వము 


యోగి తత్త్వము గూర్చి తెల్పండి?

యోగితత్త్వమును శివతత్త్వము నుండి తెలుసుకోవాలి. అనగా పరమయోగి ఎలా ఉంటాడో దానికి ప్రతీకగా పరమేశ్వరుడిని వుంచారు. అదే శివతత్త్వము అన్నమాట. ఇపుడు చూద్దాం.

జీవాత్మని మనిషి శరీరం నించి మృత్యువనే ప్రక్రియలో విడదీసేవాడు ఆ జీవాత్మ పరమాత్మతో కలిగే ప్రక్రియలో సహాయం చేసేవాడు, త్రిమూర్తులలో ఒకరైన ఈశ్వరుడే గదా ! అందుకే అద్వైత సిద్ధి కోరే భిక్షువులు, సన్యాసులు, యోగసాధకులు శివుడ్ని కొలుస్తారు. శివారాధనలోని ఆధ్యాత్మిక అంతరార్థం ఇదే. అనగా 'శం' అంటే చిదానందం. 'కర' అంటే కలిగివుండేవాడు. తనని ఆశ్రయించిన వారికి చిదానందాన్ని ఇచ్చేవాడు శంకరుడు. ఈ విషయంలో పరమేశ్వరుడు బోధనల అంతరార్థం ముక్తి మార్గంలోని వారికి తేలిగ్గా అర్థమవుతాయి.


పరమేశ్వరుని నివాసం వెండి కొండ! ధనాధిపతి అయిన కుబేరుడు ఆయనకి ఆప్తమిత్రుడు. అయినా శివుడు భిక్షా పాత్రతో తిరుగుతుంటాడు. అనగా ధనకనకాదులు అద్వైత సిద్ధికి ప్రతిబంధకాలని, వాటిని త్యజించి అవిచ్చే సుఖ దుఃఖాలకి అతీతంగా వుండాలని ఆ భిక్షా పాత్ర బోధిస్తుంది. అంటే ప్రతి సాధకుడు ధనకనకాల మహామాయలో అనగా మహాలక్ష్మీ యోగమాయలో పడకూడదని దీని అర్థం!


పరమేశ్వరుడి ధర్మపత్నిగా పార్వతిదేవి ఉన్నది. ఈమె అతిలోక మహాసౌందర్యవతి! ఈమె సౌందర్యము ముందు ఏ సమ్మోహన శక్తి గూడ వుండదు. అదియుగాక ఈమెకు తనకు మించిన అందగత్తె ఈ విశ్వములోనే లేరని అహంకారం ఉన్నది. అయిన గూడ పరమేశ్వరుడు ఈ సౌందర్యమునందు ఆకర్షితుడు కాలేదు. ఎందుకంటే అద్వైత సిద్ధికి కామము ప్రతిబంధకమని, దీనిని త్యజించి అవిచ్చే క్షణిక సుఖాలను అనగా రతిక్రీడలవలన కలిగే సుఖాలకు అతీతంగా వుండాలని, అమ్మవారి ద్వారా తెలియచేసినారు. అంటే ప్రతియోగసాధకుడు కామ యోగమాయలో పడకూడదని దీని అర్థం. అందుకే గదా, పరమేశ్వరుడు మన్మథుడిని భస్మం చేశాడు. అనగా కామమును తద్వారా జయించినాడు గదా! అంటే ప్రతి యోగసాధకుడు ధనకనకాలను, కాంతను జయించాలని చెప్పియున్నారు. అపుడే వారు అద్వైత సిద్ధిని పొందగలరు..


శివుడికి కామదహనుడని పేరు! అంటే కోరికలని జయించిననాడని అర్థం. కోరికలు తీరడానికి మనం చేసే కర్మలు బంధానికి, బంధాలు జన్మ పరంపరలకి దారితీసి, జీవిని అందులోకి నెట్టివేస్తాయి. అందుకే కోరికలని త్యజించాలని చెప్పే ఆ పరమేశ్వరుడు మృత్యుంజయుడిగా పేరు పొందాడు. అందుకే శివుడు ధ్యాన తపస్సులో ఉండేది.


శివుడి మెడలోని సర్పం మనిషిలో నిద్రాణంగా వుండే కుండలినీ మాతకి ప్రతీక. దాన్ని శివుడు స్వాధీనం చేసుకొని అలంకరించుకున్నట్లే మనిషి, షట్చక్రాలని కుండలినీ సహాయంతో దాటి కుండలినీని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలి అని సూచిస్తుంది. ఇక్కడ చిన్న సందేహము రావచ్చును. అది ఏమిటంటే పామునే ఎందుకు కుండలినీ శక్తికి ప్రతీకగా వుంచారు అని అంటే మరే జీవినైనా పెట్టవచ్చుగదా అని? దీనికి సమాధానంగా ఈ విశ్వములో గుండె ద్వారా శ్వాసక్రియను జరిపేది పాము మాత్రమేనని తెలుసుకోండి! అద్వైత సిద్దికి అనగా తత్త్వమసికి వచ్చేసరికి సాధకుడు గుండె ద్వారానే శ్వాసక్రియ జరుపుతాడు. సహజంగా మానవుడు ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియను జరుపుతాడు గదా! అందుకే కుండలినీ శక్తికి ప్రతీకరూపంగా పామును వుంచారు. అంతేగాక లోకం పొందాల్సిన అమృతానికి అడ్డు వచ్చే విషాన్ని తాను స్వీకరించాలని, అపుడే 'స్వార్థం' నశించి ముక్తి లభిస్తుందని నీలకంఠుడి బోధ! అనగా సమాధిస్థితి కంఠము వద్ద ప్రారంభమగును.


శివుడు విభూదిని వంటికి పూసుకుంటాడు. విభూతి వైరాగ్యాన్ని సూచిస్తుంది. ఈ భౌతిక ప్రపంచంలో కనపడే ప్రతిజీవి చిట్టచివరి స్వరూపం బూడిదే గదా! ఇది గుర్తుంచుకుని వైరాగ్యం ద్వారా కోరికలు, దురలవాట్లు భస్మం చేసుకుని పవిత్ర జీవితంలో ముక్తిని సాధించాలని చెప్పేందుకే శివుడు విభూధిధారి అయ్యాడు. అదియుగాక విభూది రాసుకోవటం వలన కుండలినీ శక్తి జాగృతిలో వచ్చే మహా వేడిని, అలాగే చలిని తట్టుకోవచ్చును. ప్రతియోగ సాధకుడు కనీసం నుదిటిపైన అయిన విభూది రేకలు పెట్టుకోవాలి. అపుడే ఈ వేడిని, చలిని తట్టుకోగలరు.


శివుడికి మూడో కన్ను వుంటుంది. ఇది జ్ఞాన నేత్రమని లేదా మనో నేత్రమని అందురు. ఈ నేత్రం ప్రతి మనిషిలో ఉంటుంది. కాకపోతే అది మూసుకుని వుంటుంది. ఎపుడైతే సాధకుడు బ్రహ్మజ్ఞాని అవుతాడో అప్పుడు మాత్రం ఈ మూడో కన్ను తెరచుకొంటుంది. గమనించుకోండి. అదే శివుడు మూడు కన్నుల వెనకై మనుషులందర్ధూ జ్ఞానం అభ్యంకుంచి, అనగా కుండలీని కనుబొమ్మల ప్రాంతంలో మనం ఆనందం పొందుతాము. మనిషికున్న ఏది అసాధ్యం కాదుఅనే అహంకారాన్నినశింపచేసి సంగతి సముద్రపు పొంగోలే, అనగా బ్రహ్మజ్ఞానం తెలిస్తే, అవి ఇచ్చే ఆ ఆనందాలన్ని భస్మం అవుతాయి. ఆ జ్ఞాన తేజస్సుతో అజ్ఞానాంధకారం పటాపంచలవుతుంది. ఈ కారణంగానే ఇనుముని అయస్కాంతం ఆకర్షించినట్లుగా శివుడు ముక్తి కాముకుల్ని ఆకర్షిస్తున్నాడు.


శివుడికి ప్రీతికరమైనవి బిల్వపత్రాలు గదా! అవి మూడు దళాలతో వుండే బిల్వ పత్రంతో ఆయన్ని అర్చించడమంటే ఆధ్యాత్మిక సాధన ద్వారా మనలోని త్రిగుణాలైన తమో, రజ, స్తత్వ గుణాలని పరమేశ్వరుడికి అర్పించి అత్యున్నతమైన శుద్ధ సత్త్వాన్ని పొందాలని అర్థం. అనగా ప్రతియోగసాధకుడు శుద్ధ సత్త్వాన్ని కలిగి వుండాలి అన్నమాట. అలాగే శివుడు అభిషేక ప్రియుడు గదా! అనగా పంచామృతాలతో అభిషేకం చేస్తాము గదా! అవి ఆవుపాలు, ఆవుపెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార గదా! అంటే ఈ పంచామృతాలు వలన మనలోని పంచచక్రాలు అయిన మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరక, అనాహత, విశుద్ధచక్రాలు జాగృతి అయ్యి, శుద్ధి అవుతాయి. గంటానాదము చేయటంవలన ఆజ్ఞాచక్రం జాగృతి అయ్యి శుద్ధి అగును. శంఖనాదము వలన సహస్రచక్రము జాగృతి అయ్యి, శుద్ధి అగును. ధార పాత్ర ద్వారా అభిషేకం చేయటము వలన విశ్వములోని విశ్వశక్తి మనలోని సప్తచక్రాలను జాగృతి చేయును. కొబ్బరికాయను కొట్టుటవలన స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలవలన ఏర్పడిన కర్మలను ఆయనకు సమర్పించినట్లు అగును. ఎందుకంటే కొబ్బరికాయకు మూడు కళ్లు వుంటాయి. పీచు అనేది కర్మలు అన్నమాట. కళ్లు అనేవి మూడు శరీరాలకు ప్రతీక అన్నమాట. అదియుగాక మానవ స్పర్శ తెలియని నీళ్లు కొబ్బరికాయలోనే వుంటాయని గమనించుకోండి. అంటే పరిశుద్ధమైన నీళ్లతో ఆయనకు అభిషేకము చేసినట్లయితే అనగా కొబ్బరి నీళ్లతో అభిషేకము చేసినట్లయితే మనము గూడ అంత పరిశుద్ధంగా వుంటాము అన్నమాట.


శివరాత్రికి పగలంతా ఉపవాసం చేసి, రాత్రికి జాగరణ చేయాలంటారు. ఇందులో 'ఉప' అంటే దగ్గరగా, 'వాసం' అంటే నివసించడం అని అర్థం. జీవితం అనే పగలంతా లౌకిక విషయాలకి, విషయవాసనలకి దూరంగా వుండి, శివుడిని మనసులో నిలుపుకుని భక్తితో జీవించాలని, రాత్రి జాగరణ చేయడమంటే, నిద్రించే కుండలినీ శక్తిని మేల్కొలిపి షట్చాక్రాల్లోని కర్మలలో పేరుకొని వున్న చీకటిని నాశనం చేయాలని అర్ధం. అంటే ప్రతియోగ సాధకుడు నిత్యం మీ ఇష్ట దైవముతో అనుబంధముగా వుంటే షట్చక్రాలలోని జన్మ జన్మల కర్మలు, కర్మవాసనలు పోతాయని అనగా క్షయం అవుతాయని దీని అర్ధం.


