పీఠిక
యోగ దర్శనం అంటే యోగం ద్వారా దర్శించుకునేది! అనగా యోగ సాధన ద్వారా దర్శించుకునేది. మరి ఈ యోగ దర్శనం ద్వారా ఏమి దర్శించుకోవాలి? దేనిని దర్శించితే నేను అనే అహంకారమును కోల్పోయి నిశ్చల, నిర్వికల్ప, నిర్గుణ, ఆనంద స్వరూపమవుతాడో, దేనిని దర్శిస్తే నేను -నాది అనే భావాలు, సమస్త బాంధవ్యాలు అసత్యమని గ్రహిస్తారో– దేనిని దర్శిస్తే దుఃఖం లేనేలేదు ఉన్నది ఆనందం మాత్రమే అని గ్రహిస్తారో –దేనిని దర్శిస్తే, మనసు ప్రపంచం లేనే లేవు అనే సత్యమును గ్రహిస్తారో– దేనిని దర్శిస్తే ఉన్నది ఒకే పరబ్రహ్మం అని గ్రహిస్తారో– దేనిని దర్శిస్తే సమస్త కర్మలు, కర్మ వాసనలు నాశనం అవుతాయో– దీనిని దర్శిస్తే సకల ధర్మములు మిథ్య అని గ్రహిస్తారో –దేనిని దర్శిస్తే జీవుడికి జీవన్ముక్తి కలుగుతుందో –దేనిని తెలుసుకోవాలని సాధకులు ప్రయత్నిస్తారో– దేనిని సాధించాలని సన్యాసులు సర్వం త్యజించుచున్నారో – దేనిని పొందాలని ఉపాసకులు కఠోర నియమాలతో సాధన చేస్తున్నారో – దేనిని సిద్ధింప చేసుకోవాలని సిద్ధుడు అనగా యోగులు త్యాన తపస్సు చేయుచున్నారో– దేనిని అన్వేషించాలని బుద్ధుడు సర్వాన్ని త్యజించారో – దేనిని తెలుసుకోవాలని భోగి అయిన వేమన యోగి అయ్యాడో – దేనిని ప్రాప్తింప చేయాలని శ్రీకృష్ణుడు భగవద్గీతను అర్జునుడికి బోధించారు– దేనిని సిద్ధింప చేసుకోవడానికి శిరిడి సాయిబాబా, మహావతాలు బాబాజీ లాంటి పరమ గురువులు అవతరిస్తున్నారో – దేనిని సమర్థుడు ,సర్వశక్తిమంతుడు అనగా సాక్షాత్తు పరబ్రహ్మ అవుతాడో దానిని ఆత్మానుభూతి పొందటం అంటారు. దానినే ఆత్మసాక్షాత్కారం లేదా బ్రహ్మ సాక్షాత్కారం అందురు. అంటే అంతా బ్రహ్మమే– ఉన్నది బ్రహ్మమే– చూసేది బ్రహ్మమే– కనపడేది బ్రహ్మమే– లయం చెందేది బ్రహ్మమే– స్థితియే బ్రహ్మమే! అంటే సమస్త వేదాల సారము సాధకుడు ఆత్మసాక్షాత్కారం పొందటమే అన్నమాట! మరియు సమస్త తత్వశాస్త్రాల సారాంశం సాధారణ మానవుడు “నేను” పరబ్రహ్మణి అనే అనుభూతిని పొంది ఆ అనుభూతిలో నిత్యం నిలవడమే అన్నమాట! అనగా సమస్త యోగులు, సమస్త జ్ఞానులు , సమస్త భక్తులు ,సమస్త అవతార పురుషుల సందేశం సాధకుడు బ్రహ్మానుభూతిని పొందడమే అన్నమాట! అనగా యోగము ద్వారా ఆత్మసాక్షాత్కారమును పొందితే తద్వారా ఆత్మానుభూతి లేదా బ్రహ్మానందానుభూతి కలుగుతుంది . దీనిని యోగ దర్శనము అందురు. ఈ అనుభూతిని పొందాలంటే …………….
సాధకులారా !ఉపాసకులారా! ముముక్షువులారా! భక్తులారా!
