సృష్టి

 7. సృష్టి 


1) 'సృష్టి' ఎలా జరిగినది? వివరించండి?

వేదాల్లోను, శాస్త్రాల్లోను, పురాణాలల్లోను సృష్టి రచనా క్రమం వివరించబడినది. మొదట అంధకారమైన శూన్యము నుండి పెద్ద శబ్దముతో కూడిన ఒక దివ్యజ్యోతి ఏర్పడినది. ఈ దివ్య జ్యోతినే పరమాత్మ అందురు. ఏర్పడిన శబ్దనాదమును ఓంకార నాదము అందురు. అందుకే పరమాత్ముడికి ప్రతీకగా “ఓం” ను ఉంచుతారు. అలాగే ప్రతి మంత్రము నందు “ఓం” శబ్దము తప్పనిసరిగా ఉంటుంది. ఈ పరమాత్మ నుండి అణువు ఏర్పడినది. దీని నుండి గ్రుడ్డు ఏర్పడినది. దీని నుండి ఆత్మ ఏర్పడినది దీని నుండి ఆకాశము, దీనినుండి వాయువు, దీనినుండి అగ్ని, దీని నుండి జలము, దీని నుండి భూమి ఏర్పడినది. భూమి నుండి త్రిగుణాత్మకమైన ప్రకృతి ఏర్పడినది. దీనినుండి ఔషధాలు ఏర్పడినవి. దీనినుండి చెట్లు, చేమలు ఏర్పడినవి. వీటినుండి అన్నము ఏర్పడినది. అన్నము నుండి జీవుడు ఏర్పడినాడు. జీవుడు నుండి ప్రాణము, దీని నుండి మనస్సు, దీనినుండి బుద్ధి, దీని నుండి అహంకారము, దీని నుండి ఇంద్రియములు దీనినుండి సంకల్పము. దీనినుండి కర్మ ఏర్పడినది.

అంటే శూన్యము<< జ్యోతిస్వరూపం (పరమాత్మ)<< ఓం

<<అణువు<<గ్రుడ్డు<<ఆత్మ<<ఆకాశము<<వాయువు

<<అగ్ని<<జలము<<భూమి<<ప్రకృతి <<ఔషధాలు<<చెట్లు, చేమలు <<అన్నము<<జీవుడు <<ప్రాణము <<మనస్సు << బుద్ధి<<అహంకారము << కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు<<సంకల్పము<<కర్మ!

అందుకే మహాయోగులకు తమ సమాధిస్థితిలో ఆ పరమాత్మ జ్యోతి స్వరూపంగా కనపడును. అందువల్లనే దీపమును పరమాత్మ స్వరూపముగా భావించుతున్నారు.


2)యోగ పరిభాషలో శరీర నిర్మాణ క్రమమును తెల్పండి?

యోగ పరిభాషలో మన శరీరము పంచభూతాలతో, పంచ ప్రాణలతో, పంచ ఉపవాయువులతో, 306 ఎముకలతో, 72 వేల నాడులతో నిర్మితమైనది! మన శరీరంలో పంచభూతాలు అయిన ఆకాశము పిండాశయముగా ఉన్నది. అలాగే వాయువు మన