కార్తీకమాసంలో శివాలయాలన్ని జ్యోతులతో నిండిపోతాయి గదా! అనగా జ్ఞానాత్ మహేశ్వరం అన్నమాట! అంటే జ్యోతి సాక్షాత్తు పరమాత్ముడు. జ్ఞానం అనే జజ్యోతిని వెలిగించుకొని, అంతర్గతంగా వున్న కామం అనే చీకటిని పారద్రోలి, హృదయంలోని శివుడ్ని దర్శించాలి అన్న దానికిది సంకేతం. అనగా ఎపుడైతే సాధకుడు బ్రహ్మజ్ఞాని అవుతాడో అపుడే దేవుడు ఎక్కడో లేడు మనలోనే వున్నాడు అని తెలుసుకొంటాడు అన్నమాట. ఈ విధంగా శివతత్త్వము ద్వారా యోగితత్త్వమును తెలుసుకోవచ్చును. అందుకే శివుడిని యోగికి ప్రతిరూపంగా వుంచారు. యోగి ఎలా వుండాలో శివుడి ద్వారా తెలియచేసినారు అన్నమాట.


యోగసాధకుడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి?


1)హృదయశుద్ధి అనగా బాహ్య శుద్ధి మరియు అంతరశుద్ధి వుండాలి. బాహ్యశుద్ధి అనగా ప్రతిరోజు స్నానాలు చేయటం మంచి దుస్తులు వేసుకోవటం లాంటివి. అంతరశుద్ధి అంటే మంచి ఆలోచనలతో మంచి పనులు చేయటంలాంటిది.


2)సుస్థిరమైన తత్త్వజ్ఞానమును కలిగివుండుట.


3)వివేక పూరితమైన బుద్ధిని కలిగివుండుట.


4)నిరంతరంగా యోగసాధన చేయటం.


5)మృదు స్వభావం కలిగి ఉండుట.


6)దయ, కరుణ, త్యాగము, అహింసను కలిగి ఉండుట.


7)తృప్తి, సేవ, ఓర్పును కలిగి ఉండుట.


8)అహంకారము లేకుండుట, కోపము లేకుండుట, ఆశ లేకుండుట.


9)దొంగబుద్ధి లేకుండా వుండాలి.


10)ప్రతిపనియందు సంతోషము, ఆనందము, తృప్తి కలిగి వుండాలి.


11)సమస్త కర్మల్ని ఈశ్వరార్పణ చేయటం.


12)సిగ్గువలన అనుచిత కార్యాలు చేయకుండా ఉండటం.


13)విషయానందములకు, విషయవాంఛలకు, విషయవాసనలకు దూరంగా వుండాలి. అనగా వైరాగ్యము కలిగి వుండాలి.


14)ఇంద్రియనిగ్రహము, మనోనిగ్రహము ఉండాలి.


15)ఇతరుల దోషాలను ప్రకటించకుండా ఉండుట.


16)ధర్మ నిష్టను, ధ్యాన నిష్ఠను కలిగి వుండుట.


17)పరిపూర్ణమైన విశ్వాసము, అమితమైన శ్రద్ధాసక్తులు ఉండాలి.


18)నిగర్వముగా, నిస్వార్థముగా వుండాలి.


19)విషయాలయందు అభిమానాదులు లేకుండా ఉండాలి.


20)శరణాగతి, మౌనముగా వుండుట, సత్యమునే పలుకుతూ వుండాలి.


21)మిత నిద్రను, మితాహారమును కలిగి వుండాలి. అదిగూడ క్రమాహారముగా అనగా ప్రతిరోజు ఒకే సమయములో తినటము, పడుకోవటము చెయ్యాలి.


22)అరిషడ్వర్గాల సాంద్రతను తగ్గించుకోవటం.


23)వినయం కలిగి వుండుట, గౌరవమర్యాదలు కలిగి వుండుట.


యోగసాధకుడికి తన సాధనలో కలిగే యోగవిఘ్నాలు గూర్చి తెల్పండి?


యోగాభ్యాసము అనగా ప్రతిరోజు సాధన చేయటం యోగాభ్యాసం అందురు. యోగాభ్యాసం చేసేటపుడు సాధకుడికి అనేక విఘ్నాలు ఎదురు అవుతాయి. అనగా ప్రతిరోజు సాధనను చేయగుండా అడ్డుపడతాయి. అంటే విఘ్నాలు అనేవి సాధకుడి మనస్సుకి ఏకాగ్రత లేకుండా (అంటే ధ్యానమునందు) అడ్డగిస్తూ వుంటాయి. అందువలన వీటిని యోగమలములు అని కూడ అంటారు. వీటి గురించి ప్రతి సాధకుడు తెలుసుకోవాలి. లేదంటే అతడు ఈ యోగమలాలకు లోనయ్యే ప్రమాదం ఉంది. ఈ విధమైన యోగమలాలు (విఘ్నాలు) తొమ్మిది రకాలని నిర్ణయింపబడ్డాయి. అవి 1. వ్యాధి, 2. ప్రమాదం, 3. స్త్యానము, 4. సంశయము, 5. అవిరతి, 6. ఆలస్యం 7. భ్రాంతి దర్శనం, 8. అలబ్ధ భూమికత 9. అనవస్థితత్వము అనేవి.


వ్యాధి :- శరీర ధాతువుల్లో, రసాల్లో వచ్చిన విషమత్వంవలన, హెచ్చు తగ్గులవలన అనగా హార్మోన్లు హెచ్చు, తగ్గులవలన జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లంతా నొప్పులు ఇలా మున్నగు రోగాలు, బాధలు వస్తాయి. అపుడు మనస్సు ఆవేదన చెంది ధ్యానమునందు సహకరించదు. అంటే శరీరం ఆరోగ్యంగా లేనపుడు మానసికమైన ఆరోగ్యం కూడా వుండదు గదా!


సంశయము :- ఒక వస్తువు గూర్చి లేదా ఒక విషయము గూర్చి స్థిరమైన నిశ్చయాత్మక జ్ఞానం లేకపోవటం సంశయం అవుతుంది. అంటే ఈ పనిని ఇట్లా చేయవచ్చా? చేయరాదా? ఏది మంచి పని? లేదా ఏది చెడ్డ పని? ఇలా మున్నగు విషయాలయందు సరియైన నిర్ణయము తీసుకోకపోవటం వలన తద్వారా మనస్సు ఆందోళనపడి నేను చేసినది రైటా? తప్పా? అనే సందేహలతో మనస్సు వుంటుంది. దీనివలన గూడ ధ్యానమునందు మనస్సు సహకరించదు. అందుకే ప్రతి విషయమునందు ఒకే స్థిరమైన నిర్ణయముండాలి. దానివలన మనస్సుకి ఎలాంటి అనుమానములకు తావు వుండకూడదు.

స్త్యానము :- స్త్యానము అంటే స్తబ్ధతగా ఉండటం. అంటే ఎటువంటి పని చేయకుండా స్తబ్ధతగా వుండటము స్త్యానము అవుతుంది. మంచి పనులయందు అనాసక్తి, చెడు పనులయందు ఆసక్తి, దుష్ట కర్మలయందు అనగా చెడుపనులయందు ఆసక్తి, దుష్ట కర్మలయందు అనగా చెడు పనులయందు గూర్చిన ఆలోచనలు ఎక్కువగా చేయటంవలన మనస్సు స్తబ్ధతగా తయారు అవుతుంది. దీనివలన ధ్యానములో మనస్సు చేష్టారహితమైన స్థితిలో వుండి ధ్యానయోగ సాధనకు అంతరాయాన్ని కలిగిస్తుంది.

ప్రమాదము :- ధ్యానముకుగాని, సమాధి స్థితియందు సరియైన అవగాహన లేకపోవటం, సాధన క్రమమును సరిగా అర్ధము చేసుకోకపోవటం అనగా ధ్యానము, జపము, ప్రాణాయామము ఎలా చేయాలో తెలుసుకోకపోవటం ఒకవేళ తెలిసిన తప్పుగా తెలుసుకోవటం లేదా తప్పుగా గ్రహించటం లేదా చేయటం వలన ప్రమాదాలు ఎదురు అవుతాయి. దీనివల్ల సాధకుడు ఉదాసీన భావంతో అనగా నిరుత్సాహముగా వుంటాడు. ఇది గూడ ఒక విఘ్నం అవుతుంది.

ఆలస్యము :-  శరీరమునకు మనస్సు భారంగా ఉన్నట్లుగా తోచి, విశ్రాంతి కావాలనే భావం వలన ఎల్లప్పుడు నిద్రావృత్తిలో వుంటాడు. అంటే శరీరానికి, మనస్సుకు విశ్రాంతి నీయాలనే తపనలో ఉంటాడు. అనగా అవసరము లేకున్నా శరీరానికి, మనస్సుకు ఎక్కువ విశ్రాంతి ఇస్తాడు. తద్వారా మనస్సు ఇంద్రియసుఖాలకు అలవాటుపడును. తద్వారా ధ్యానమునకు సహకరించదు.

అవిరతి :- అనగా కోరిక కలిగి వుండుట. విషయ వాసనలు అనుభవించటం వలన కలిగే సుఖాలు, ఆనందాలు, సంతోషాలు, మనస్సుకు తెలియటం. అనగా కోరికను అనుభవించటంవలన తెలుస్తాయి గదా! తద్వారా ఆ మనస్సు విషయవాసనలకు లోబడి, ఆత్మనుగూడ లోబరుచుకుంటుంది. దానికి ప్రలోభాన్ని కలిగిస్తుంది. ఇది సాధనకు ఆటంకం కలిగిస్తుంది. అనగా విషయాలను అనుభవించటం తద్వారా తనను ఇతరులు పొగడాలని అనుకోవటం అట్లా పొగడినపుడు ఉబ్బిపోవటం లాంటివి సాధకుడు చేస్తాడు. దీనివలన సాధకుడిలో అహంకారము పెరుగును. తద్వారా యోగసాధనకు విఘ్నం కలుగుతుంది.


భ్రాంతి దర్శనం :- అంటే సాధకుడికి ధ్యాన అనుభవాలు, అనగా దైవదర్శనాలు, దైవ

సాక్షాత్కారాలు అనగా ఇష్టదేవత సాక్షాత్కారాలు, జ్యోతి దర్శనాలు, సూక్ష్మశరీరాల దర్శనాలు

ఇలాంటివి కలుగుతాయి. ఇలాంటి అన్నియు మనోభ్రమలే. అనగా భ్రాంతి దర్శనాలే.

అంటే జడాన్ని చేతనంగాను, చేతనాన్ని జడంగాను, ఆత్మను అనాత్మగా, అనాత్మ ఆత్మగాను

దర్శనం ఇస్తాయి. అంటే సాధకుడు తన ధ్యానంలో మూడు గంటలపాటు ఉంటే ఇలాంటివి

భ్రాంతి దర్శనాలు కల్గుతాయి. వీటిని సాధకుడు దాటుకొని తురీయాతీతమైన స్థితికి

అనగా బ్రహ్మానందరహిత స్థితికి రావాలి. లేదంటే ఈ భ్రాంతి దర్శనాలే యోగసాధనకు

విఘ్నాలు కలిగిస్తాయి.