పూజలు, భజనలు చేయండి! కానీ వాటికే పరిమితం కావొద్దు, ముందుకు వెళ్ళండి! స్తోత్రాలు ,దైవ ప్రార్థనలు, సంకీర్తనలు, చేయండి కానీ వాటికే పరిమితం కావొద్దు. ముందుకు వెళ్ళండి ,జపం చేయండి కానీ జపానికే పరిమితం కావొద్దు. ముందుకు వెళ్ళండి!
ఉపాసనలు చేయండి కానీ ఉపాసనా సిద్ధికే పరిమితం కావొద్దు ముందుకు వెళ్ళండి!
యోగాసనాలు చెయ్యండి కానీ యోగాసనాలతో ,సూర్య నమస్కారాలతోనూ ఆపవద్దు. సాధన చేయండి! యమము, నియమాలు పాటించండి !అలాగే కఠోర నియమాలు పాటించండి. వాటితో ఆపవద్దు. ఇంకా ముందుకు వెళ్లి సాధన కొనసాగించండి!
ప్రాణాయామం చేయండి! అంతేగాని ప్రాణాయామ ప్రక్రియతో ఆగిపోవద్దు!ముందుకు వెళ్ళండి! శాస్త్ర శ్రవణం చేయండి . కానీ దానికే పరిమితం కావొద్దు ముందుకు వెళ్ళండి!
మననం చేయండి కానీ మననముననే పరిమితం కావొద్దు. ముందుకు వెళ్ళండి! ధ్యానం చేయండి కానీ ధ్యానమునకు పరిమితం కావొద్దు. ముందుకు వెళ్ళండి. సమాధి అనుభూతి పొందండి! కానీ దానికే పరిమితం కావొద్దు ముందుకు వెళ్ళండి!
సమాధి నిష్ఠను పొందండి! ఇక వెళ్లడానికి ముందుకు ఏమీ ఉండదు! అనగా బ్రహ్మానుభూతి కలుగుతుంది! తద్వారా నేనే పరబ్రహ్మమని అనుభూతిని పొందుతావు! అంటే ఉన్నదంతా బ్రహ్మమేగాని వేరేది లేదు అని అనుభూతి కలుగుతుంది! అదే యోగ లక్ష్యము! గ్రహించండి! అసలు సిసలైన బ్రహ్మానుభూతి అంటే నేనే భగవంతుడిని అనే అనుభూతిని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం! అందుకు సాధకుడు ఆత్మసాక్షాత్కారము లేదా బ్రహ్మ సాక్షాత్కారము పొందాలి! అనగా సత్ జ్యోతి బిందువులో తన స్వస్వరూపాన్ని చూడడం అన్నమాట! అందుకు ఎంతో సాధన కలిగి ఉండాలి! అలాగే ఎన్నో లక్షల జన్మలు, దైవారాధన ఎంతో పుణ్యం ఉండాలి! అలాగే ఈ సాధన చేయుటకు ప్రారంభంలో సాధకుడు విగ్రహారాధన చేయాలి! అనగా విగ్రహారాధన చేసి మనసుకు నిగ్రహం కలిగి ఉండాలి! అలాగే అష్టాంగ యోగంలోని అష్టాంగాల ద్వారా సాధారణ మానవుడు భక్తుడు స్థాయికి ముముక్షువు స్థాయికి తర్వాత యోగ సాధకుడు స్థాయికి రావాలి! తర్వాత దైవానుగ్రహం వలన గురు దర్శనం కలుగుతుంది! వీరి అనుగ్రహం వలన సాధకుడు తత్వ దర్శి స్థాయికి తర్వాత సిద్ధుడు స్థాయికి రావాలి! అప్పుడు మీకు ఆత్మ దర్శనం వలన ఆత్మ దర్శనానుభూతి అలాగే ఆత్మసాక్షాత్కారం వలన ఆత్మానుభూతి లేదా బ్రహ్మానందానుభూతి కలుగుతాయి . తద్వారా మీరు జీవన్ముక్తిని పొందుతారు. గ్రంథ విషయాన్ని వివరిస్తాను!