శరీరంలో శ్వాస రూపంలో ఉన్నది. అలాగే అగ్ని మన శరీరంలో జఠరాగ్ని రూపంలో ఉన్నది. అలాగే జలము మన శరీరంలో రక్తము రూపంలో ఉన్నది. ఇలా మన శరీరం పంచభూతాలైన ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమితో ఏర్పడినది. అలాగే పంచ ప్రాణాలైన ప్రాణము, అపానం, సమానం, ఉదానం, వ్యానంలతో ఏర్పడినది! ప్రాణమనేది గొంతు క్రింద నుండి గుండె క్రిందవరకు జరిగే పనులను నడుపుతూ ఉంటుంది. అలాగే సమానం అనేది గుండె నుండి బొడ్డువరకు ఉంటూ అక్కడే జరిగే పనులను సదుపుతూ ఉంటుంది. అలాగే అపానం అనేది బొడ్డు దిగువ భాగం నుండి గుదం వరకూ ఉంటూ అక్కడే జరిగే పనులను పరివేక్షిస్తూంటుంది. అలాగే ఉదానం అనేది కంఠానికి పైన ఉంటూ అచ్చటి జరిగే పనులను పరివేక్షిస్తూ ఉండును. అలాగే వ్యానం అనేది శరీరమంతటా ఉంటూ అక్కడి పనులను పరివేక్షిస్తూ ఉంటుంది. ఈ విధంగా మనశరీరంలో పంచ ప్రాణాలుంటాయి. అలాగే పంచ ఉపవాయువులు అయిన నాగ, కూర్మ, ధనంజయ, దేవదత్త, కృకల అనే వాయువులతో నిండి ఉండును. ఇవి ఎముకలు, చర్మము మొదలగు వాటిలో ఉంటూ వాటిని నడుపుతూ ఉంటాయి. అలాగే మన శరీరము 306 ఎముకలతో వెన్నుపాముతో నిర్మితమగును, అలాగే మన శరీరంలో 72 వేల నాడులున్నాయి. వీటిలో ముఖ్యమైనవి 72 నాడులు మాత్రమే! వీటిలో అతిముఖ్యమైన ప్రాణ తరంగవాహక నాడులు పది మాత్రమే ఉన్నాయి. ఇవి ఎరుపు, తెలుపు, నీలం, ఆకుపచ్చ రంగులలో ఈ నాడులుంటాయి. ఈ నాడులు రక్తంతో నిండి, సంకోచ, వ్యాకోచాలు చెందుతూ, శరీరమంతటా ఉంటాయి. ఈ విధంగా మానవ శరీర నిర్మాణము ఏర్పడినది.


3)యోగశాస్త్రమునకు సంబంధించిన శరీర నాడులు తెల్పండి?

యోగశాస్త్రానికి ప్రాణతరంగ వాహకములైన పది రకాల నాడులతోనే పని ఉన్నది. అవి 1. ఇడ 2. పింగళ 3. సుషుమ్న 4. గాంధారి 5. పూష 6. కుహు 7. శంఖిని 8. హస్తి జిహ్వ 9. అలంబుష 10. యశస్విని. ఈ పది నాడులు గూర్చి విపులముగా తెలుసుకొందాము.

ఇడ: ఇది వెన్నుపాముకు బయట మూలాధార చక్రానికి ఉన్న త్రికోణానికి ఎడమవైపున ఆరంభమై, ఎడమవైపు ముక్కు రంధ్రంలో అంతమగును. దీని ప్రవాహం పైకి ఉంటుంది.

పింగళనాడి: ఇది వెన్నుపాముకు క్రింద మూలాధార చక్ర త్రికోణానికి కుడివైపున ఆరంభమై కుడి ముక్కు రంధ్రము అంతమవుతుంది. దీని ప్రవాహం పైకి ఉంటుంది.

సుషుమ్న నాడి: ఇది వెన్నుపూస మధ్య భాగంలో - మూలాధార చక్ర త్రికోణం మధ్యలోఆరంభమై, మెదడులోని బ్రహ్మ రంధ్రము వరకు తామర గొట్టములాగా, సూక్ష్మంగా, జ్వాలాముఖిగా ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే ఈ నాడీ మూలాధార చక్ర త్రికోణం మధ్యలో ప్రారంభమై, మెదడులోని బ్రహ్మరంధ్రము వరకు వ్యాపించి ఉండును. దీనిలోనే షట్ చక్రాలు అయిన మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరక, అనాహత, విశుద్ధ ఆజ్ఞా చక్రాలుంటాయి. వీటి ద్వారానే అఖండమైన బ్రహ్మానందం లభించును. ఇడానాడి, పింగళనాడి, సుషుమ్ననాడులు మూలాధార చక్ర త్రికోణం నుండి ప్రారంభమగును. ఈ సుషుమ్నా నాడియే అన్ని నాడులకు కన్నా అతి ముఖ్యమైన నాడి! అంటే సుషుమ్న నాడియే పరమతీర్థం, అదే పరమ జపం. అదే పరమధ్యానం. అదే పరమగతి. అందుకే ఈ సుషుమ్ననాడిని శూన్యపదవి, బ్రహ్మరంధ్రీ, మహాపథి, శాంభవి, శ్మశాని అంటూ పిలిచేవారు. ఈ సుషుమ్న నాడిలోనే వజ్రనాడి, దానిలో చిత్రనాడి, దాని లోపల బ్రహ్మనాడి ఉన్నాయి. ఈ వజ్ర, చిత్ర, బ్రహ్మ నాడులు మరణానంతరం అదృశ్యమైపోతాయి.