అలబ్ధ భూమికత :- ఇలాంటి మనోభ్రాంతి దర్శనాలు వలన మనస్సు ఎంతో ఆనందపడి

పోతూ వుంటుంది. తద్వారా సమాధి ప్రాప్తి కలుగకపోవటం జరుగుతుంది. ఈ మనోభ్రాంతి

దర్శనాలే చివరి, ఆఖరి దర్శనాలు అనుకొని తమ యోగసాధనను ఆపివేస్తారు. తద్వారా

వీరికి సమాధిస్థితికి అవసరమైన మానసిక స్థితి లభించకపోవటం జరుగుతుంది. తద్వారా

సాధకుడికి సమాధి యోగముండదు.


అనవస్థితత్త్వం :- సమాధి ప్రాప్తి కలిగినప్పటికి సాధకుడు మనస్సు ఈ సమాధి స్థితి

యందు స్థిరంగా ఉండదు. ఇది తత్త్వదర్శి స్థాయిలో వుండగానే ప్రతి సాధకుడు ఈ

సమస్యను ఎదుర్కొంటాడు. దానికి ఇట్టి సాధకుడు, ప్రతిరోజు ధ్యాన సమాధిస్థితిని మనస్సుకు

అలవాటు చేయాలి. లేదంటే సాధకుడు క్షణిక సమాధి స్థితినే పొందుతాడు. దీర్ఘ సమాధి

స్థితి (అనగా ఎక్కువ రోజులపాటు సమాధిస్థితి) ని పొందలేడు. గమనించుకోండి.


యోగ విఘ్నాలు వలన సాధకుడికి వచ్చే దోషాలు తెల్పండి?

యోగ విఘ్నాలు వలన సాధకుడికి నాలుగు రకాల దోషాలు వస్తాయి. అవి

దుఃఖము,

అంగమే జయత్వము,

దౌర్మనస్యము,

శ్వాసప్రశ్వాసలు.


దుఃఖము :- ఇది మూడు విధాలుగా ఉంటుంది. అవి 1. ఆధ్యాత్మిక దుఃఖము, 2. అధి

భౌతిక దుఃఖము, 3. ఆదిదైవిక దుఃఖాలు. ఇందులో ఆధ్యాత్మిక దుఃఖము అనేది రాగం,

ద్వేషం, అవిద్య, అజ్ఞానం, మొదలైన వాటివలన కలిగే దుఃఖాలు. ఈ దుఃఖాలు అనేవి

శారీరక, మానసిక దుఃఖాలు! ఇప్పుడు అధి భౌతిక దుఃఖాలు అనేవి ఇతర జంతువులవలన

అనగా పులులు, సింహాలు, పాములు మున్నగు వాటివలన రజోగుణ, తమోగుణ ప్రాబల్యం

వలన కలుగుతాయి ఇక అధిదైవిక దుఃఖాలు అనేవి మానసిక చాంచల్యం, ఇంద్రియ చాంచల్యం వల్ల కలిగే అశాంతి, అనావృష్టి, అతివృష్టి, భూకంపాదులు, అతిశీతాతపబాధలు, యక్ష, రాక్షస, పిశాచాదులవలన కలుగుతాయి.


దౌర్మనస్యము :- బాహ్య కారణాలవలనగాని, అంతరికమైన కారణాలవలన గాని మనస్సు చంచలమై, ఏ విధమైన సంతోషము లేకుండా ఉండటాన్ని దౌర్మనస్యమంటారు.


అంగమే జయత్వం :- ధ్యానం చేస్తున్నపుడు శరీరావయవాలు కంపించటం, స్థిరంగా కూర్చండ లేకపోవటం, మనస్సు నిలకడగా ఉండకపోవటం, ఈ కారణాలవలన ధ్యానయోగానికి విఘ్నం వాటిల్లుతుంది.


శ్వాస ప్రశ్వాసలు :- అనగా గాలిని పీల్చటం, వదలటం అన్నమాట. అనగా శ్వాసక్రియ జరగటం అన్నమాట. శ్వాస ప్రశ్వాసలు వేగంగా జరగటంవలన రకరకాల ఆలోచనలు పుట్టి మనస్సు స్థిరంగా ఉండదు. అందుచేత శ్వాస ప్రశ్వాసలు క్రమపద్ధతిగా, నిదానముగా, జరిపినట్లయితే ఆలోచనలు తగ్గి ఏకాగ్రత వస్తుంది. తద్వారా మనస్సు ధ్యానమునందు ఉంటుంది.


సాధకుడు యోగ విఘ్నాలను, దోషాలను ఎలా నివృత్తి చేసుకోవాలి?

నిరంతర ఈశ్వరప్రణిధానం చెయ్యాలి. అనగా సాధకుడు తన సమస్త కర్మల్ని ఈశ్వరార్పణ చేయటం, తన శక్తియుక్తుల్ని, తన ప్రాణాల్ని, మనస్సును, బుద్ధిని, ఆత్మను సర్వస్వాన్ని ప్రేమ భావంతో ఈశ్వరుడికి అర్పించటం చేయాలి. ఇది తేలికైన విషయము గాదు. ఎందుకంటే సాధకుడు నిరంతరంగా ప్రణవ జపముగాని, మీ ఇష్టదేవత మంత్రముగాని చేస్తూండాలి. అనగా మంచం మీద పడుకున్న, ఆసనం మీద కూర్చొన్న, మార్గంలో నడుస్తున్నా, ఏవైనా పనులు చేస్తూన్న ఎల్లప్పుడు ఏకాగ్రతతో మనస్సుతో నిరంతరం మానసిక జపము చేయాలి. అపుడే యోగవిఘ్నాలు, దోషాలు, నివృత్తి అవుతాయి. ఉదాహరణకు ప్రణవ జపము అనగా ఓంకారము ఎలా చేయాలో తెలుసుకోండి.


పరమేశ్వరునికి ఓంకారం అనేది పేరు! ఈ 'ఓం' అనేది (ప్రణవం) పరమేశ్వరుని తప్ప ఇతరమైన దానిని దేనిని సూచించదు. పరమేశ్వరునికి ఎన్ని పేర్లైనా ఉండవచ్చును. వాటి అన్నింటిలోకి ఉత్తమోత్తమమైన పేరు ఓంకారం. అనగా ఓంకారమే -ప్రణవమే- పరమేశ్వరుడనే భావంతో, ఓంకార జపం చేయాలి. జపం చేసేటపుడు ఆ ప్రణవం యొక్క అర్ధాన్ని లోలోపల భావన చేస్తూ జపించాలి. అలాగే 'ఓం' అనే అక్షరంలో అ+ఉ+మ+ అర్థమాత్ర అనే 3 1/2 అక్షరాలున్నాయి. 'అ' కార మనేది సూర్య తత్త్వమునకు 'ఉ' కారమనేది చంద్రతత్త్వమునకు 'మ' కారమనేది అగ్నితత్త్వమునకు, అర్థమాత్ర అనేది ఆనందస్థితికి ప్రతీకలు. అలాగే ప్రతి ఓంకారాన్ని 21 సెకనులు తక్కువగాకుండా అంటే శబ్దము ఆపకుండా ఉచ్చరించుచూ, ఇదే విధంగా 24 మార్లు ఓంకారము అది గూడా ఒకే ఆసనములో యుండి ఉచ్చరించిన వారి మెదడులో తీటావేవ్స్ పెరిగినట్లుగా కనుగొనబడినదని బీహర్ స్కూల్ ఆఫ్ యోగావారు తెలియచేశారు.


యోగాంగాలు లేదా యోగసాధనాలు తెల్పండి.

ఈ యోగాంగాలు లేదా యోగసాధనాలు గూర్చి రకరకాలుగా చెపుతున్నాయి శాస్త్రాలు ! ఉదాహరణకు అష్టాంగాలనే యోగసాధనాలని పతంజలి మహర్షి చెప్పియున్నారు. అదే ఘేరండ సంహితలో యోగసాధనలు సప్తయోగ సాధనలని అన్నారు. యోగ చూడామణ్యుపనిత్తులో ఆరు అంగాలే యోగసాధనలు అన్నారు. వీటిలో అత్యంత ప్రాచుర్యం పొందినవి, సాధనను వీలుగా చేసుకొనుటకు ఉపయోగపడే సాధనాలు పతంజలి యోగసాధనలే! అందుకే వీటిని అష్టాంగ యోగము అనే అధ్యాయములో వివరంగా వివరించాను. ఇక తర్వాత ప్రాచుర్యము పొందినవి ఘోరండ సహితలో చెప్పిన సప్త సాధనాలు. వీటి ద్వారా యోగసాధన చేయాలంటే నిజమైన అనుభవశాలి గురువు సమక్షములోనే చేయాలి. అంటే ఈ సాధకుడు నిరంతరం గురువు సమక్షంలో యోగసాధనలలో ధ్యానము, ప్రాణాయామము, ఆసనాలు, గురువుల సమక్షములో నేర్చుకొని ఇంటివద్ద అభ్యాసము చేయవచ్చును గాని ఘేరండ సంహితలో చెప్పిన సప్త సాధనలు ఇలా చేయడానికి వీలులేదు. గురు సమక్షంలోనే చేయాల్సి వుంటుంది. ఇపుడు ఘేరండ సంహితలో చెప్పిన సప్త సాధనలు చూద్దాం.


అవి 1. శోధనం 2. ధృడత్వం, 3. స్థైర్యం 4. ధైర్యం 5. లాఘవం, 6. ప్రత్యక్షం, 7. నిర్లిప్తం. వీటినే సప్తసాధనలు అందురు. ఇవి ఘేరండ సంహితలోనివి.


శోధనం : శోధనం అనగా శరీరాన్ని శుద్ధి చేసుకోవటం. దీని కోసము షట్కర్మలు అవసరం. అవి ధౌతి, వస్తి, నేతి, లౌకికీ, త్రాటక, కపాలభాతి అనేవి షట్కర్మలు. ఇక్కడ వీటిని పూర్తిగా వివరించటం లేదు. ఎందుకంటే వీటిని అనుభవ గురువుల సమక్షంలో నేర్చుకొని సాధన చేయాల్సి ఉంటుంది.


ధృడత్వం :- శరీర ధృడత్వం కోసము యోగాసనాలు అవసరం. ఇందులో 64 ఆసనాలు చెప్పితే, పతాంజలి మహర్షి ఎనిమిది ఆసనాలు చెప్పియున్నారు. ఈ ఆసనాలు గూడ అనుభవ గురువుల సమక్షంలో నేర్చుకుని సాధన చేయాలి.


స్థైర్యం :- దీని కోసం పంచవింశతి (25) రకాల ముద్రలను అభ్యాసం చేయాలని చెప్పారు. ఈ ముద్రలలోని రహస్య క్రియలవలన కుండలినీ శక్తిని మేల్కోల్పటానికి, షట్చ్ క్రాలభేదనానికి, గ్రంధుల భేదనానికి ఉపయోగిస్తారని చెప్పటం జరిగినది. కాబట్టి యోగాసనాలు కంటే వీటికే అధిక ప్రాధాన్యత ఉందని చెప్పారు. ఈ ముద్రలు గూడ అనుభవ గురువుల సమక్షములో నేర్చుకోవాలి.