మొదటి అధ్యాయంలో యోగ సూక్తులను పొందుపరిచాము. వీటి ద్వారా యోగము గురించిన విషయాలు చాలా క్లుప్తంగా తెలుస్తాయి. అలాగే యోగ శాస్త్రంలో వచ్చే పదాల అర్థాలు తెలుస్తాయి!
రెండవ అధ్యాయంలో యోగ తత్వ బోధనలు పొందుపరిచినాము. వీటిలో ఎంతోమంది సిద్ధపురుషుల భావాలను సంక్షిప్త రూపంలో వివరించాము . వీటివలన సాధకుడికి యోగమునకు సంబంధించిన విషయాలు తెలుస్తాయి!
మూడవ అధ్యాయంలో యోగ పరి ప్రశ్నలు ఉంచినాము. వీటిలో జ్ఞానమునకు సంబంధించిన అనేక ప్రశ్నలకు సమాధానాల రూపంలో సంక్షిప్త రూపంలో వివరించాము . వీటివలన సాధకుడికి యోగ విజ్ఞానం మీద కొంత మేరకు అనగా ప్రారంభ జ్ఞానం కలుగుతుంది.
నాల్గవ అధ్యాయంలో యోగ సారములు పొందుపరిచినాము. వీటి వలన సాధకుడికి ఉండవలసిన లక్షణాలు ,భగవద్గీత యొక్క సారాంశం ,తల్లిదండ్రుల మీద ఉండవలసిన ప్రేమ ఆప్యాయతలు గురించి తెలిపాము!
ఐదవ అధ్యాయంలో పరబ్రహ్మ ,పరమాత్మ ,ఆత్మ ,జీవాత్మల గురించి తెలిపాము . వీటివలన పరబ్రహ్మం అంటే ఎవరు? ఆయనను ఎందుకు పూజించాలి? అసలు పరమాత్ముడు అంటే ఎవరు? అసలు పరబ్రహ్మమునకు, పరమాత్మునకు గల భేదం ఏమిటి? ఆత్మ అంటే ఏమిటి? ఆత్మకు జీవాత్మకు గల భేదం ఏమిటి ? ఇలా మున్నగు సందేహములు ఈ అధ్యాయంలో వివరించడం జరిగింది.
ఆరవ అధ్యాయంలో సృష్టి గురించి చెప్పడం జరిగింది. అసలు సృష్టి అంటే ఏమిటి! ఇది ఎలా జరిగింది? ఇది ఎందుకు జరిగింది? ఇలా మున్నగు సందేహాలు వివరించడం జరిగింది!
ఏడవ అధ్యాయంలో యోగి తత్వం గురించి చెప్పడం జరిగింది. అసలు యోగి తత్వం అంటే ఏమిటి ? యోగి అనేవాడు ఎలా ఉండాలి? ఏ విధంగా జీవించాలి? ఎలా ఆరాధన చేయాలి యోగ సాధన ఎలా చేయాలి? యోగికి రుద్రాక్షలు ఎందుకు ఉండాలి? ఇలా మున్నగు సందేహాలను వివరించడం జరిగింది. అనగా ఈ అధ్యాయంలో యోగి ఎలా ఉండాలో వివరించడం ఎలా జీవించాలో తెలపటం జరిగింది!
ఎనిమిదో అధ్యాయంలో కుండలినీ శక్తి మరియు సప్త చక్రాలను గురించి వివరించడం జరిగింది .అనగా కుండలినీ యోగంలోని ప్రాథమిక అంశాలు మాత్రమే తెలుస్తాయి. అనగా అసలు కుండలినీ శక్తి అంటే ఏమిటి షట్చక్రాలు అంటే ఏమిటో తెలుస్తాయి!
తొమ్మిదవ అధ్యాయంలో అష్టాంగ యోగం గురించి వివరించడం జరిగింది . అనగా పతంజలి అష్టంగాలు సంపూర్తిగా వివరించడం జరిగింది .అనగా యమము అంటే ఏమిటి ? నియమాలు అంటే ఏమిటి? ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానము, సమాధి స్థితులు అంటే ఏమిటి? వీటి వలన కలిగే ఉపయోగాలు ఏమిటి? వీటిని ఎలా సాధన చేయాలో ఈ అధ్యాయం ద్వారా వివరించడం జరిగింది.