శంఖిని నాడి : ఇది గుదంలో ఉంటుంది.

హస్తి జిహ్వనాడి : ఇది కుడి కంటిలో ఉంటుంది.

యశస్వినాడి : ఇది ఎడమ చెవిలో ఉంటుంది.

గాంధారీనాడి: ఇది ఎడమ కంటిలో ఉంటుంది.

పూషానాడి : ఇది కుడి చెవిలో ఉంటుంది.

కుహూనాడి: ఇది లింగంలో ఉంటుంది.

అలంపుషానాడి : ఇది ముఖములో ఉంటుంది.


4)'సృష్టి' ఎందుకు జరిగినది?

మొదట విశ్వములో నిరాకారమైన (ఆకారములేని) అంధకారమున్నది. అదియే పరబ్రహ్మం ! ఈయనకు వెలుగు కావాలన్పించి వెలుగు ఏర్పడాలన్న ఒక సంకల్పము చేసుకొన్నాడు. అపుడు పెద్ద శబ్దముతో గూడిన ఒక కాంతివంతముగా సత్ జ్యోతి స్వరూపం ఏర్పడినది. ఈ సత్ జ్యోతి స్వరూపమే పరమాత్ముడు! అంటే నిరాకారుడైతే పరబ్రహ్మగాను, ఆకారుడైతే పరమాత్ముడిగా ఉంటాడు. ఆకారుడైన పరమాత్ముడు తనకు తోడు గావాలని సంకల్పించాడు. అపుడు తన నుండి ఆత్మగా మారినాడు. అక్కడ నుండి జీవాత్మగా మారినాడు. ఎవరైనా తోడు దొరకుతారని సృష్టిని ఏర్పరచినాడు. ఈ సంకల్పమునుండి కొన్ని కోట్లసంకల్పాలుగా అదే విధానములో వచ్చినాయి. అవే 84 లక్షల జీవజాతులుగా ఏర్పడ్డాయి. ఈ భూమిమీద అయిన గూడ ఆ పరమాత్ముడికి సరియైన శాశ్వతమైన తోడు దొరకలేదు. దొరికిన ప్రతివాడు సతాజ్యోతి స్వరూపములో లయం చెందుతున్నాడు. అదిగూడ ముక్తి రూపములో చెందుతున్నాడు. తనకు సరియైన శాశ్వతమైన తోడు కోసము ఏర్పడిన సంకల్పాలను తీర్చుకోవడానికి, అనుభవించడానికి ఆయన ఏర్పడినారు. తన సంకల్పాలను తీర్చుకోవడానికి ఆ పరమాత్ముడు ఆత్మగాను, జీవాత్మగా మారి జీవుడిగా ఏర్పడినాడు. అందుకే ఈ సృష్టి ఏర్పడినది. అందుకే అన్ని జీవజాతులలో ఒకే ఆత్మ ఉండేదని శాస్త్రాలు చెపుతున్నాయి. అందుకే సృష్టి ఏర్పడే విధానము ప్రారంభమైనది అంధకార పరబ్రహ్మము నుండి అని చెపుతారు. అక్కడనుండి దివ్యజ్యోతి రూపము సత్ జ్యోతి స్వరూపముగా పరమాత్ముడు ఏర్పడినాడని, అక్కడ నుండి ఈయన నుండి అణువుగా అంటే ఆత్మ ఏర్పడినదని, అక్కడ నుండి జీవాత్మ అనగా సృష్టి ఏర్పడినదని చెపుతారు. తన కోటి సంకల్పాలను తీర్చుకొనుటకు జీవసృష్టి ఏర్పడినది. అది 84 లక్షల జీవజాతులుగా ఏర్పడ్డాయి. అందులో మానవజాతి గూడ ఒక జాతి అన్నమాట. అన్ని జీవజాతులలో కన్నా ఈ మానవజాతి ఉత్తమమైనది. ఎందుకంటే దీనికి వివేకమనే జ్ఞానమున్నది కాబట్టి !.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గ్రంథ పరిచయం

   అరుణాచల శివ పరమేశ్వరుడి లీల అనుగ్రహం  యోగ దర్శనం అంకితం : పరబ్రహ్మ స్వరూపులైన  పరమేశ్వరి , పరమేశ్వరుల  పాదారవిందములకు…. నా ఆది గురువైన శ్...