ధైర్యం :- ప్రత్యాహారం వల్ల ధైర్యం సిద్ధిస్తుంది. మనస్సును ఇతరములైన సమస్త విషయాలనుండి మళ్లించి ఆత్మవశం చేయడమే ప్రత్యాహారం! అందుకు అరిషడ్వర్గాలను జయించటం, శరీరమందు ఆత్మాభిమానాన్ని కలిగించే అజ్ఞానాన్ని అనగా మోహం తొలగించటం అవసరం. ఎందుచేతనంటే మనస్సే బంధాలకు మూలం కాబట్టి! అనగా మనస్సే ప్రపంచం కాబట్టి దానిని శుద్ధి చేసుకోవాలి. మనస్సును బట్టి నడవడి ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటే శుభ అశుభకర్మలు అన్ని నశిస్తాయి. అనగా కర్మ క్షయం అవుతుంది.


లాఘవం :- లాఘవం కోసం ప్రాణాయామం అవసరం. దీనికి వైజ్ఞానిక పద్ధతిలో, చక్కగా శ్వాస ప్రశ్వాసలను అదుపులో పెట్టుకొని చేయాలి. అపుడే దీని ద్వారా మానవుడు దేవత అవుతాడని చెప్పబడినది. గాకపోతే దీనికి స్థానము, కాలము, మితాహారము, నాడిశుద్ధి అవసరమని తెలుస్తోంది.


ప్రత్యక్షం :- ధ్యేయాన్ని ప్రత్యక్షం చేసుకోవాలంటే అనగా మంత్ర దేవతలు ప్రత్యక్షం చేసుకోవాలంటే నిరంతరం ధ్యానం అవసరం. ఘేరండ సంహితలో ఈ ధ్యానాన్ని మూడు రకాలుగా అనగా స్థూల ధ్యానము, జ్యోతిర్థ్యానము, సూక్ష్మ ధ్యానము అని చెప్పారు. శివుడు, విష్ణువు, అమ్మవారు ఇలా మొదలైన స్థూలంగా ఉండే విగ్రహాలను గూర్చిన ధ్యానం స్థూలధ్యానం అవుతుంది. అదే జ్యోతి స్వరూపుడైన పరమాత్మను గూర్చిన ధ్యానం జ్యోతి ధ్యానం అవుతుంది. అంటే మూలధార క్రింద భాగములో కుండలినీ శక్తి వుంటుంది. అక్కడే దీపకళికలాగా జీవుడు ఉంటాడు. ఆస్థానంలో జ్యోతి స్వరూపుడైన పరమాత్మను ధ్యానం చేయటం అన్నమాట! ఇక శాంభవి ముద్ర ద్వారా కుండలినీ శక్తిని ధ్యానించటం సూక్ష్మధ్యానం అవుతుంది.


నిర్లిప్తత :- అనాసక్తి స్థితికోసం సమాధిస్థితి అవసరం అవుతుంది. ఈ చెప్పిన సాధనలను అభ్యాసం చేయటంవల్ల మోక్షప్రాప్తి కలుగుతుంది. ఇంతవరకు ఘేరండ సంహిత చెప్పబడిన సప్తయోగ సాధనలు ఇవే! ఇపుడు పతాంజలి మహర్షి చెప్పిన అష్టాంగాలు గూర్చి సంక్షిప్తంగా తెలుసుకుందాం. ఎందుకంటే అష్టాంగ యోగములో వివరంగా వివరించాను కాబట్టి!


యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి అనేవి అష్టాంగాలు. వీటినే అష్టాంగ సాధనలు అందురు. వీటిని పతంజలి మహర్షి వివరించారు. వీటిలో ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి స్థితులు నేరుగా యోగంతో దగ్గర సంబంధం కలవి! కాబట్టి వీటిని అంతరంగ సాధనలు అంటారు. అదే యమము, నియమము, ఆసనము అనేవి మూడు ఆరంభ దశలో సాధకుడికి సహాయకారులుగా వుంటాయి. అందువలన వీటిని బాహ్య లేదా బహిరంగ సాధనలు అందురు. కాబట్టి ఈ అష్టాంగాలు గూర్చి పూర్తిగా అధ్యాయనం చేయాలంటే అష్టాంగయోగము అనే అధ్యాయమును చదివి తెలుసుకోగలరు. వీటినే ఉపయోగించుకొని యోగసాధనను కొనసాగించండి. మోక్షప్రాప్తిని పొందండి.

యోగసాధనను ఎవరు చేయుటకు అర్హులు? ఏ కాలాలు మంచివి?

యోగసాధకుడికి ఉండాల్సిన యోగలక్షణాలతో పాటు ఉత్సాహం, సాహసం, ధైర్యము, తత్త్వజ్ఞానము, నిశ్చయము, లోకుల యొక్క సాంగత్యానికి దూరంగా ఉండటం అనేవి సాధకునికి ఉండాల్సిన గుణాలు. ఈ లక్షణాలున్నవారు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల్లో ఎవరైనా సరే, అలాగే స్త్రీ, పురుష బేధం లేకుండా, అలాగే యువకులు, వృద్ధులు, రోగిష్టివాళ్లు, బలహీనులు ఎవరైనా సరే యోగసాధన అనగా యోగాభ్యాసము చేయవచ్చును. గాకపోతే వీరందరిని నేను పైన చెప్పిన లక్షణాలున్నపుడే మోక్షప్రాప్తి లభిస్తుంది. కాకపోతే మంచి నిజమైన గురువు మాత్రం అవసరం! ఈ విషయాన్ని ముండకోపనిషత్తులో చెప్పబడినది. అలాగే కఠోపనిషత్తులో ఆత్మబుద్ధి అనేది తర్కంవల్ల లభించేది గాదు. ఇతరులవల్ల బోధింపబడినపుడే అనగా నిజమైన గురువు వల్ల లభిస్తుంది అన్నారు. కాని ఈ కాలమునందు ఎవరు నిజమైన గురువులో, ఎవరు నకిలీ గురువులో అర్థము కావటం లేదు. అందుకు బ్రహ్మవిద్యోపనిషత్తులో సాక్షాత్తు గురువే హరి, నిజమైన గురువును మించిన భగవంతుడు లేడని చెపుతోంది! దీనిని బట్టి చూస్తే ప్రతి యోగసాధకుడికి సద్గురువు ఉండాలి. మరి గురువు ఉండాలంటే మనకు ఎవరు నిజమైన గురువో. ఎవరు నకిలీ గురువో తెలియాలి. అందుకు ఇష్టదేవతను అనన్యమైన భక్తి అనగా పరమభక్తితో ఆరాధన చేసినట్లయితే ఆ దేవతానుగ్రహం వలన నిజమైన గురువు సాధకుడి దగ్గరకు వస్తాడు. ఇది నిజమే! గురువు కోసం సాధకుడు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరముండదు! యోగ సాధకుడు చేయాల్సిందల్లా మీ ఇష్టదేవత అనుగ్రహం పొందటం! తర్వాత అంతా ఆయనే చూసుకొంటాడు! మీరు దానికి సాక్షిభూతంగా ఉంటారు. కాకపోతే దేవతానుగ్రహం పొందటానికి కొన్ని ముఖ్య విషయాలు తెల్సుకోవాలి.


మనం ఉపాసన చేసేటప్పుడు గాని, ఆసనము వేసేటప్పుడుగాని, విగ్రహారాధన చేసేటప్పుడుగాని ముందుగా ఇంద్రియాలన్నిటినీ నిగ్రహించి, మనసును పరిశుద్ధంగా వుంచుకోవాలి. అలాగే ప్రశాంతమైన ప్రదేశంలో సుఖంగా ఉండేటట్లు కూర్చుండి మనస్సును పరమాత్మవైపుకు మరల్చాలి. అనగా మానసిక జపం చేయాలి. అపుడు ఆ పరమాత్మ గురించే ఆలోచించాలి. ఆయననే ధ్యానించాలి. మనస్సునందు, ఆయన రూపము ముద్రపడాలి. ఆయనందే మనస్సు లీనంగావాలి. ఈవిధంగా చేయని పూజగాని, ఉపాసనగాని, జపంగాని, ధ్యానంగాని సత్ఫలితాన్ని ఈయదు. దేవతానుగ్రహం మనకు కలుగదని గమనించుకోండి.


అలాగే అధికాహారం తినటం, అనేక పనులు కోసం ప్రయత్నించి శరీరానికి అధిక శ్రమ కల్గించటం, అనేకమైన నియమాలను ఒక్కసారిగా ఏర్పరచుకొని వాటిని పాటించటానికి పూనుకోవటం, దుష్టజనుల (చెడ్డ వ్యక్తుల) స్నేహాలను కలిగివుండటం, అలాగే చిత్త చాంచల్యం కలిగి ఉండటం అనేవి యోగాభ్యాసాన్ని పాడు చేస్తాయి. గుర్తుంచుకోండి.


ఇక యోగాభ్యాసకునికి హితమైన ఆహారము ఏమిటంటే, శాలిధాన్యం, గోధుమపిండి, పెసర, మినుములు, సెనగలు, యవలు మొదలైనవి బాగుచేసి ఉడికించి తినవచ్చు. పొట్లకాయ, పనసకాయ, కాకర, దానిమ్మ, అరటి, అత్తి మొదలైనవి తినవచ్చును. ఆరంభంలో నెయ్యి, పాలు మంచివి. అభ్యాసం దృఢమైన ఈ నియమాలు ఉండవని గమనించుకోండి.


యోగాభ్యాసారంభానికి అనువైన కాలాలు అనగా వసంత, శరదృతువులు ఈ రెండు యోగాభ్యాసం ఆరంభించటానికి అనువైన కాలం అని, ఈ కాలంలో ప్రారంభించటంవలన విఘ్నాలు రావని, వచ్చినా వెంటనే తొలగి పోతాయని శాస్త్రాలు చెపుతున్నాయి. హేమంత, శిశిర, గ్రీష్మ, వర్షరుతువులు, యోగాభ్యాసం ఆరంభించటానికి తగిన ఋతువులు కావు. ఎందుకంటే ఈ ఋతువులు యోగారంభకులకు రోగాల్ని కలిగిస్తాయని శాస్త్రాలు చెపుతున్నాయి.

యోగాభ్యాసము లేదా యోగసాధన అంటే ఏమిటి? ఎందుకు చెయ్యాలి?

ప్రతిరోజు క్రమము తప్పకుండా, వేళ తప్పకుండా, ప్రతి నిత్యము అష్టాంగ యోగములోని యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము ద్వారా సమాధిస్థితి పొందుటకు సాధన చేయుటను యోగాభ్యాసము అంటారు. అనగా యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ధ్యానం, జపము, ఉపాసన, తపస్సు ఈ సాధనలనుపయోగించి సమాధిస్థితి పొందాలి. అందుకు తీవ్రమైన సాధన చేయాలి. దీనికి ఎటువంటి సోమరితనం, బద్ధకం, అతినిద్ర, అలసత్వము, అనాసక్తి, అశ్రద్ధ, అహంకారము ఇలా మున్నగు దుర్గుణాలు ఉండకూడదని సాధకుడు గ్రహించాలి. ఈ యోగసాధన ఎందుకు చేయాలంటే ధ్యానముచే నీ మనస్సును పరిశుద్ధము చేసుకొనుటకు చేయాలి. అలాగే నీ బుద్ధిని వివేకపూరితంగా, పవిత్రంగా చేసుకొనుటకు చేయాలి. అలాగే నీ మనస్సును నాశనము చేసి కర్మవాసనలను క్షయం చేసుకొనుటకు సాధన చేయాలి. అలాగే అహంకారాన్ని, అహంభావాన్ని, అహమును నాశనము చేయడానికి సాధన చేయాలి. నీవు సాధారణ వ్యక్తివికాదని అసాధారణశక్తి స్వరూపమని, గ్రహించుటకు యోగాభ్యాసమును చేయాలి. నీవు సర్వజ్ఞుడివై బ్రహ్మజ్ఞానమును తెలుసుకొనుటకు సాధన చేయాలి. అంటే నీవు పరిపూర్ణ బ్రహ్మజ్ఞానిగా మారి సాక్షాత్ పరబ్రహ్మ కావడానికి యోగసాధన చేయాలి. నీవు సర్వం బ్రహ్మమయంగా దర్శించి దైవసేవ చేయడం కోసం సాధన చేయాలి. అంటే నీవు ఎందుకు పుట్టావో, ఈ జన్మలో నీ కర్తవ్యం ఏమిటో గ్రహించటం కోసము యోగసాధన చేయాలి. అనగా జీవన్ముక్తుడవ్వడం కోసము యోగ సాధన చేయాలి.


యమము, నియమాలతో మనస్సును పరిశుద్ధము చేసుకొండి! ఆసనాలతో శారీరక దోషాలను, రోగాలను పోగొట్టుకొండి. ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ప్రక్రియలతో మనస్సును ఆధీనము చేసుకొని, కర్మలు, కర్మవాసనలు క్షయం చేసుకొండి. ధ్యానము ద్వారా మానసిక దోషాలను పోగొట్టుకొండి. సమాధిస్థితి ద్వారా ఆత్మ దర్శనము పొంది అజ్ఞాన కల్మషమును పోగొట్టుకొండి. తద్వారా జననమరణ చక్రము నుండి విడివడి జీవన్ముక్తిని పొందండి. దానికై యోగ సాధనను క్రమము తప్పకుండా, ప్రతి రోజు, నిరంతరంగా దైవ ధ్యానము చేసుకోండి.


యోగసాధనలో వచ్చే ఆరాధన ప్రక్రియ విధానాలు తెల్పండి?

ఆరాధన ప్రక్రియ అనగా నిరాకార లేదా ఆకార పరబ్రహ్మమును పూజించుటను ఆరాధన అందురు. అందులో 1. విగ్రహారాధన, 2. విశ్వారాధన, 3. ధ్యానము ద్వారా ఆరాధన అనగా యోగధ్యానం!


ఇందులో విగ్రహారాధన అనేది భక్తి, పూజ, ఉపాసన, అనే ఉపభాగాలుంటాయి. భక్తి అనేది విగ్రహారాధనలో దైవభక్తిగా చెపుతారు. దైవభక్తి అంటే 33 కోట్ల మంది దేవతలలో తనకు ఇష్టమైన దైవాన్ని అనన్యమైన భక్తితో ఆరాధన చేయుటను దైవభక్తి అందురు. ఈ భక్తి ద్వారా క్షణికమైన తన్మయత్వస్థితి కలుగుతుంది. అపుడు ఇష్టదేవత అనుగ్రహం కలుగుతుంది. పూజ అనేది బాహ్యపూజ, అంతరపూజలు ఉంటాయి. బాహ్యపూజ అనేది విగ్రహానికి షోడశోపచారపూజా విధానాలతో పూజ చేయుటను బాహ్య పూజ అందురు. ఇక ఉపాసనలో సగుణోపాసన, నిర్గుణోపాసన అనేవి ఉంటాయి. ఇందులో సగుణోపాసన అనేది విగ్రహారాధనకు సంబంధించిన విధానము. అంటే దైవభక్తి, బాహ్యపూజ, సగుణోపాసన అనే ప్రక్రియలు దైవాన్ని ఆరాధనగా భావించుకొని చేసే ఆరాధనకు సంబంధించినవి.


ఇపుడు దైవాన్ని ఆకారుడిగా భావించుకోవాలంటే విగ్రహారాధన ద్వారానే సాధ్యపడుతుందని తెలుస్తోంది గదా! అనగా విగ్రహారాధన వలన నిగ్రహం ఏర్పడునని తెలుసు గదా! అదిగూడ విగ్రహమును విగ్రహముగా గాకుండా సజీవ రూపముగా ఉన్నదని భావించుకొని ఆరాధన చేయాలి. ఉదా:- మీరు అమ్మవారి విగ్రహారాధన చేస్తూన్నట్లయితే అక్కడ ఆ విగ్రహము స్థానములో సజీవ మూర్తిగా అమ్మవారు ఉన్నట్లు భావించుకొని ఆరాధన చేసినట్లయితే అది అసలు సిసలైన విగ్రహారాధన అవుతుంది. ఈ విధమైన ఆరాధన చేస్తేగాని అనన్యమైన భక్తి అలవడదు. ఈ భక్తి లేకపోతే దైవానుగ్రహం కలుగదు. తద్వారా అనుభూతి అనేది వుండదు. అదే విగ్రహారాధనలో విగ్రహమును విగ్రహముగానే భావించుకొని ఆరాధన చేసినట్లయితే ఇలా ఎన్ని యుగాలు పాటు చేసిన ఎటువంటి ఉపయోగము లేదని గ్రహించండి. విగ్రహాంలో సజీవ మూర్తిని చూడగల్గితేనే రామకృష్ణ పరమహంసకు కాళికాదేవి కనిపించినది. అలాగే జ్ఞానదేవుడికి, నామదేవుడికి పాండురంగడు దర్శనమిచ్చాడు.


అదే దైవాన్ని నిరాకారుడిగా భావించుకొని ఎలా ఆరాధన చేయాలో చూద్దాం. ఈ ఆరాధన చేయాలంటే మానసిక పూజ విధానము అనగా అంతరపూజ చేయాలి! అలాగే నిర్గుణోపాసన విధానము చేయాలి! అనగా మీ మనస్సు మీ ఇష్టదేవత రూపమును ఊహించుకోవాలి ! ఆ దేవతకు మానసికముగా షోడశోపచార పూజావిధానము చేస్తున్నట్లుగా హారతి ఇస్తున్నట్లుగా, ఇలా భావనలతో ఆరాధన చేయాలి. దీనినే నిర్గుణోపాసన లేదా అంతరపూజ లేదా విశ్వారాధన అందురు. ఈ పూజా విధానమువలన ప్రతిజీవిలోను ప్రతివస్తువులోను మీ ఇష్టదేవత కనపడుతుంది. దీనినే విశ్వారాధన అందురు. కాకపోతే ఈ ఆరాధన చేయాలంటే సాధకుడు కనీసము మూడు సం॥రాలు విగ్రహారాధన చేయాలి. అపుడే విశ్వారాధన అలవడుతుంది. ఈ ఆరాధన చేసేటపుడు విగ్రహారాధనతో పని ఉండదు. ఎందుకంటే ఈ ఆరాధన వలన తనలోనే దైవమున్నాడని తెలుసుకొంటాడు గదా! అదే విగ్రహారాధన వలన తను పూజించే విగ్రహములో దేవుడున్నాడని తెలుసుకొంటాడు. ఉదా:- విశ్వారాధన ద్వారా అనగా నిరాకార ఆరాధన ద్వారానే తులసీదాసుకి శ్రీరామ సాక్షాత్కారము కలిగినది.


ఇక యోగపరంగా ఆరాధన క్రమమును వివరిస్తాను. చూడండి. అందుకు ప్రతి సాధకుడు చక్రధ్యానము చేయాలి. ఇది ఎలా చేయాలో కుండలినీ యోగము అనే అధ్యాయములో కుండలినీశక్తిని సాధకుడు ఎలా జాగృతి చేసుకోవాలి? అనే ప్రశ్నలో వివరించారు. అదే విధంగా ద్వారా కాలాలు అష్టాంగ యోగములో దైవమునకు సంబంధించిన ప్రశ్నలో వివరించారు. యమ,నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానము, సమాధి. అలాగే చక్రధాన్యము అనగా షట్చ్ క్రాల ఆరాధన గూర్చి తెలుసుకోండి.


యోగసాధకుడికి ఉండవలసిన ఆరాధన ఏమిటి?

విశ్వారాధన అనేది ప్రతి యోగ సాధకుడికి ఉండవలసిన ఆరాధన. అలాగే అంతరపూజ, చక్రధ్యానం ఉండాలి. ఇపుడు విశ్వారాధన అనగా మనకంటికి కనిపించే కోట్లాది దేహధారులలో ఎవరికి వారు తాము వేరు అనుకోవడంతో అనేక రాగద్వేషాలు వచ్చి మనల్ని తగులుకుంటున్నాయి. “అంతా ఒక్కటే! ఎదుటివాడి శరీరంలోని ఆత్మను నేను అని భావించగలిగితే ఇక రాగద్వేషాలు, ఇష్టాయిష్టాలు, కోపతాపాలు, సుఖదుః ఖాలు, కష్టనష్టాలు అనేవి వుండవు. ఇది విశ్వారాధనవలనే సాధ్యపడుతుంది. అందుకే విశ్వారాధన ప్రతిసాధకుడికి ఉండాలి అనేది. ఈ ఆరాధనవలన ఉన్నది బ్రహ్మమే! మిమ్మల్ని కొట్టేవాడు బ్రహ్మమే! మిమ్మల్ని సంతోషపెట్టేవాడు బ్రహ్మమే! మిమ్మల్ని పొగిడేవాడు బ్రహ్మమే! మిమ్మల్ని హెచ్చరించేవాడు బ్రహ్మమే! మిమ్మల్ని చంపేవాడు బ్రహ్మమే! చనిపోయేవాడు బ్రహ్మమే! మీరు తినేది బ్రహ్మమే! చూపించినవాడు బ్రహ్మమే. కనపడినవాడు బ్రహ్మమే. ఇలా చెప్పుకుంటూపోతే చాలా వుంటాయి. అనగా విశ్వములో శూన్యము ఎలా అయితే ఉన్నదో అలా ఈ విశ్వములోని ప్రతిజీవిలోను, ప్రతి పదార్ధములోను బ్రహ్మమున్నాడని తెలుసుకోవటమే విశ్వారాధన అవుతుంది. బ్రహ్మము కానిది ఏది లేదని తెలుసుకోవాలి. ఈ అనుభూతిని అనుభవ పూర్వకముగా తెలుసుకోవాలి. అందుకు ఈ విశ్వారాధన ప్రక్రియ ఉపయోగపడుతుంది. అంటే ఈ ఆరాధన చేయువారికి ఈ విశ్వములో ఏదీ తప్పుగా కన్పించదు. అనగా మంచి తప్ప ఇంకేమి కన్పించదు. అంటే ఈ ఆరాధనలో శుద్ధ సత్త్వగుణమును కలిగివుంటారు. వీరు ఏమి చేసిన ప్రతి పనిని, ప్రతి మాట గూడ విశ్వలోక కళ్యాణమునకు ఉపయోగపడును. ఈ ఆరాధన ఉన్నవాడే యోగి కాగలడు. ఇది యోగులకే ఈ ఆరాధన సాధ్యపడుతుంది. ఇందులో బ్రహ్మం అంటే మీ ఇష్టదేవత స్వరూపము అనుకోండి! గ్రహించండి.


యోగసాధన క్రమము ఎలా ఉండాలో వివరించండి?


1)ప్రతిరోజు క్రమము తప్పకుండా, వేళ తప్పకుండా తెల్లవారు జామున 4 గం॥లకే నిద్రలేవాలి.


2)తర్వాత స్నానము అది గూడ చన్నీటి స్నానము చేయాలి. ఈ స్నానంలోపల ముఖము కడుక్కోవటం, ప్రకృతి కార్యాలకు వెళ్లటం చేయవచ్చును.


3)తర్వాత ఒక అరగంట సేపు యోగాసనాలు వెయ్యాలి. లేదంటే కనీసముసూర్యనమస్కారాలు చేయాలి. అపుడే శారీర దృఢత్వం వస్తుంది.


4)తర్వాత మడి బట్టలు కట్టుకొని పూజాగదికి వెళ్లి పంచాయతన పూజ చెయ్యాలి. ఈ పూజ అరగంటలో అయ్యేటట్లుగా చూసుకోవాలి.


5)తర్వాత మీ ఇష్టదేవత మంత్రమైన గాయత్రి మంత్రము అనగా ఉదయం 6 గం|| నుండి 7 గం||ల మధ్యలో ఒక గంటసేపు చేయాలి. అంటే 1000 గాయత్రి చేయాలి. అపుడే విశ్వశక్తి మీలోనికి ప్రవేశించును.


6)తర్వాత ఒక అరగంటసేపు ఓంకార నాదం బిగ్గరగా చేయాలి. ప్రతి ఓంకార శబ్దము 21 సెకనులుండాలి. ఇలా 24 సార్లుగాని, 30 సార్లుగాని చేయాలి.


7)తర్వాత అరగంటసేపు ప్రాణాయామము చేయాలి. అనగా 80 సార్లు చేయాలి. ఇది గురు ముఖముగా నేర్చుకొని చెయ్యాలి.


8)తర్వాత మీకు ఇష్టమైన పంచసాధనలు అనగా జపముగాని, ఉపాసన విధానంగాని, ప్రాణాయామంగాని, ధ్యానముగాని కనీసము 2 గం||ల నుండి 3 గం||ల పాటు ఉండి చేయాలి. ఈ విధంగా మూడు సం||ల నుండి 12 సం||ల పాటు చేయగలిగితే మీకు మంత్రసిద్ధి లభించును. తర్వాత మీ ఇష్టదేవత అనుగ్రహం వలన గురుదర్శనం, వీరివలన కుండలినీ శక్తి జాగృతి అగును. తద్వారా మీరు తత్త్వదర్శి స్థాయికి రాగలరు.


కాకపోతే ఈ విధాన క్రమము తప్పకుండా చేయాలి. మీరు ఏ ఊరిలోవున్నా, మీరు ఎక్కడకు వెళ్లినా, మీ మనస్సు ఎన్నో ఆటంకాలు కల్పించిన మీరు ఈ క్రమ విధానం పాటించాలి. అపుడే మీకు మంత్రసిద్ధి లభించును. తద్వారా దేవత అనుగ్రహం లభించును. ప్రారంభములో మూడు సం||లు పాటు ఎన్నో ఆటంకాలు కల్గించును. గమనించుకోండి ఈ ఆటంకాలను నవ్వుతూ దాటుకొని, క్రమము తప్పకుండా చేయండి. గాయత్రి మంత్రమును మరియు జపము యొక్క మంత్రమును గురు ఉపదేశముగా తీసుకొని చెయ్యాలి. లేదంటే కనీసము మీ దగ్గరలోని దేవాలయ అర్చకుని చేత చెప్పించుకొని ఉపదేశముగా తీసుకోవాలి. అలాగే ప్రాణాయామ విధానము, ధ్యాన విధానం గురువుల సమక్షములో నేర్చుకొని, సాధన చేయగలరని నా మనవి. ఇలా గురు ఉపదేశము లేకుండా, అలాగే గురు సమక్షములో నేర్చుకోకుండా కేవలము పుస్తకాల ద్వారా నేర్చుకొని చేయటము వలన అనగా ఎన్ని యుగాలు చేసిన ఇసుమంత ఉపయోగముండదని గ్రహించండి. విశ్వరాధన ద్వారా, ఈ సాధన క్రమము ద్వారా భక్తుడి స్థాయి నుండి సిద్ధుడి స్థాయి అనగా యోగిగా

మారండి! తరించండి.


దైవయోగము అంటే ఏమిటి? ఈ యోగమున్నవాడు యోగి కాగలడని ఎలా

చెప్పగలరు?

దైవయోగము అంటే నవగ్రహాల అనుకూలత ఉన్నవాడని అర్ధము. ఈ అనుకూలత

ఉన్నవాడికే విశ్వశక్తి తనలోనికి ప్రవేశించగలదు. అపుడేవాడు యోగి కాగలడు. ఈ యోగము

లేనివాడు భక్తుడిగాను లేదా ముముక్షువుగా లేదా యోగసాధకుడిగానే వుండి పోతారు.

దైవయోగము ఉన్నవాడు మనస్సేలేని పసి పాపలాగా వాడి మనస్సు ఉంటుంది. ఎటువంటి

కల్మషాలు గాని, రాగద్వేషాలుగాని బాహ్యస్మృతిగాని, విషయవాంఛలుగాని, విషయ

వాసనలుకాని యుండవు. అలాగే ఋణబంధరూపేణ బాధలుండవవు. దైవయోగమున్న

వాడికే దైవానుగ్రహం కలుగుతుంది. తద్వారా గురుదర్శనం కల్గటం, గురు అనుగ్రహం

పొందటం జరుగుతుంది. అందుకే మనిషి జన్మ, ముక్తి పొందాలన్న కోరిక, సద్గురువు

సన్నిధి అనే ఈ మూడు దైవానుగ్రహము వలన లభ్యమవుతాయి. కావాలంటే

దైవానుగ్రహంలోనే వున్న "గ్రహం" అనే మాట చూడండి. కాబట్టి గ్రహాలనుకూలత ఉన్నవాడికి

దైవ యోగముంటుంది. ఈ దైవయోగము ఉన్నవాడు కారణ జన్ముడిగా జన్మించి

తమసాధనబట్టి దైవాలుగాను, పరమాత్ముడిగాను మారతారు. ఈ కోవకు చెందినవారే

శ్రీ శిరిడిసాయి బాబా, రమణ మహర్షి, రాఘవేంద్రస్వామి, వీరబ్రహ్మేంద్రస్వామి ఇలా

మొదలైనవారు. దైవయోగము లేకపోయిన దిగులు చెందకుండా, అలాగే ఈ జన్మ

వృధాగాకుండా భక్తుడి స్థాయి నుండి యోగసాధకుడి స్థాయివరకు యోగసాధన చేయండి.

మీకు నిజంగా దైవానుగ్రహము ఉంటే తత్త్వదర్శి స్థాయికి, అలాగే సిద్ధుడు స్థాయి అనగా

యోగిస్థాయికి వెళ్లవచ్చును. ఈ గ్రహాల అనుకూలత బట్టి మీరు యోగి అవుతారో లేదో

తెలుసుకోవచ్చును. ఈ గ్రహాలకు సంబంధించిన శాస్త్రమే జ్యోతిష్యశాస్త్రము. ఈ గ్రహాల

స్థితి గతులను సంపూర్ణముగా అర్ధము చేసుకొన్న వారిని వేళ్లమీద లెక్క పెట్టవచ్చును.

ఇపుడు నకిలి గురువులు ఎలా తయారు అవుతారో అలాగే నకిలి జ్యోతిష్య పండితులు

తయారు అవుతున్నారు! తస్మాత్ జాగ్రత్త! ఇక్కడ చిన్న సందేహము రావచ్చును. నిజముగా

మీకు దైవయోగమున్నదా? లేదా? ఎలా తెలుస్తుంది. నిజంగా దైవయోగమున్న వాడికి

ఈ ప్రపంచమంతా ఒక క్షణ భంగురమని తోస్తోంది. ఎన్ని విద్యలు అనగా చదువులు

చదివిన ఇంకా తెలియని విద్య ఒకటి ఉన్నదని తెలుసుకొంటాడు. అదే బ్రహ్మవిద్య లేదా

ఆధ్యాత్మిక విద్య. అన్ని విషయములకు, విషయవాసనలకును భిన్నంగా వైరాగ్యం కలిగి 

వుంటాడు. ఎల్లప్పుడు దైవము గూర్చి, జ్ఞానము గూర్చి సాధనలు గూర్చి ఆలోచనలు చేస్తూ వుంటాడు. ఎపుడు పూజలతో, ఆరాధనలతో, గ్రంథ పారాయణాలతో, క్షేత్ర సందర్శనాలతో కాలం గడుపుతాడు. ఇలాంటి వారు ఎవరికీ చెప్పకుండా కర్మ సన్యాసమును తీసుకొని ఏదో ఒక క్షేత్రమునకు వెళ్లి తమ సాధనను కొనసాగిస్తారు. అలాగే ఇలాంటివారు తమ రోజు కాలంలో సుమారుగా 15 గం॥ల సమయము దైవానికి అంకితం చేస్తారు. ఇలా ఉన్ననాడు దైవయోగమున్నట్లే. మీకు ఈ లక్షణాలు ఉన్నాయో లేదో తెలుసుకోండి. అదియు గాకుండా బంధాలను విదిల్చుకోలేనివారు, బహుబంధాలలో ఇరుక్కొనేవారు, రాగద్వేషాలయందు అహంకారముయందు, ధనార్జనలయందు ఆసక్తి, కీర్తి ప్రతిష్ఠలయందు ఆసక్తి, భయాలకు లోనైవారు, కాంతమాయలకు లోబడినవారు, చిత్త చాంచల్యం గలవారు, ఆశ, భయము, క్రోధము, అహంకారము ఉన్నవారు ఇలాంటి లక్షణాలు ఉన్నవారికి దైవయోగములేనట్లే, అంటే ఇలాంటివారు ఎన్నటికి ఈ జన్మలో యోగి కాలేరు. అదే నిజమైన దైవయోగమున్న వాడు తృప్తి, ఓర్పులను కలిగియుండి భిక్షాపాత్రతో భిక్షాటన చేయగలడు, జీవించగలడు. ఇలా మీరు చేయగలరు అనగా అనుభవ పూర్వకముగా మీ ఊరిలో ఆరునెలలపాటు భిక్షాటన చేయగలగాలి. అపుడు మీకు దైవయోగమున్నట్లే. అపుడు ఏ స్థితిలో ఉన్న అన్ని బంధాలను అనగా తల్లిదండ్రుల బంధాలు, భార్య పిల్లల బంధాలు, బంధు, మిత్ర బంధాలు నిరభ్యంతరంగా వదిలిపెట్టి కర్మ సన్యాసము చేయవచ్చును. ఇలా చేసినవారే బుద్ధుడు, రాఘవేంద్ర స్వామివారు. అందులో ఎటువంటి తప్పులేదు. దోషం లేదు. ఉదా:- శంకరాచార్యుడు.


ఇలాంటి దైవయోగము లేనివాడు మరుజన్మలో కారణజన్ముడిగా పుట్టుటకు తమ సాధనను కొనసాగించండి. అందుకు ప్రతిరోజు ధ్యానము అనగా సుమారు 8 గం॥లపాటు చేయటం అలవాటు చేసుకొండి. అనేకమైన ధ్యాన అనుభవాలు పొందండి. ఇది మీరు ఇంటిలోవుండి చేసుకోవచ్చును. లేదంటే ఏదైన క్షేత్రములో వుండి చేసుకోవచ్చును. మీ జీవితానికి సరిపోయే ధనాన్ని 30 సం॥లలో సంపాదించుకొని, ఇంటివద్దనే యుండి లేదా ఏదైన క్షేత్రమునకు వెళ్లి అక్కడ వుండి మీ ధ్యానం సమయము పెంచుకొనేటట్లు సాధన చెయ్యండి. ఈ ప్రాపంచిక విషయాలలో వుండి మీరు సాధన చేయలేరు. అనగా ధనార్జన విషయాలయందు, కీర్తిప్రతిష్టల విషయాలయందు, బంధువుల విషయాలయందు, మిత్రబృందాల విషయాలయందు పడిపోయినారు అంటే మీ జీవితం వృధా అయినట్లే. అంటే ఈ మానవజన్మ వృధా అయినట్లని గ్రహించండి. ఈ జన్మ రావాలంటే ఎన్నో ఎన్నో లక్షల జన్మలు ఎత్తేగాని మానవజన్మ లభించదు. అలాంటి ఈ మానవ జన్మను ఎందుకు వృథా చేసుకొంటారు. ఆలోచించండి. నేను సన్యాసి అయితే నా భార్య, పిల్లల పరిస్థితి, నా తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి? అని మీరు అనవచ్చును. అందుకు మీరు వారు సుఖముగా జీవించడానికి కావలసినంత ధనమును సంపాదించండి. అంటే కనీస అవసరాలను తీర్చడానికి ఉపయోగపడటానికి. అంతేగాని లగ్జరీల అవసరాల కోసమైతే ఈ జన్మగాదు వంద జన్మలు ఎత్తిన గూడ డబ్బులు చాలవని గుర్తించండి. కారులలో తిరిగే బదులుగా ఆటోలలో తిరగటానికి సరిపోయే ధనాన్ని సంపాదించి వారికి ఇచ్చి వెయ్యండి. అపుడు ఉన్న సమయము అంతా మీ ఇష్టదేవత ధ్యానానికి ఉపయోగించుకోండి. అదే జీవిత పరమావధి. ఈ జన్మలో వద్దులే తర్వాత జన్మలో చూసుకొందాము అంటే వచ్చే జన్మలో వద్దులే ఆపై వచ్చే జన్మలో చూసుకొందామని వాయిదాలు వేస్తారు. అందుకని ఈ జన్మలో సాధనను ప్రారంభించండి! జన్మను వృధాగాకుండా చూసుకోండి. మరి రాఘవేంద్రస్వామి, బుద్ధుడు ఏమి చేశారో ఆలోచించండి. అలాగే శంకరచార్యులవారు, ఏమి చేశారో ఆలోచించండి. అంతెందుకు శిరిడిసాయిబాబా, రమణమహర్షి, రామదాసు, కబీరుదాసు, అన్నమయ్య, జీసస్ ఏమి చేశారో ఆలోచించండి. ఇలాంటి వారంతా తమ జన్మ వృధాగాకుండా వుండటానికి దైవ ధ్యానము చేసినారు గదా! యోగులు అయినారు గదా! అలా మీరు ఎందుకు గాకూడదు. ఆలోచించండి. దైవధ్యానము చేయండి. యోగిగా మారుటకు ప్రయత్నించండి.


ఒక్కటి గుర్తుంచుకోండి! బాల్యమంతయు ఆటలలో గడిచిపోవును, యౌవనము అంతయూ స్త్రీ సంబంధమైన విషయాలయందు, ధనార్జన విషయాలయందు, విషయ వాంఛలయందు గడిచిపోవును. ఇక మిగిలిన ముసలితనము అంతా మానసిక చింతనలలో, రోగాలతో, మానసిక, శారీరక రుగ్మతలతో గడిచిపోవును. ఇలాంటి జీవితాలను మీ ముందుతరాలవాళ్లు, వాళ్లుముందు తరాలు వాళ్లు అనుభవించుచునే ఉన్నారు. ఏమిటి లాభము చెప్పండి. మీ జీవితము గూడ ఇంతేనా! ఈ రుగ్మతలను అనుభవించడానికేనా? మీరు మానవ జన్మ ఎత్తినది. ఆలోచించండి. కాదుగదా! అంటే ఎవరు యౌవ్వనమును ధనమయం చేస్తారో వారు భోగి అవుతారు. అలాగే యవ్వనమును భోగమయం చేస్తారో వారు రోగి అవుతారు. ఎవరు యవ్వనమును ధ్యానమయం చేస్తారో వారు యోగి అవుతారు. వీరే జీవన్ముక్తిని పొంది పునఃజన్మలు లేకుండా చేసుకొంటారు. అనగా పాపభూయిష్టమైన యోనులయందు జన్మలు ఎత్తలేరు. అందుకు దైవధ్యానముతో సాధన చేయండి. తరించండి. ముక్తిని పొందండి. పునఃజన్మలు లేకుండా చేసుకోండి.


యోగులు ఎందుకు రుద్రాక్షలను ధరిస్తారు?

విశ్వములోని విశ్వశక్తిని తీసుకొనేవి బాణలింగాలు, సాలగ్రామాలు, స్ఫటికాలు, రత్నాలు, లోహాలు, రుద్రాక్షలు మాత్రమే. అందులో రుద్రాక్షలకు ప్రత్యేకమైన గుణమున్నది. అది వీటికి రసాయనిక, ఆకర్షణ గుణాలున్నాయి. అనగా అయస్కాంత గుణము ఉన్నది. నిజమైన రుద్రాక్షలు ఒక ముఖము నుండి 32 ముఖాలు వరకు ఉన్నాయి. ముఖము అంటే రుద్రాక్షమీద వుంటే గీత అన్నమాట. ఈ గీతలనుబట్టే రుద్రాక్ష ముఖాలను నిర్ణయించును. ఈ రుద్రాక్షలలో నలుపు, తెలుపు, పసుపు రంగులలో ఉంటాయి. నిజమైన రుద్రాక్షలు అయితే నీటిమీద, పాలలో తేలిపోతాయి. అదే భద్రాక్షలు మునిగిపోతాయి. అదే నిజమైన రుద్రాక్షలను రెండు రాగి నాణేల మధ్య వుంచినపుడు వీటి గురుత్వాకర్షణమువలన ఒక జర్ను ఇస్తాయి. అదే భద్రాక్షలకు ఈ గుణముండదు. అలాగే నిజమైన రుద్రాక్షలను పచ్చిపాలలో వేసినపుడు, వాటిని అలాగే వుంచినపుడు మూడు రోజులపాటు పాలు విరగవు. అదే భద్రాక్షలు అయితే పాలు విరిగిపోతాయి. అలాగే నీళ్లలో నిజమైన రుద్రాక్షలను వేసినపుడు ఆ నీటి ఉష్ణోగ్రతలో తేడా వస్తుంది. అదే భద్రాక్షలకు ఈ గుణము ఉండదు. అదియుగాకుండా నిజమైన రుద్రాక్షలను మూడు గం॥ల పాటు నీళ్లవుంచి, ఆ నీళ్లలను పచ్చని చెట్టు ఆకుల మీద పోసినట్లయితే వారం రోజులలో ఆకులు మాడిపోవడం, చెట్టు చనిపోవటం జరుగుతుంది. అది దాని శక్తి అదే భద్రాక్షలకు ఈ గుణముండదని గ్రహించండి. అలాగే నీటిలో తేలేవి అన్నియూ నిజమైన రుద్రాక్షలు గాకపోవచ్చును. ఎందుకంటే లక్కతో చేసినవి, చెక్కతో చేసినవి, పుచ్చిపోయినవి నీటిపైన తేలుతాయి. కాస్త జాగ్రత్త వహించండి. అందుకు మిగిలిన పరీక్షలు అనగా రాగి నాణేల పరీక్ష, పాలు లక్షణం, నీటి ఉష్ణోగ్రత, చెట్టు చనిపోవటం ఇలా పైన చెప్పిన పరీక్షలు చెయ్యండి. అపుడు అవి నిజమైన రుద్రాక్షలలో, భద్రాక్షలలో తేడా తెలిసిపోతుంది. నిజమైన రుద్రాక్షలయితే ప్రారంభములో బరువుగా వుండి 3 నెలలలో చాలా తేలికగా మారతాయని గ్రహించండి. అలాగే రుద్రాక్షలయందు లోపల విత్తనం ఉన్నట్లు మీరు ఊపితే తెలుస్తుంది. అదే భద్రాక్షలకు ఉండదు. ఎందుకంటే వీటిని తయారు చేస్తారు గదా! రుద్రాక్షలలో అన్నింటికన్నా రాజసమైన రుద్రాక్ష ఏకముఖి రుద్రాక్ష! దీనికి సాక్షాత్తు పరమేశ్వరుడు ప్రతిరూపంగా వుంటాడు. ఈ రుద్రాక్షయందు రుద్ర చిహ్నాలు అనగా పాకుతున్న పాము శివలింగం త్రిశూలం ఓంకారము ఉంటాయని గ్రహించండి ఇది చాలా అరుదైన రుద్రాక్ష! చూడండి. ఈ రుద్రాక్షను భరించడం ఎవరి తరము కాదు ఎందుకంటే సాక్షాత్తు పరమేశ్వరుడి శక్తి ఈ రుద్రాక్షకు ఉంటుంది. అంటే ఒక అద్భుతశక్తి మన స్వాధీనంలో ఉన్నప్పుడు దానిని దుర్వినియోగం చేయరాదు. నియమరహితంగా ఏకముఖిని ధరిస్తే పరమేశ్వరుడి ఆగ్రహానికి గురవుతారు. అనుచిత ప్రవర్తన వలన ధార్మికులు అకాల మృత్యువు పాలైనట్లు అనేక సందర్భాలలో రుజువు

అయినది. గ్రహించగలరు. అలాగే అనుకోనిరీతిలో ఏకముఖి లభ్యమైన వారికి సమస్త

సిరిసంపదలు లభిస్తాయట. అదే విధంగా ద్విముఖి రుద్రాక్ష ధరించటం వలన కుండలినీ

శక్తి జాగృతి అవుతుంది. రుద్రాక్ష మహిమ-శ్యాంబాబు రచయిత. జె.పి. పబ్లికేషన్స్ వారి

పుస్తకం ఇది. ఈ పుస్తకము ద్వారా నిజమైన రుద్రాక్షలు ఏవో, నకిలి రుద్రాక్షలు ఏమిటో

తెలుస్తాయి. ఇది నా స్వానుభవము ప్రకారము వ్రాస్తున్నాను. ఈ పుస్తకము ఎక్కడైన

దొరికితే కొని చదవండి. రుద్రాక్షలు గూర్చి తెలుసుకోండి! రుద్రాక్షల మీద ఎన్నో పుస్తకాలు

చూశానుగాని అవి భద్రక్షాలనే రుద్రాక్షలుగా చెప్పినాయి. ఈ ఒక్క పుస్తకమే రుద్రాక్షలను

రుద్రాక్షలుగా చెప్పినాయి. గమనించండి.



నిజమైన రుద్రాక్షలను ధరించుటవలన విశ్వములోని విశ్వశక్తిని ఇవి గ్రహిస్తాయి.

అలాగే కుండలినీ శక్తి జాగృతి వలన వచ్చిన వేడిని, శక్తిని సంగ్రహించును. రుద్రాక్ష

ధారణకు ఎన్నో నియమాలుంటాయని గ్రహించండి. నియమరహితముగా వుండి రుద్రాక్షలను

ధరించినట్లయితే అనేక ఈతి బాధలు, మానసిక, శారీరక రుగ్మతలు, వ్యాధులకు గురి

కావలసి వుంటుందని గ్రహించండి. అందుకే పంచాయతన పూజలో బాణలింగాలు,

సాలగ్రామాలను, పంచలోహరాయిని, స్పటికాలను, పూజించమనేది. అంటే ఇవి విశ్వశక్తిని

తీసుకొని పూజ చేయటం వలన అవి సాధకుడికి ఇస్తాయి. అలాగే నిజమైన రుద్రాక్షలు

గూడ అవే పనులు చేస్తాయి. అనగా ఒక్కొక్క రుద్రాక్ష ఒక బాణలింగానికి, ఒక

సాలగ్రామమునకు, ఒక రత్నమునకు, ఒక లోహమునకు సమానము అన్నమాట. పరబ్రహ్మ

అనుగ్రహమున్న వాడి దగ్గరకు నిజమైన రుద్రాక్షలు, రుద్రాక్షమాలలు వస్తాయి. ఇది నా

స్వానుభవములో జరిగినది. కాబట్టి వ్రాస్తున్నాను.



రుద్రాక్షధారణ ప్రతియోగసాధకుడికి ఈ క్రింద చెప్పిన విధముగా ఉండాలి. శిఖ

మీద ఒక రుద్రాక్ష, శిరస్సు మీద 22, మెడలో 10, చెవి యొక్కింటికి ఆరు, ముంచేతి

మణికట్టు ఒక్కొంటికి 12 చొప్పున, కంఠభాగమున ఒక్కొక్క దండకు 32 చొప్పున మెడలో

మాలగా 108 రుద్రాక్షలను, భుజమునకు ఒక్కొంటికి 16 చొప్పున మాలలు, ధరించిన

వాడు సాక్షాత్తు నీలగ్రీవ పరమేశ్వరుడు అగును. ఇలాంటి రుద్రాక్ష ధారణవలన ధారకులకు

మంచి వర్చస్సు వస్తుంది. జ్ఞానము వృద్ధి చెందుతుంది. సర్వపాపాలు హరించబడతాయి.

అలాగే ఆధ్యాత్మిక పురోగతివృద్ధి కలుగుతుందని, కుండలినీ శక్తి పెరుగుతుందని, మోక్షప్రాప్తి

కలుగుతుందని మన ప్రాచీన గ్రంథాలు చెప్పుతున్నాయి. పైన చెప్పినన్నియూ రుద్రాక్షలు

లేకపోయిన కనీసము మెడలో 108 రుద్రాక్షలు గాని 54 గాని, 27 గాని, 11 గాని లేదా కనీసం ఒకటి అయిన ఉండేటట్లుగా చూసుకోండి. అవిగూడ నిజమైన రుద్రాక్షలు మాత్రమేనని గుర్తుంచుకోండి. అపుడే నేను పైన చెప్పిన ఫలితాలు కల్గుతాయి. కనీసము ప్రతి యోగ సాధకుడు ద్విముఖి రుద్రాక్షను తప్పనిసరిగా ధరించాలి. ఎందుకంటే ఇది కుండలినీ శక్తిని జాగృతి చేయునని రుద్రపురాణం చెపుతుంది.


ఆధ్యాత్మిక జీవనం అంటే ఏమిటి?

ఆధ్యాత్మిక జీవన విధానం అంటే పూజలు, జపాలు, ధ్యానాలు, ప్రాణాయామాలు, చేసుకొంటూ నిత్యం దైవధ్యానంలో గడపటం కాదు. అలాగే కేవలం మంత్రాలు, శ్లోకాలు పఠిస్తూ, ఎవరినీ తాకకుండా, నియమనిష్ఠలతో జీవించటం మాత్రాన అది ఆధ్యాత్మిక జీవనం అన్పించుకోదు! అంటే కేవలం జపాలు, హోమాలకు, పూజలకు అనుష్ఠానాలకు మున్నగు వాటికి పరిమితముగాకుండా ఉన్నంతలో ఇరుగుపొరుగు వారికి ఉపకారము చేయాలి. వారితో సత్ సంబంధాలు, ప్రేమ అప్యాయతలు పెంచుకోవాలి. ఎవరియందు ద్వేషము, పగ, అసూయలు ఉంచుకోరాదు. అలాగే వారికి మన చేతనైనా సహాయము చేయాలి. కుల, మతరహితముగా ఉండాలి. అలాగే విద్యలేనివారికి మనకు వచ్చిన విద్యను వారికి ఉచితంగా బోధించాలి. అలాగే కష్టాలలో ఉన్నవారికి నాలుగు మంచి మాటలు చెప్పి, వారికి ఉపశమనం కల్గించాలి. అలాగే మన సంస్కృతి సంప్రదాయాలు పదిమందికి చాటవచ్చు. అవసరాలలో ఉన్నవారికి డబ్బులు సహాయం చేయాలి. అలాగే ఎవరిని ఎట్టి పరిస్థితులలో బాధపెట్టడము, మాటలతో సూటిపోటి మాటలు అనడం, నీ చేతలు వలన, నీ ప్రవర్తన వలన, ఇతరులు బాధపడకుండా చూసుకోవాలి. నీకు చేతనైనంతలో నలుగురికి ఉపయోగపడే పనులు చేయి. ప్రార్ధన చేసే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని గుర్తుంచుకోవాలి. అలాగే భగవంతుని మనము పూజిస్తూ లేదా ధ్యానిస్తూనే వీటనన్నింటిని నిర్వహించవచ్చును. ఇవన్నీ చేయాలంటే ముందు మనకు భగవంతుడి మీద నమ్మకం ఉండాలి. అవతల వారికి కూడ భగవంతుని మీద భక్తి విశ్వాసములు కలిగించాలి. ఇలాంటి జీవన విధానమే ఆధ్యాత్మిక జీవన విధానం అనిపించుకొంటుంది. అంటే మనము నిత్యం దేవుడిని స్మరిస్తూ ఇరుగు పొరుగువారికి ఎల్లప్పుడూ సహాయకారిగా ఉండాలి.


యోగాజీవనము అంటే ఏమిటి?

యోగాజీవనము అంటే యోగిగా జీవితాన్ని గడపటం! అంటే త్రిగుణ రహితముగా ఉంటూ, విషయవాంఛలకు, విషయ వాసనలకు దూరంగా ఉంటూ, భూతదయను కలిగియుండి ప్రతినిత్యం సత్కర్మలు చేస్తూ అహంకార రహితంగా ఉండి, రాగద్వేషాలయందు, అనురాగ మమకారములయందు దూరంగా ఉండి, చిత్తశుద్ధి యగుటకు నిత్యం ధ్యానాలు, జపాలు, ప్రాణాయామాలు, తపస్సు చేస్తూ ఉంటూ, దేహధర్మాలను నిర్వహిస్తూ, ప్రతినిత్యం ఆత్మను పరమాత్మయందు లయం చేస్తూ, పొందే క్షణిక సమాధిస్థితిని దీర్ఘసమాధి స్థితిగా పొందుటకు ప్రయత్నాలు చేస్తూ, అరిషడ్వర్గాలను అదుపులో పెట్టుకొంటూ, ఎల్లప్పుడు ఆధ్యాత్మిక చింతను కలిగి ఉంటూ, ఎల్లప్పుడు మౌనవ్రతమును కలిగి ఉంటూ, కాంతము, కనకము యెడల బహుజాగురకతను కలిగి ఉంటూ, పేరు ప్రతిష్ఠలకు, ఆత్మాభిమానాలకు, అవమానాలకు, కోపతాపాలకు దూరంగా ఉంటూ, ప్రతిరోజు సాత్విక, దైవార్పిత మితాహారము తింటూ, పరిపూర్ణ జ్ఞానియైనా ఏమి తెలియని అజ్ఞానిగా ఉంటూ, ఎల్లప్పుడు శాంత స్వభావము కలిగి ఉంటూ, యోగ సిద్ధులను అదుపులో పెట్టుకొంటూ ఎల్లప్పుడు ఆధ్యాత్మిక బుద్ధిని కలిగి ఉంటూ, ఈ విధమైన యోగాజీవనమును జీవించువాడు పరమయోగి అవుతాడు. కాలక్రమేణా ఈ యోగి పరమగురువు అవుతాడు.


యోగవిద్య లేక ఆధ్యాత్మిక విద్య అంటే ఏమిటి?

యోగవిద్య అంటే యోగము గూర్చి తెల్పే విద్యను యోగవిద్య అని ఇది తెలిపే శాస్త్రాన్ని యోగశాస్త్రం అందురు. యోగశాస్త్రం అంటే శారీరకమైన యోగ ఆసనాలు తెలిపేది అని చాలా మంది అనుకొంటారు. ఇది చాలా తప్పు! యోగము అంటే తన జీవాత్మకు విముక్తిని కలిగించేది. ఇది చేసినవాడు యోగి, ఈ విధానము ఎలా చేయాలనేది యోగశాస్త్రము చెపుతుంది. అంతేగాని యోగశాస్త్రమంటే యోగాసనాల శాస్త్రమని అనుకోవద్దు. ధ్యానము అంటే శ్వాసమీద ధ్యాస నిల్పటం. అంతేగాని ఈ విగ్రహాలమీద ధ్యాస నిల్పటంగాదు. విగ్రహారాధన ఎందుకంటే మనము నిగ్రహమును పెంచుకొనుటకు, ఏకాగ్రతను పెంచుకొనుటకు మాత్రమే, అంతేగాని విగ్రహమే సర్వస్వం అనుకోరాదు. పరబ్రహ్మము మొదట నిరాకారుడు. ఆ తర్వాత ఆకారుడుగా ఉన్నాడు. అంటే మీ సాధన విగ్రహము నుండి విశ్వారాధనకు రావాలి. ఇది ఎలా రావాలి? అనేది యోగవిద్య చెపుతుంది.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గ్రంథ పరిచయం

   అరుణాచల శివ పరమేశ్వరుడి లీల అనుగ్రహం  యోగ దర్శనం అంకితం : పరబ్రహ్మ స్వరూపులైన  పరమేశ్వరి , పరమేశ్వరుల  పాదారవిందములకు…. నా ఆది గురువైన శ్...