పదవ అధ్యాయంలోని కర్మయోగం గురించి వివరించడం జరిగింది. అనగా కర్మ అంటే ఏమిటి ?కర్మ రకాలు ఏమిటి? విధివిరాత అంటే ఏంటి ? పాప పుణ్యాలు అంటే ఏమిటి? అసలు కర్మలు ఎందుకు చేయాలి? కర్మలు బంధం కాకుండా ఉండాలంటే ఏమి చేయాలి ? ఇలాంటి సందేహాలను వివరించడం జరిగింది.
11వ అధ్యాయంలో భక్తి యోగం గురించి వివరించడం జరిగింది . అనగా భక్తి అంటే ఏమిటి? ఇది ఎన్ని రకాలు ?పూజ అంటే ఏంటి ? విగ్రహారాధన అంటే ఏమిటి? పూజలోని రకాలు ఏమిటి? పూజగది ఎలా ఉండాలి ?ఎక్కడ ఉండాలి ?ఇంట్లో ఎలాంటి విగ్రహాలు ఉండాలి ?దేవాలయాల ప్రాముఖ్యత ఏమిటి? మున్నగు సందేహములను వివరించడం జరిగింది.
12వ అధ్యాయంలో జ్ఞాన యోగం గురించి వివరించడం జరిగింది . అనగా తత్వ జ్ఞానం అనగా మనసు అంటే ఏమిటి? అంతః కరణాలు అంటే ఏమిటి ? మనసు యొక్క వృత్తులు ఏమిటి? మనసు యొక్క గుణాలు ఏమిటి? గుణాల రకాలు ఏమిటి? మనసు యొక్క స్వభావాలు ఏమిటి? చిత్త భూములు అంటే ఏమిటి? మున్నగు సందేహములను వివరించడం జరిగింది.
13వ అధ్యాయంలో సన్యాసం గురించి వివరించడం జరిగింది అనగా సన్యాసము అంటే ఏమిటి? సన్యాస దీక్షకు ఎవరు అర్హులు? సన్యాస దీక్షల రకాలు? అసలు సన్యాస దీక్ష అవసరమా? ఇలాంటి సందేహములు వివరించడం జరిగింది. అంటే యోగ సాధనకు సన్యాసం అవసరమని వివరించడం జరిగింది.
14వ అధ్యాయంలో పంచ సాధనములు గురించి వివరించడం జరిగింది. అనగా జపము, ఉపాసన ,ప్రాణాయామము, ధ్యానము, తపస్సుల గురించి వివరించడం జరిగింది.అనగా వీటిని చేయడానికి తీసుకోవలసిన నియమాలు వీటిని చేయటం వలన వచ్చే ఉపయోగాలు వివరించడం జరిగింది!
15వ అధ్యాయంలో గురుతత్వమును గురించి వివరించడం జరిగింది. అనగా గురువు అంటే ఎవరు? గురువులోని రకాలు? నిజమైన గురువుకు నకిలీ గురువుకు గల తేడాలు ఏమిటి? అసలు గురువును ఎందుకు ఆరాధన చేయాలి ? గురుసేవ అంటే ఏమిటి? గురువుకు ఎందుకు సేవ చేయాలి? మున్నకు సందేహములను వివరించడం జరిగింది!
16వ అధ్యాయంలో కుండలినీ యోగం గురించి వివరించడం జరిగింది. ప్రాణ శక్తి అంటే ఏమిటి? విశ్వశక్తి అంటే ఏమిటి ? కుండలినీ శక్తి అంటే ఏమిటి ? కుండలినీ శక్తి జాగృతి అయితే కలిగే స్థితులు ఏమిటి? కుండలినీ శక్తిలో కదలికలు ఏర్పడితే కలిగే స్థితులు ఏమిటి? శక్తి ప్రసారాలు జరుగుతున్నప్పుడు కలిగే స్థితులు ఏమిటి? సప్త చక్రాల యోగ మాయలు ఏమిటి? సప్త చక్రాలను ఎలా జాగృతి, శుద్ధి ఆధీనం చేసుకోవాలి మున్నగు సందేహములు వివరించడం జరిగింది.
17వ అధ్యాయంలో సాక్షాత్కారాల గురించి వివరించడం జరిగింది. అనగా దర్శనం అంటే ఏమిటి ? సాక్షాత్కారం అంటే ఏమిటి? దైవదర్శనాలు అలాగే దైవసాక్షాత్కారాలు ఎప్పుడు కలుగుతాయి? ఆత్మ దర్శనం, ఆత్మసాక్షాత్కారం అంటే ఏమిటి ? ఇవి ఎప్పుడు కలుగుతాయి? వీటి వలన కలిగే అనుభూతులు ఏమిటి ? మున్నగు సందేహములు వివరించడం జరిగింది.
18వ అధ్యాయంలో అనుభవాలు మరియు అనుభూతులు గురించి వివరించడం జరిగింది. అనగా అనుభవం అంటే ఏమిటి? ఏవి ధ్యాన అనుభవాలు? అలాగే అనుభూతులు అంటే ఏమిటి? ఏవీ ధ్యాన అనుభూతులు. అనుభవాలకు ,అనుభూతులకు గల తేడాలు ఏమిటి? ఎట్టి స్థితిలో అనుభవాలు కలుగుతాయి? ఎట్టి స్థితిలో అనుభూతులు కలుగుతాయి? మున్నగు సందేహములు వివరించడం జరిగింది.
19వ అధ్యాయంలో సాధన శక్తులు, అశక్తులు వివరించడం జరిగింది. అనగా సాధన చేయటం వలన వచ్చే శక్తులు అనగా ఏమి యోగ శక్తులు? ఏవి దైవశక్తులు? ఏవి క్షుద్ర శక్తులు? ఏవి అశక్తులు తెలియచేయడం జరిగింది. అలాగే అష్టసిద్ధులు, పంచసిద్దులు, దశసిద్దులు గురించి వివరించడం జరిగింది.
20వ అధ్యాయంలో మోక్షము మరియు ముక్తి గురించి వివరించడం జరిగింది . అనగా మోక్షము అంటే ఏమిటి? ముక్తి అంటే ఏమిటి? ఈ రెండింటికి గల తేడా ఏమిటి? మోక్ష సాధనకు ఉండే స్థాయిలు ఏమిటి? మున్నగు సందేహములు వివరించడం జరిగింది.
21వ అధ్యాయంలో సాధన అంతిమ లక్ష్యం వివరించడం జరిగింది. సిద్ధ పురుషుల సాధనలు ఎప్పటి వరకు వచ్చి ఆగిపోతున్నాయి? అసలు సాధకుడు ఎలాంటి స్థితి పొందే వరకు సాధన చేయాలి? ఎందుకు చేయాలి? చేయడం వలన కలిగే ఉపయోగం ఏమిటి? ముందుకు సందేహములు వివరించడం జరిగింది.
22వ అధ్యాయంలో మరణం గురించి వివరించడం జరిగింది. అనగా మరణం అంటే ఏమిటి ? జీవుడు ఏ ఏ సమయాలలో మరణించును? మరణించిన జీవుడు ఎక్కడికి వెళతాడు ? ఏ ఏ లోకాలలో ఉంటాడు? ఎలా ఉంటాడు? అక్కడ ఉండే జీవన విధానాలు ఏమిటి ? ఇలా మున్నగు సందేహములు వివరించడం జరిగింది.
23వ అధ్యాయంలో గ్రంథసారం గురించి వివరించడం జరిగింది. అనగా గ్రంధంలోని సారాంశం ఏమిటి ? సాధకుడు ఏమి తెలుసుకోవాలి? ఏ విధంగా సాధన చేయాలి ? మున్నగు విషయాలు గురించి వివరించడం జరిగింది.
24వ అధ్యాయంలో మీకు తెలుసా? అని సృష్టి ఎందుకు ఏర్పడింది? ఎలా ఏర్పడింది ?అలాగే గ్రంథములో వచ్చే పదాలకు అర్ధాలు వివరించడం జరిగింది.
25వ అధ్యాయంలో సాధన సందేహములు వివరించడం జరిగింది . అనగా సాధకులకు వచ్చిన సందేహములకు సమాధానాలు ఇవ్వడం జరిగింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి