అష్టాంగయోగము

 అష్టాంగయోగము గూర్చి తెల్పండి?


ఈ యోగానికి అష్టాంగాలున్నాయి. అవి 1. యమము, 2. నియమము, 3.ఆసనము, 4. ప్రాణాయామము, 5. ప్రత్యాహారము, 6. ధారణ, 7.ధ్యానము, 8. సమాధిస్థితి. వీటి సమిష్టి స్వరూపాన్ని అష్టాంగ యోగమంటారు! ఈ ఎనిమిది, ఉపాసనా యోగానికి, అంటే ధ్యాన యోగానికి, భక్తి యోగానికి, ఆత్మ సంయమ యోగానికి అంగాలే! ఈ ఎనిమిది అంగాల సాధనాఫలమే యోగం అంటారు. అలాగే సాంఖ్యయోగం, జ్ఞాన యోగం, కర్మయోగం, క్రియాయోగం, కర్మసన్యాసయోగం, భావాతీత ధ్యానయోగం, క్రియాయోగం, నాదయోగం, రాజయోగం, రసానందయోగం మున్నగు ఏ యోగాన్ని ఆచరించినా పైన చెప్పబడిన ఎనిమిది అంగాలు తప్పనిసరిగా ఆచరించాలి. అలాగే ప్రతియోగానికి ఇవి అంగాలనీ గ్రహించటం చాలా అవసరం.


ఈ ఎనిమిది అంగాలలో ప్రాణాయామ, ప్రత్యాహారం, ధారణ, ధ్యానము, సమాధిస్థితి, నేరుగా యోగంతో దగ్గర సంబంధము కలవి. కాబట్టి వీటిని అంతర సాధనలందురు. అలాగే యమము, నియమము, ఆసనము అనేవి ఈ మూడు ఆరంభదశలో సాధకుడికి సహాయకారులుగా ఉంటాయి. అందువలన వీటిని బహిరంగ సాధనలు లేదా బాహ్యసాధనలందురు. అయితే సాధకుడు ఈ ఎనిమిదింటిని ఒకేసారి ప్రారంభించాలి. ఒకదాని తర్వాత మరొకటి సాధన చేయాలనటం అలాగే అభ్యాసం చేయాలనటం లేదా అలా అనుకోవటం చాలా తప్పు! ఇవన్నీ ఏకకాలంలో మొదటినుండి అభ్యాసం చేయాలనే మన ఋషులు, యోగులు చెప్పారు. ఉదాహరణకు మానవశరీర అవయవాలన్నీ, జన్మించినప్పటినుండి ఉన్నవే గదా! అవే క్రమేణా ఆహారవిహారాదులవల్ల వికాసాన్నీ, వృద్ధిని, పుష్టిని పొంది, అభివృద్ధి చెందుతున్నాయి గదా! అంటే పుట్టినప్పుడు లేని అవయవాలు తరువాత క్రొత్తగా పుట్టవుగదా! అట్లే, ఈ యోగాంగాలన్నీ మొదట నుండి ఉండి, అభ్యాసము, సాధన చేసిన కొద్ది క్రమంగా వికాసం చెంది, పరిపక్వమవుతాయి. అలాగే యమము అనేది అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము అనే అయిదు అంశాలను కలిగి ఉంటుంది. నియమము అనేది సంతోషము, శౌచము, తపస్సు,స్వాధ్యాయము, ఈశ్వర ప్రణీధానం అనే అయిదు రకాల అంశాలను కలిగి ఉంటుంది. అలాగే ఆసనము అనే అంగము ఎనిమిది రకాల ఆసనాలను కలిగి ఉంటుంది. అవి స్వస్తిక, గోముఖ, పద్మ, వీర, సింహ, భద్ర, ముక్త, మయూర ఆసనాలు, అలాగే ప్రాణాయమము.అనేది రేచకము, పూరకము, కుంభకములనే మూడు రకాల ప్రక్రియలను కలిగి ఉంటుంది. అలాగే ప్రత్యాహార అంగము 5 విధాలుగా ఉంటుంది. అవి 1. విషయాలకు వశమైన మనస్సును వెనుకకు ఆకర్షించడము, 2. చూచేదంతా ఆత్మేనని భావించటం, 3. నిత్యము చేసే కర్మల ఫలాన్ని త్యజించటం 4. సమస్త విషయాల యెడల వైముఖ్యం కలిగి ఉండటం, 5. 18 మర్మ స్థలాల్లోను ధారణ చేయటం! అలాగే ధారణ అంగమునకు 3 రకాలైన ధారణ విధానాలు అవి 1. ఆత్మయందు మనస్సును ధారణ చేయటం, 2. దహరాకాశంలో బాహ్యాకాశాన్ని ధారణ చేయటం 3. పంచభూతాలలో పంచమూర్తులను ధారణ చేయటం! అలాగే ధ్యాన అంగమునందు ధ్యానము రెండు విధాలుగా ఉంటుంది. అవి 1. సగుణధ్యానము, 2. నిర్గుణధ్యానము. అలాగే సమాధి స్థితి అంగమునందు రెండు విధాలైన సమాధి స్థితులు కలుగును. అవి 1. సంప్రజ్ఞాత సమాధి, 2. అసంప్రజ్ఞాత సమాధిస్థితి.


ఇప్పటి వరకు అష్టాంగయోగము గూర్చి తెలుసుకొన్నాము. యోగశాస్త్రము అంతా అష్టాంగం మీదనే ఆధారపడి ఉన్నది. అందువలన మన యోగసాధన అంతా అష్టాంగాలతో కూడి ఉంటుంది. కావున మనము ఇపుడు అష్టాంగాల గూర్చి పూర్తిగా తెలుసుకోవాలి.


అష్టాంగాలు గూర్చి తెల్పండి?

అష్టాంగాలు అనగా ఎనిమిది రకాల అంగాలు అనే అర్ధము అవి 1. యమము, 2. నియమము, 3. ఆసనము, 4. ప్రాణాయామము, 5. ప్రత్యాహారము, 6. ధారణ, 7. ధ్యానము, 8. సమాధిస్థితి. వీటిని గూర్చి పూర్తిగా తెలుసుకొందాము.


యోగసాధనలో యమ-నియమాల గూర్చి తెల్పండి?

ఆధ్యాత్మిక వికాసానికి యమ-నియమాలు చాలా అవసరము. సరైన ఆలోచనలు, సరైన ప్రయత్నం సరి అయిన వాక్కు, ఏకాగ్రత, ప్రతి మనిషికి చాలా అవసరం. ఇవి మనిషిలో క్రమశిక్షణను అలవాటు చేస్తాయి. అందుకే ప్రతి మతగ్రంథములో ప్రతి మనిషి ఆధ్యాత్మికంగా ఎదుగుటకు ఒక ప్రవర్తనా నియమావళి బోధించటం జరిగినది. యమ-నియమాలు అనేవి ఈ ప్రవర్తనా నియమావళులే!


"యమ" అనేది సమాజపరంగా మనిషి ఎలా నడుచుకోవాలో సూచిస్తుంది. అహింస, సత్యము, అస్తేయం, బ్రహ్మచర్యము, అపరిగ్రహ అనే ఈ అయిదు అంశాలు యమకు సంబంధించినవి. ఇందులో

అహింస :- అంటే హింసకు దూరంగా ఉండటాన్నే "అహింస" అందురు. హింస అంటే కేవలం జంతువులను చంపటం హింస అనుకొంటే పొరబాటే! తప్పుడు ఆలోచనలతో, తప్పుడు చేతలతో, తప్పుడు పనులతో వేరొకరిని బాధపెట్టడం కూడ హింస అవుతుంది. అంటే వీటి అన్నింటికి దూరంగా ఉండటం "అహింస" అవుతుంది. అలాగే సర్వకాల, సర్వావస్థలయందు, ఏ ప్రాణి యెడల వైరభావము లేకుండా, ప్రేమ భావము కలిగి ఉండాలి. అలాగే ఎవరికీ ఏవిధమైన కీడు తలపెట్టకుండా ఉండటం అహింస అవుతుంది. హింసాభావమే అన్ని అనర్ధాలకు మూలం! భయము, దుఃఖం, కోపములాంటి దుర్గుణాలన్నీ హింస వల్లనే పుడుతున్నాయి. కాబట్టి యోగసాధకుడు ముందుగా అహింసా వ్రతాన్ని చేయాలి. ఈ విధంగా అహింసా భావము కలిగి ఉండుటవలన సాధకుడికి అతడి మనస్సు నుండి వైరభావము అనేది పోతుంది. అతనికి ఎవరిమీద శత్రుత్వముండదు. తద్వారా అతనికి ఎవరు శత్రువు ఉండరు.

సత్యము : తనకు తెలిసిన దానిని, తాను చూచిన దానిని, తాను మనస్సులో అనుకొన్న దానిని చెప్పటం, ఆ చెప్పిన దానిని ఆచరించటం సత్యమనిపించుకొంటుంది. సత్య అంటే నిజం ! ఈ క్షణమే నిజం. ఈ క్షణంలో పరిశుద్ధమైన కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలతో సంపూర్ణంగా ఉండటం సత్యము అవుతుంది. అలాగే సమస్త ప్రాణుల హితం కొరటం, వాటి హితాన్ని పలకటం, వాటికి హితమాచరించటం సత్యము అవుతుంది. నిరర్థకమైన, అబద్ధపు మాటలు మాట్లాడకుండా ఉండటం, అలాగే నిజాన్ని పలకటం సత్యం అవుతుంది. సాధకునికి సత్యవ్రతపాలన స్థిరమైనప్పుడు అతడు చేసే యోగ్యమైన ప్రతి పని నెరవేరుతుంది. అతడన్న మాట జరిగి తీరుతుంది. అతడు తలపెట్టిన పనులు విజయవంతమగును. అనగా సాధకుడికి వాక్ శుద్ధి అనే సిద్ధి వస్తుంది!

అస్తేయము :- అంటే ఇతరుల వస్తువులను ఆశించకుండా ఉండటం లేదా కోరకుండా ఉండటం అస్తేయం అవుతుంది. అంటే కొంతమంది తమవి కాని వాటిని తమవిగా, తాము చేయని పనులను తామే చేసినట్లుగా చెపుతూంటారు. అలాగే ఇతరుల ఆస్తులను, వస్తువులను కాజేయాలనీ చూస్తుంటారు. వీటన్నింటికి దూరంగా ఉండటం అస్తేయము అవుతుంది. అంటే దొంగబుద్ధి లేకుండా ఉండటం అస్తేయం. సాధకుడు ధృడ మనస్కుడై కపటంతో, అధర్మంగా ఇతరుల వస్తువులను ఆశించకుండా అస్తేయ వ్రతాన్ని ధృడంగా చేసుకొన్నపుడు, అతనికి అవసరమైనట్టి సమస్తమైన ఉత్తమ పదార్థాలు, వస్తువులు అవసరమైనప్పుడల్లా లభిస్తాయి!

బ్రహ్మచర్యం :- బ్రహ్మచర్యమంటే శృంగారానికి  దూరంగా ఉండటం గాదు! ఆ చర్యలో జ్ఞానేంద్రియాలతో, కర్మేంద్రియాలతో పరిపూర్ణమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఆ కోరికను అధిగమించడమే బ్రహ్మచర్యము అవుతుంది. అలాగని ఇష్టము వచ్చినట్లుగా, మనస్సుకు కోరిక కలిగినపుడల్లా కోరిక తీర్చుకోవటం గాదు బ్రహ్మచర్యం. అలాగే వేశ్య సంపర్గములకు దూరంగా ఉండటం, కోరిక అదుపుపెట్టుకోవటం బ్రహ్మచర్యమవుతుంది. అలాగే పర పురుష, పరస్త్రీ సంవర్గం లేకుండా, పాతివ్రత్యాన్ని, ఏకపత్ని వ్రతాన్ని పాలించడం కూడ బ్రహ్మచర్యమే. బాల్యంలో వివాహం చేసుకోకుండా, బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉన్నందువలన, వీర్యలాభం కలుగుతుంది. అంటే శారీరకమైన బలం, బుద్ధిబలం కలుగుతాయి. సాధకుడు బ్రహ్మచర్య వ్రతము పాటించకపోతే, స్వాధిష్ఠాన చక్రము దీనికి అనుసంధానమైన విశుద్ధ చక్రము బలహీనపడును. తద్వారా ఈ రెండు చక్రాలు శుద్ధిగావు. సాధకుడు ఈ విషయమునందు బహుజాగ్రత్త కలిగి ఉండాలి. సాధకుడు 12 సం||రాల పాటు బ్రహ్మచర్య దీక్షలో వుంటే మంత్రసిద్ధి లభించును!

అపరిగ్రహం :- విషయాలు లేదా కోరికలయందు అభిమానాదులు లేకుండా ఉండటం అపరిగ్రహం అగును. అంటే భోగాలను అనుభవించటం కోసము దాని సంబంధితమైన వస్తువులను సేకరించడం, వాటిని ఎల్లపుడూ రక్షించుకోవాలనీ అనుకోవటం, వాటికి వినాశనం కలిగినపుడు దుఃఖించటం మొదలైన దోషాలను వదిలివేయటం అపరిగ్రహం అవుతుంది. అంటే దేహయాత్రకు అవసరమైన దానికంటే ఎక్కువ కోరకుండా ఉండటం అపరిగ్రహం అగును. సాధకుడికి దీనివలన తాను ఎవరు, ఎచటినుండి వచ్చాడో, ఏమి చేయాల్సి ఉందో, ఏ ఏ పనులు చేయటంవల్ల జన్మ సార్ధకమౌతుందో అనే ఈ విధమైన ఆలోచనలు అతని మనస్సులో స్థిరపడతాయి.


యోగసాధనలో నియమము గూర్చి తెల్పండి?

"నియమము” అనేది సమాజపరంగా మనిషి ఎలా జీవించాలో చెపుతుంది. శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము అని 5 రకాలు అంశాలు నియమమునకు సంబంధించినవి. వాటిలో

శౌచము :- శౌచము అంటే పవిత్రత లేదా శుద్ధి అందురు. అంటే శుచిగా ఉండటం అన్నమాట. ఈ శౌచం అనేది బాహ్య శౌచము, అంతర శౌచమనే రెండు విధాలుగా ఉంటుంది. బాహ్యశౌచమంటే స్నానము వగైరాలతో శరీరాయవాలను, దుస్తులను, ఆహారము, నీరు వగైరాలను మురికి లేకుండా శుభ్రంగా ఉంచుకోవటం బాహ్యశౌచము అవుతుంది. అలాగే అంతర శౌచమనగా మనస్సు, బుద్ధి, మొదలైన అంతరింద్రియాలకు సంబంధించిన శౌచమును అంతర శౌచమందురు. అంటే ధర్మాచరణం, సత్యభాషణం, సత్సంగం, స్నేహం, కరుణ, సంతోషం వంటి శుభగుణాలతో శుభకర్మలు చేసే స్వభావాల్ని కలిగి ఉండడం అంతర శౌచమవుతుంది. సాధకుడు ఎల్లప్పుడు బాహ్య శౌచమును కలిగి ఉండుటవలన తన శరీరం మీద తనకే అసహ్యం కలిగి, ఇతరులను తాకటానికి సంకోచించి దూరంగా ఉంటాడు. ఎంత శుభ్రపరచినా శరీర అవయవాలు మలిన భూయిష్ఠాలే మల మూత్రాదులతో, చెమటతో, ఎప్పటికపుడు మలినంగా తయారయ్యే ఈ శరీరం మీద రోత కలిగి దాని మీద మమకారం తగ్గిపోతుంది. అలాగే సాధకుడు అంతర శౌచమును కలిగి ఉండుటవలన అంతకరణ శుద్ధి ఏర్పడి, ప్రసన్నమైన మనస్సును కలిగి ఉండటం, ఆత్మసాక్షాత్కార యోగ్యత కలిగి ఉండటం మున్నగు లక్షణాలు కలుగును.


సంతోషము :- ప్రతి పనియందు సంతృప్తి కలిగి ఉండటం సంతోషమగును. అలాగే సంతోషమువలన కలిగే సుఖము, ఆనందము చాలా ఉత్తమమైనది. అయితే ప్రతిపని యందు, ప్రతి విషయమునందు సోమరితనంగా ఉండటం సంతోషం అనిపించుకోదు. ఏ పనినైనా కష్టపడి చేయటంవలన కలిగే ఆనందమును సంతోషమందురు. అలాగే ఎల్లప్పుడు ధర్మాన్ని ఆచరిస్తూ దుఃఖము లేకుండా ఉంటూ మరియు అత్యాశ లేకుండా ఉంటూ ఉండటం సంతోషమునకు మూలము.


తపస్సు :- ధర్మమైన పనులను ఆచరించటం వలన మనస్సును, ఆత్మను, స్వచ్ఛముగా, నిర్మలముగా చేసుకొనుటను తపస్సు అందురు. అంటే సుఖదుఃఖాలు, కష్టసుఖాలు శీతతాపాలు, మానావమానాలు మున్నగు ద్వంద్వాలను సహించటం, చాంద్రాయణాది వ్రతాలను ఆచరించడం ధ్యానస్థితుడై మౌనమును కలిగి ఉండటం, ప్రతినిత్యం యోగాభ్యాసం చేయటం మున్నగు విషయాలు తపస్సు క్రిందకు వస్తాయి. సాధకుడు తపస్సును కలిగి ఉండుటవలన అశుద్ధి క్షయమైపోతుంది. అలాగే శరీరము, ఇంద్రియాలు బలమును పొంది రోగాలు లేకుండా ఉంటాయి.


స్వాధ్యాయము :- స్వాధ్యాయమంటే గ్రంథాలను, వేదాలను, పుస్తకాలను, యోగుల జీవిత చరిత్రలను పఠించటం లేదా చదవటమును స్వాధ్యాయమందురు. అలాగే మోక్షవిద్యను, వేదశాస్త్రాలను చదవటం, చదివించటం, మంత్రాల భావాలను, అర్థాలు తెల్సుకోవటం మున్నగు విషయాలన్నీ స్వాధ్యాయం అగును. సాధకుడికి ఈ స్వాధ్యాయంవలన పరమాత్మ స్వరూపమైన ఇష్టదేవతా అనుగ్రహము కల్గును అలాగే పరమేశ్వరానుగ్రహం, దైవ సహాయం, ఆత్మశుద్ధి, సత్యాచరణం, ధర్మాచరణం, ప్రేమ, భూతదయ, అహంకార రహితంగా ఉండటం మున్నగు సద్గుణాలు సాధకుడికి కల్గును.


ఈశ్వర ప్రణీధానం :- ఈశ్వరునియందు అచంచలమైన భక్తిని కలిగి ఉండుటను ఈశ్వర ప్రణీధానం అందురు. అంటే పరమాత్మ లేదా ఈశ్వరుడును ప్రతిరూపముగా ఓంకారమున్నది గదా! ఈ ఓంకారమును నిరంతరము జపము చేయాలి. జపం చేసేటప్పుడు ఆ ప్రణవం యొక్క అర్థాన్ని లోలోపల భావన చేస్తూ జపించాలి. అంటే మంచం మీద పడుకున్నా, ఆసనం మీద కూర్చున్నా, మార్గంలో నడుస్తున్నా, ఎల్లప్పుడూ, ఏకాగ్రచిత్తం ప్రణవజపము (ఓంకార నాదము) చేయాలి. ఈ విధంగా ప్రణవ జపము చేయటం వలన సాధకుడికి జ్ఞానము, ఆనందము కలుగుతుంది. అలాగే యోగసాధనయందు విఘ్నాలు కలుగకుండా ఉంటాయి. అలాగే పరమేశ్వరుని అనుగ్రహం లభించి, పరమేశ్వరుని మీద భక్తి క్రమంగా పెరుగుతుంది. తద్వారా యోగసిద్ధి కలుగుతుంది. ఈ యోగబలము వలన జపసిద్ధి కలుగుతుంది. ఇట్లా యోగసిద్ధి, జపసిద్ధిలవలన యోగి యొక్క ఆత్మయందు పరమాత్మ ప్రకాశం గోచరిస్తుంది. అలాగే ఈశ్వర ప్రణిధానం వల్ల సాధకుడికి తేలికగా సమాధిస్థితి కలుగుతుంది.


అలాగే ఏది జరిగినా నీమంచికోసమే జరిగినది అనే భావనతో ఉండాలి. ప్రతిపనిలోను నీ పూర్తి ప్రయత్నాన్ని పెట్టి, ఫలితాన్ని ఆ పరమేశ్వరుడికి వదిలి వెయ్యాలి. యమ, నియామాలకు, ధ్యానానికి అవినాభావన సంబంధమున్నది. యమ, నియమాలు పాటిస్తే ధ్యానం కుదురుతుంది. ధ్యానం చేస్తేనే యమ, నియమాలు అలవడును. కావున వీటిని తప్పకుండా పాటించండి. అపుడు మనస్సు ఆధీనమై, సాధకుడిలోని షట్చక్రాలు జాగృతి అగును. తద్వారా సాధకుడు ఆధ్యాత్మికంగా ఎదగవచ్చును.


యోగసాధనలో వచ్చే ఆసనము గూర్చి తెల్పండి.

జపము, ధ్యానములకు ఏవిధంగా కూర్చొంటే అనుకూలముగా, సుఖముగా ఉంటుందో దానిని ఆసనము అందురు. అలాగే మనం దేనిమీద కూర్చొంటే వీలుగా, చక్కగా ఉంటుందో దానిని ఆసనం లేదా పీట అంటారు. ఈ రెండిటిలోను తల, మెడ, శరీరము, నిటారుగా నిలబెట్టి కూర్చోవాలి. ఇలా కూర్చోవటం వలన షట్చక్రాలు మరియు సహస్రారం ఒకే వరుసలో ఉంటాయి. అపుడు ధ్యానముగాని, జపముగాని, ఉపాసనగాని చేస్తే ఆ చక్రాలలో చలనము కల్గును. అపుడు యోగసాధకుడికి జపసిద్ధిగాని, ఉపాసనా సిద్ధిగాని వెంటనే కలుగును. ఇలా కూర్చోవటం వలన మనస్సు త్వరగా ఆధీనములోనికి వచ్చి ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహములను పొంది, తద్వారా ధ్యానమును బాగుగా చేయవచ్చును. అలాగే సాధకుడు తన ధ్యానమునందు మూడు గంటలపాటు ఒకే ఆసన స్థితిలో ఉండగలుగుతాడు. ఇలా కూర్చోగలిగితే అపుడు ఆ సాధకుడికి 'ఆసనసిద్ధి' లభిస్తుందని యోగశాస్త్రాలు చెపుతున్నాయి. ఈ ఆసనసిద్ధివలన సాధకుడికి ధైర్యము, ఆరోగ్యము , శరీరం తేలికగా ఉండటం అనే సిద్ధులు లభిస్తాయి. అదియుగాక శరీరస్మృతి లేకుండా, తద్వారా ధ్యానమును బాగుగా చేసుకోవచ్చును.

ఇక్కడ ఆసనాలు రెండు రకాలుగా ఉంటాయి. 1. సుఖాసనాలు, 2. యోగాసనాలు! వీటిలో సుఖాసనాలు అనగా ధ్యానము, జపము, మున్నగు యోగసాధనకు చేయుటకు ఉపయోగపడు ఆసనాలు. అలాగే ఎట్లా కూర్చొంటే సుఖంగా ఉండి, యోగసాధనకు అనుకూలంగా ఉంటుందో దానిని సుఖాసనమందురు. జపధ్యానాదులకు ఉపయోగపడే సుఖాసనాలు 4 రకాలుగా ఉన్నవి. అవి 1. సుఖాసనం, 2. సిద్ధాసనము, 3. పద్మాసనము, 4. స్వస్తికాసనము, అలాగే యోగసనాలు అనగా శరీరవృద్ధికి ఉపయోగపడే ఆసనాలను యోగాసనాలు అందురు. ఈ సృష్టిలో ఎన్నిరకాల జీవజంతువులున్నాయో అన్ని రకాల యోగాసనాలున్నాయి. అందుకే పూర్వం శివుడు 84 లక్షల యోగాసనాలు చెప్పి, అందులో 32 ఆసనాలు చాలా ముఖ్యమైనవని అన్నారు. కాని యోగశాస్త్రాలు ఎనిమిది రకాల యోగాసనాలు చాలా ముఖ్యమైనవిగా చెపుతున్నాయి. అవి 1. గోముఖ ఆసనం 2. వీర ఆసనము, 3. సింహ ఆసనము 4. భద్ర ఆసనము, 5. ముక్త ఆసనం 6. స్వస్తికాసనము, 7. పద్మాసనము 8. మయూర ఆసనము, ఇవిగాకుండా సూర్య నమస్కారాలు చేయవలెను. యోగాసనాలు చేయటంవలన శరీరమునకు ధృఢత్వము (బలం) పెరుగును. తద్వారా ధ్యానములో కూర్చొనపుడు శరీరము కంపించకుండా ఉండును. ఎపుడైతే సాధకుడికి ధ్యానమునందు శరీరము కంపించునో అపుడు అతనికి ఆసనసిద్ధి లేనట్లేగా భావించుకోవచ్చును. అంటే శరీరము ధృడత్వముగా లేదని అనుకోవచ్చును. దీని నివారణ కోసము ప్రతిరోజు, క్రమము తప్పకుండా యోగసనాలు, సూర్యనమస్కారాలు చేస్తే అతనికి యోగసిద్ధివలన శరీరమునకు ధృడత్వము పెరుగును. తద్వారా అతనికి ఆసనసిద్ధి లభించును. తద్వారా ధ్యానమునందు ఏకాగ్రత బాగుగా పెరుగును. ఈ యోగాసనాలు అనేవి తప్పనిసరిగా గురుఃముఖముగా నేర్చుకోవాలి. పుస్తకాలలో, గ్రంథములలో చూసి యోగాసనాలు వెయ్యవద్దని మనవి. అంటే యోగాసనాలు నేర్చుకొని బాగా తర్ఫీదు పొందిన తర్వాత మీరు ఇంటివద్ద యోగాసనాలు వెయ్యటం ప్రారంభించాలని నా మనవి.

ఇక ధ్యానముగాని, జపముగాని చేయునపుడు కూర్చోవటానికి ఉపయోగపడే పీట ఎలా ఉండాలో చూద్దాం! అంటే కూర్చొనే పీట కొయ్యతో చేయబడి, శరీరం చక్కగా, సుఖంగా పట్టేంత పొడవు, వెడల్పులు కలిగి ఉండాలి. దాని మీద దర్భాసనము వేయాలి. దానిమీద ఉన్నితో చేయబడిన కంబళి వేయాలి! దీనిమీద మందంగా ఉండే తెల్లని వస్త్రం ఉంచాలి. దీనిమీద పులి చర్మం కానీ చింత చర్మం కానీ ఏది వీలైతే దానిని పరచాలి. ఈ రెండు చర్మములు దొరకనిచో చివరకు తెల్లని పట్టుబట్టను పరచాలి. మొత్తం ఇవన్నీ… రెండు అంగుళాలకంటే ఎక్కువ మందము ఉండరాదు. ఈ విధంగా అమర్చిన ఆసనము లేదా పీటను ఉచితాసనమందురు. ఉదాహరణకు రమణమహర్షి గారి ఫోటోలు గమనిస్తే ఈ ఉచితాసనము ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఈ ఉచితాసనమునకు ఇన్ని నియమాలు ఎందుకు పెట్టారంటే సాధకుడు ధ్యానం చేసేటపుడు శరీరంలో అధికంగా శక్తి ప్రవాహము లేదా విద్యుత్ ప్రవాహాము జరుగుతుంది. మనలో ఏర్పడిన ఈ విద్యుత్ ప్రవాహాము భూమిలోనికి వెళ్లకుండా ఈ ఉచితాసనము కాపాడుతుంది. ఎలా అంటే ఎండు కొయ్యపీట, ఎండిన దర్భలు (ధర్భాసనం), తెల్లని వస్త్రాలు, పట్టు వస్త్రాలు, పులి లేదా జింక చర్మాలు, ఇవన్నీ కూడ విద్యుత్ వాహకాలు కావు. గమనించగలరు. అదే ఈ విధమైన ఏర్పాట్లు లేకపోతే మన యోగశక్తి, భూమిలోనికి విలీనం (కలిసిపోవటం) జరుగుతుంది. అందువలన మన యోగశక్తి లేదా శక్తి ప్రవాహాము భూమి ఆకర్షించకుండా ఉండటానికి ఈ ఉచితాసనమునకు యిన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే పీట మీద కూర్చోనేటపుడు మెడ, తల, శరీరము, నిటారుగా పెట్టి కూర్చోవాలి. ఇలా స్థిరంగా కూర్చొవటం వలన శీతోష్ణాదులు శరీరమును బాధించవు. అలాగే శరీర అవయవాలు కంపించవు. కూర్చొనే ధ్యానము చేసుకోవటానికి వీలుంటుంది. అపుడు మనస్సును బాహ్య విషయాలనుండి మరల్చి, సమాధిస్థితి పొందుటకు అవకాశం ఉంటుంది. సాధకులు సాధ్యమైనంతవరకు ఈ ఉచితాసనమును ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఉచితాసన ఏర్పాటు లేకుండా మీరు ఎన్ని పూజలు, ఎన్ని జపాలు, ధ్యానాలు అలాగే ప్రాణాయామాలు చేసినా ప్రయోజనముండదు గమనించగలరు. అలాగే వెదురుతో చేసిన ఆసనాలు, రాతితో చేసినా ఆసనాలు, కర్రచెక్కలతో చేసిన ఆసనాలు మీద కూర్చొని జపతపాలు, ధ్యానాలు చేయరాదు. అలాగే పూజాసమయాలయందు జప, తప, ధ్యానాలయందు ఖాళీ నేలమీద కూర్చొని వీటిని చేయరాదు. అట్లు చేసినచో మీ పూజాశక్తి, మీ జపశక్తి, మీ యోగశక్తి, మీ ఆత్మశక్తిని భూమి తన ఆకర్షణ శక్తితో తనలోనికి విలీనం చేసుకోగలదు. గమనించగలరు. అందుకే యోగసాధనలో ఆసనమునకు అంత ప్రాముఖ్యతను ఇచ్చారు!


యోగసాధనలో వచ్చే 'ప్రాణాయమము' గూర్చి తెల్పండి?

శరీరవృద్ధికి యోగాసనాలు ఎలా ఉన్నాయో, నాడీశుద్ధికి ప్రాణాయామము అలాంటిది. అంటే ప్రాణాయామము చేయటంవలన మన శరీరంలోని 72వేల నాడులు శుద్ధి అవుతాయి. ఆసనసిద్ధి లభించిన పిమ్మట, శ్వాస ప్రశ్వాస యొక్క గతిని అడ్డగించటాన్ని ప్రాణాయామం అందురు. లేదా శరీరంలోని వాయువులను నిరోధించుటను ప్రాణాయామము అందరూ. లేదా ప్రాణ అపాన సమానాది వాయువుల సహాయంతో మనస్సును విజయ వాసనల నుండి నిరోధించటానికి చేసే అభ్యాసాన్ని ప్రాణాయామము అందురు. అంటే వాటినిబట్టి చూస్తే ప్రాణాయామము వాయువులతో సంబంధము కలదని అర్థమవుతుందిగదా! అంటే మన శరీరములో ఉండే వాయువుల గూర్చి మొదట మనకు తెలియాలి గదా! అనగా మన శరీరంలో ప్రాణ, అపాన, సమాన, వ్యాన, ఉదానములు అనే వాయువులుంటాయి. వీటినే పంచ ప్రాణాలు అని కూడా అంటారు. అలాగే వీటితో పాటు నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనుంజయములు అనే ఐదు రకాల ఉపవాయువులు కూడా ఉంటాయి! అయితే ప్రాణవాయువు హృదయంలోను, అపానవాయువు గుదములోను, సమాపవాయువు నాభిలోను, ఉదాన వాయువు కంఠములోను, వ్యానము సమస్త శరీరములోను ఉంటాయి! ఇవి వీటి స్థానాలు. అలాగే నాగము త్రేపులోను, కూర్మము రెప్పలాడించటంలో, కృకరం తుమ్ములో, దేవదత్తం ఆవులింతలో కనిపిస్తాయి. ధనంజయం అనేది సర్వవ్యాపియై, చనిపోయినా వదలకుండా ఉంటుంది. ఈ విధంగా మన శరీరంలో అయిదు వాయువులు, అలాగే అయిదు ఉపవాయవులు ఉన్నాయి. వీటిని శ్వాస ప్రశ్వాస ప్రక్రియల ద్వారా అదుపు పెట్టుకొనుటను ప్రాణాయామము అందురు. కాని ప్రాణాయామము యొక్క రకాలు గూర్చి భిన్న రకాలుగా ఉండునట్లుగా వివిధ యోగ గ్రంథాలు ద్వారా తెలుస్తుంది. కాని ప్రాణాయామము ముఖ్యముగా మూడు విధాలుగా చెప్పుకొనవచ్చును. అవి 1. బాహ్యవృత్తి, 2. అభ్యన్తర వృతి, 3. స్తంభ వృత్తి. వీటినే బాహ్యవృత్తిని ప్రథమ ప్రాణాయామముగా, అభ్యన్తర వృత్తిని రెండవ ప్రాణాయామముగా, స్తంభవృత్తిని మూడవ ప్రాణాయామముగా పిలుస్తారు కొందరు! మరికొందరు వీటినే రేచక, పూరక, కుంభకాలనీ అందురు. కాని పతంజలి యోగసూత్రాల్లో చెప్పిన ప్రాణాయామము విధానం చాలా ప్రాచుర్యము పొందినది. అందువలన హఠయోగములోని ప్రాణాయమము గూర్చి ఇక్కడ వివరించటం జరిగింది. గమనించగలరు.


ప్రాణవాయువు చలిస్తునంతసేపు మనస్సు చంచలంగానే ఉంటుంది. కాబట్టి ప్రాణవాయువును స్థిరంగా నిలపాలి! అపుడు ప్రాణవాయువుతోబాటు మనస్సు కూడా నిశ్చలంగా ఉంటుంది. కాబట్టి మనము పీల్చే వాయువును క్రమపద్ధతిలో నిరోధించాలి. అందుకు నాడీశుద్ధి చాలా అవసరం. శరీరంలోని నాడులన్నీ మాలిన్యంతో నిండి ఉంటాయి. ఈ నాడులు శుభ్రంగా ఉన్నపుడు ప్రాణవాయు సంచారము వలన నాడులు శుభ్రంగా ఉంటాయి! కాబట్టి సాధకుడు నాడిశుద్ధికోసం ప్రాణాయామాభ్యాసం చేయాలి. అలాగే ఈ ప్రాణాయామము లేకుండా ఏ మంత్రము సిద్ధించదు! అలాగే ఈ ప్రాణాయామమును సాత్విక బుద్ధితో చేయాలి! అలాగే మనస్సును ఏకాగ్రత సిద్ధించుటకు ప్రాణాయామము చాలా అవసరము ! ఈ ప్రాణాయామమును గురుముఖముగా నేర్చుకొని అభ్యాసము చేయాలి! అంతేగాని పుస్తకాలలో, గ్రంథాలలో చూసి ప్రాణాయామము చేయరాదని నా మనవి ! ఇష్టం వచ్చినట్లు ప్రాణాయామము చేసినచో చెవిటితనం, మూగతనం, మతి భ్రమణం, మూర్ఛవ్యాధి, పక్షపాతము, అకాల ముసలితనం, బుద్ధిమాంద్యం మున్నగు వ్యాధులు సంక్రమించే ప్రమాదమున్నదని వాయు పురాణము అను గ్రంథములో వివరించారు. గమనించగలరు.

ప్రాణాయామము చేసే విధానము 2 రకాలుగా ఉన్నది. కాబట్టి సాధకుడు తన ఇష్టతను బట్టి తనకు నచ్చిన విధానము చేయవచ్చును. అందులో మొదటి విధానము ఏవిధంగా చేయాలంటే మొదట సాధకుడు పద్మాసనములో కూర్చొని, కుడిముక్కును కుడిచేతి బొటనవ్రేలుతో మూసి, ఎడమ ముక్కుతో నెమ్మదిగా గాలి పీల్చాలి. దీనిని 'పూరకం' అంటారు. అలా పీల్చిన గాలిని అలాగే నిలిపి కాసేపు ఉంచాలి. దీనిని 'కుంభకము' అందురు. ఆ తరువాత కుడిచేతి చూపుడు వ్రేలుతో ఎడమ ముక్కును మూసి, కుడిముక్కు నుండి గాలిని నెమ్మదిగా వదలాలి. దీనిని 'రేచకము' అందురు. అలాగే కుడి ముక్కునుండి పీల్చి, ఎడమ ముక్కు నుండి వదలాలి. ఈ విధంగా చేయటం ఒక ప్రాణాయామమవుతుంది. పూరకానికి 4 సెకన్లు, కుంభకమునకు 30 సెకన్లు, రేచకానికి 4 సెకన్లు సమయముండాలి గమనించగలరు. అంటే ఎడమ తరువాత కుడి, కుడి తర్వాత ఎడమ నాడుల ద్వారా ప్రాణాయామము చేయాలి. ఇట్లా మూడు నెలల పాటు చేస్తే నాడీ శుద్ది జరుగును. అలాగే ప్రాణాయామము వేగంగా చేయరాదు. గమనించగలరు.


ఇక రెండవ విధానములో గాయత్రి మంత్రముగాని, ఓంకారం ద్వారాగాని చేసి ప్రాణాయామము చేయవచ్చు. అంటే ఓంకారంతో కూడిన సప్త వ్యాహృతులను గాయత్రి శీర్షం అంటారు.


ఓం భూః, ఓం భువః, ఓగ్ం సువః, ఓం మహః ఓం జనః ఓం తపః ఓగ్o సత్యం. 

ఓం తత్సవితుర్వరేణ్యం, భర్గోదేవస్య ధీమహిః ధియోయోనః ప్రచోదయాత్.


ఓం ఆపోజ్యోతీరసో 2 మృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్' ఈ మంత్రాన్ని మూడు సార్లు జపిస్తే ఒక ప్రాణాయామము అవుతుందని బృహద్యోగి యాజ్ఞవల్క్య స్మృతిలో చెప్పారు. ఈ విధముగా పైన చెప్పిన రెండు పద్ధతులు ద్వారా ప్రాణాయామము చేయవచ్చును. అలాగే ప్రాణాయమమును ప్రాతఃకాలంలో, సాయం సంధ్య సమయంలో, అలాగే అర్ధరాత్రి సమయమునందు, తడవకు 80 సార్లు చొప్పున మూడు కాలాలయందు చేయాలి. అయితే ప్రారంభంలో ఈ ప్రాణాయామము సాధకుడి శక్తి కొలది చేయాలి గాని బలవంతముగా చేయరాదు! అలాగే అభ్యాసము పెరిగే కొద్ది ప్రాణాయామము సంఖ్యను పెంచుకొంటూ పోవాలి. అలాగే సరైన పద్ధతిలో, క్రమపద్ధతిగా, ప్రతిరోజు ప్రాణాయామము చేయాలి. ఒకసారి ప్రాణాయామము చేయటం మొదలుపెట్టితే చచ్చేనంతవరకు ఒకరోజూ కూడ చేయకుండా ఉండరాదు. గమనించగలరు. కొన్ని రోజులు చేసి, ఆపి, ఆ తర్వాత కొన్ని రోజులు చేసి, ఆపటం ఇలా చేస్తే సాధకుడు తెలియని నయంకాని రోగాల బారిన పడతాడని శాస్త్రాలు చెపుతున్నాయి. కనీసము రోజుకూ 11సార్లు అయిన చేయవలెను. ప్రాణాయామము చేయుటకు సాధకుడికి బద్ధకముండరాదు.


ప్రాణాయామము చేసే సాధకుడు ముందుగా పరిశుభ్రమైన స్థలమును ఎన్నిక చేసుకోవాలి. అలాగే ఉచితాసనమును ఏర్పాటు చేసుకోవాలి. సాధకుడు తనకు అనుకూలమైన ఆసనంలో కూర్చొవాలి! అంటే పద్మాసనముగాని, సుఖాసనంలోగాని మరేదైనా ఆసనంలో కూర్చోవాలి. సాధకుడు ఉత్తరముఖముగా గాని, తూర్పు ముఖముగాని కూర్చోవాలి. ప్రాణాయామము చేయుటకు ఒక గంట ముందు ఏవిధమైన ఘనపదార్థ ఆహారమును తీసుకోరాదు. అలాగే ప్రారంభించే ముందు మూడు గుటకల నీళ్లను త్రాగవలెను. అలాగే ప్రాణాయామమును చాలా వేగముగా, అలాగే చాలా నెమ్మదిగా చేయరాదు ! ఒకే విధమైన సమవేగంతో చేయాలి. కనిష్ట ప్రాణాయామములో చెమట వస్తుంది ! మధ్యను ప్రాణాయామములో శరీరం వణుకుట కలుగుతుంది. ఉత్తమ ప్రాణాయామములో ఉత్తమస్థాన ప్రాప్తి అంటే మోక్షస్థానం కలుగుతుంది. అలాగే ప్రాణాయామము చేయుటవలన వచ్చిన చెమటను శరీరం మీదనే మర్ధన చేసి ఇంకేటట్లుగా చేయాలి! దీనివలన శరీరానికి ధృడత్వము, అలాగే శరీరము తేలికపడును! ఒక ప్రాణాయామునకు, రెండవ ప్రాణాయామమునకు విరామము లేకుండా చేయాలి. అభ్యాస కాలములో సాధకుడు పాలు, నేతితో ఆహారమును భుజించాలి. గమనించాలి. అలాగే అభ్యాసం ధృడమైన పిమ్మట ఇక ఈ నియమాలు అవసరం ఉండదు. కొంతకాలము సాధన చేసిన తర్వాత మొదటి విధాన ప్రాణాయామములో ఓంకారముగాని, గాయత్రి మంత్రముగాని, పంచాక్షరీమంత్రముగాని, అష్టాక్షరీ మంత్రముగాని అనుసంధించి ప్రాణాయామము చేయవలెను. రెండవ విధాన ప్రాణాయామమునకు మంత్రము అవసరముండదు గమనించగలరు. అలాగే బ్రహ్మచర్య దీక్షతో ప్రాణాయామమును అభ్యాసము చేస్తే చాలా శీఘ్రముగా ఫలితాలు కల్గుతాయి. అసలు ప్రాణాయామము చేయటం వలన ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, నాడీశుద్ధి, శరీరము కాంతివంతముగా ఉండుట, ముఖము చాలా తేజోవంతముగా ఉండుట, అలాగే సమాధిస్థితి పొందే యోగము కల్గును.


మూడు నెలల  పాటు ప్రాణాయామము చేస్తే నాడీశుద్ధి కలుగుతుంది. ప్రాణాయామాభ్యాసం వల్ల వాయుధారణ శక్తి కలుగుతుంది. దానివలన అనేక సిద్ధులు లభిస్తాయి. ప్రాణాయామము వలన వీర్యలాభం కలుగుతుంది. అలాగే సాధకుడు దీర్ఘ జీవితాన్ని పొందుతాడు. మలమూత్రాదులు తగ్గి, నిద్ర కూడా తగ్గుతుంది. ముక్కు, ఉమ్మి,చెమట మరియు నోరు - వీటి నుండి వచ్చే దుర్గంధాలు ఆగిపోతాయి! అనేక రోగాలు నయమవుతాయి. అభ్యాసం పెరిగిన కొద్ది సాధకుడికి భూచరసిద్ధి అంటే ఈ భూమి మీద అన్ని రకాల జీవజాతుల మీద విజయం లభిస్తుంది. అలాగే యోగికి ధారణశక్తి పెరుగుతుంది. అన్నింటియందు ఏకత్వసిద్ధి కలుగుతుంది. అలాగే వాక్సిద్ధి, దూరశ్రవణసిద్ధి, దూర గమనసిద్ధి, దూరదర్శనాది శక్తులు, కామరూపత్వం, అదృశ్యకరణి, వాయుగమనం మొదలైన సిద్ధులు యోగ సాధకుడికి కోరకపోయినా లభిస్తాయి. ఇటువంటి సిద్ధుల విషయంలో సాధకుడు బహుజాగరూకుడై ఉండాలి. గమనించగలరు. ఎందుకంటే ఇటువంటి సిద్ధులే యోగసాధనలో అతనికి విఘ్నకారులుగా ఉంటాయి. వీటి మాయలో పడితే సాధకుడు అంతటితో అతని యోగసాధన ఆగిపోవునని యోగశాస్త్రాలు చెపుతున్నాయి. గమనించగలరు. అలాగే ఇటువంటి సిద్ధులు లభిస్తాయని ప్రాణాయామమును చేయరాదు.


ప్రాణాయామము ఆరంభంలో ఆహార విషయమై చాలా జాగ్రత్తలు తీసుకోవాలనీ యోగశాస్త్రాలు చెపుతున్నాయి. అంటే ఆరంభంలో పాలు, నెయ్యితో ఆహారం ఉండాలి. అలాగే వరి, జొన్న, గోధుమ, పెసలు, కందులు, వగైరా ధాన్యాలు అలాగే అరటి, మామిడి, ఆపిల్, నారింజ, జామవంటి పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తినవచ్చును. అలాగే మితాహారమును మాత్రమే తినాలి. అధికంగా ఆహారము తినిన కొద్ది ఆలస్యం, సోమరితనం, బద్ధకం పెరుగుతుంది. గమనించగలరు. అలాగే ఆరంభకాలంలో చేదు, పులుపు, వగరు, ఉప్పగా ఉండే పదార్థాలు, చిరుతిండ్లు, మద్యము, మాంసము, చేపలు, ఉలవలు, నీరుల్లి, వెల్లుల్లి, గుమ్మడి, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, పెరుగు, వెలగ, సుగంధ ద్రవ్యాలు అలాగే తీపి పదార్థాలు నిషిద్దము. గమనించగలరు. ఈ విధమైన ఆహార నియమాలు పాటిస్తే, ఆహారమును బట్టి మనస్సు ఉంటుంది. మనస్సును బట్టి శరీరముంటుంది. శరీర, మనస్సుల బట్టే బుద్ధి ఉంటుంది. ఈ మూడు స్థిరంగా ఉంటే ప్రాణాయామము మనము చేయగలము. గమనించగలరు.


యోగశాస్త్రాలలో వచ్చే "ప్రత్యాహారము" గూర్చి తెల్పండి?

ప్రాణాయామాన్ని అభ్యాసం చేయగా, చేయగా ఇంద్రియాలు తమ బాహ్యవృత్తుల్నివదులుకొని మనస్సులో విలీనం కావటము కోసము చేసే అభ్యాసాన్ని ప్రత్యాహారము అంటారు. దీనివల్ల ఇంద్రియాలు మనస్సులోనూ, మనస్సునైన బుద్ధిలోనూ లగ్నమగును! ఈ స్థితి లభించినవాణ్ణి ప్రత్యాహార సిద్ధి  అని అంటారు.


ఈ ప్రత్యాహారంవల్ల ఇంద్రియాలన్నీ పూర్తిగా వశమై, సాధకుడు ఎక్కడ తన మనస్సును లగ్నం చేయాలంటే అక్కడ లగ్నం చేయగలుగుతాడు. అంటే ఇంద్రియాలకుండే స్వేచ్ఛ పోతుంది. అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను జయించటం అలాగే శరీరమందు ఆత్మాభిమానాన్ని కలిగించే అజ్ఞానము తొలగటం, అలాగే కర్మక్షయం అవటం, అక్షయానందం కలగటం, అలాగే మనోధైర్యము సిద్ధించటం మున్నగు విషయాలు ఈ ప్రత్యాహారమువలనే సిద్ధించును.



యోగసాధనలో వచ్చే “ధారణ” ప్రక్రియ గూర్చి తెల్పండి?


మనస్సును ఏదో ఒక చోట స్థిరంగా నిలపటాన్ని “ధారణ” అంటారు! లేదా మనస్సు చాలా చంచలమైనది. అటువంటి మనస్సును యమ, నియమాది, పంచ ఉపాయాల ద్వారా వశపర్చుకొని, ఒక నిశ్చితమైన ప్రదేశంలో స్థిరంగా ఉంచటాన్ని ధారణ అంటారు. ధారణకు అనువైన ప్రదేశాలు హృదయము, కంఠము, భ్రూమధ్యము, నాలుక చివరభాగము, నాభిచక్రం, నాసికాగ్రము, వెన్నుముక మొదలైనవి. అట్లా ఏదైనా ఒక ప్రదేశంలో మనస్సు స్థిరపరచి, అర్థభావనతో సహా ఓంకారాన్ని జపించాలి. అలాగే ప్రాణవాయువుతో సహా మనస్సు స్థిరం చేసుకొని, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అనే పంచభూతాలను వేరు వేరు రూపాల్లో ధారణ చేయటమే నిజమైన ధారణ అవుతుంది. అందువలన ధారణ అనేది 5 రకాలుగా ఉంటుంది. అవి పృథివిధారణగాను, జలధారణగాను, అగ్నిధారణగాను, వాయుధారణగాను, ఆకాశధారణగాను అని అయిదు విధాలుగా ధారణ ఉంటుంది. ఇట్లా మనం చేసే ప్రతి ధారణలోను వరుసగా, హం, యం, వం, రం, లం అనే బీజాక్షర మంత్రాల్ని జపించాలి. ఈ విధమైన ధారణవలన సమస్త పాపాలు, అలాగే సమస్త కర్మ ఫలాలు క్షయమవుతాయి.


సాధకుని మనస్సు, ప్రాణవాయువుతో పాటు సుషుమ్ననాడియందు ప్రవేశించినపుడు పంచ చక్రాలైన మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరక, అనాహతచక్రము, విశుద్ధ చక్రములందు ధారణను నిల్పినపుడు, సాధకుడికి పృధివి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచ మహాభూత దేవతలకు సంబంధించిన అయిదు విధాలైనా ధారణ కలుగుతుంది.


పృథివీ ధారణ :- పాదాలనుండి మోకాళ్ల వరకు పృథివి తత్త్వముంటుంది. ఇది 4 కోణాలను కలిగియుంటుంది. దీనియందు బ్రహ్మను ధ్యానం చేయాలి. దీని బీజాక్షరం 'లం' అనే బీజాక్షరమును జపిస్తూ, 2 గంటలపాటు ధారణ చేస్తే సాధకుడికి పృధివీ తత్త్వ విజయం లభిస్తుంది. దాని ప్రభావంవల్ల పృథివి (భూమి) మీద మృత్యుభయం ఉండదు! అనగా మూలాధార చక్ర తత్వము వస్తుంది.



జలధారణ :- మోకాళ్ల నుండి గుదం వరకు ఉన్న భాగం జలతత్త్వం కలది! ఇది అర్థచంద్రాకారంగా ఉంటుంది. దీనిలో ప్రాణవాయువును ప్రవేశపెట్టి, 'వం' అనే బీజాక్షరము జపిస్తూ, విష్ణువును భావిస్తూ ధారణ చేయాలి! ఇట్లా 2 గంటల పాటు చేస్తే ఆ సాధకుడికి జలమృత్యుభయం ఉండదు. అనగా స్వాధిష్టాన చక్రతత్వము వస్తుంది!

అగ్నిధారణ :- గుదం నుండి హృదయ పర్యంతంగల శరీరభాగం అగ్నిస్థానం కలది. ఇది త్రికోణాకారంగా ఉంటుంది. అలాగే ఎరుపు రంగును కలిగి ఉంటుంది. అగ్నియందు వాయువును ప్రవేశపెట్టి 'రం' అనే బీజాక్షరము జపిస్తూ, రుద్రుణ్ణి భావిస్తూ ధారణ చేయాలి. ఈ విధంగా సాధకుడు 2 గంటల పాటు ధారణ చేయటంవలన అగ్నిభయం ఉండదు. అలాగే అగ్ని వలన మరణ భయముండదు. అనగా మణిపూరక చక్రతత్వము వస్తుంది!

వాయుధారణ :- హృదయం నుండి కనుబొమలవరకు గల శరీర భాగం వాయుస్థానం కలది. ఇది ఆరు కోణాలను కలిగి ఉంటుంది. వాయువు స్థానమునందు ప్రాణవాయువును ప్రవేశపెట్టి, 'మం' అనే బీజాక్షరమును జపిస్తూ, ఈశ్వరుని గూర్చి ధ్యానిస్తూ, 2 గంటల పాటు ధారణ చేస్తే ఆ సాధకుడికి వాయువులాగా ఆకాశగమన సామర్థ్యం సిద్ధిస్తుంది. అలాగే వాయుభయం, వాయువువలన మరణ భయం ఉండవు. అనగా అనాహత చక్రతత్వము వస్తుంది!

ఆకాశధారణ :- కనుబొమ్మలనుండి తల నుదురు వరకు గల భాగం ఆకాశ తత్త్వానికి స్థానం. ఇది వృత్తాకారమును కలిగి, ధ్రూమ వర్ణంను కలిగి ఉంటుంది. దీనియందు ప్రాణవాయువును ప్రవేశపెట్టి 'హం' అనే బీజాక్షరము జపిస్తూ, ఆ పరమేశ్వరుని ధ్యానిస్తూ, 2 గంటల పాటు ధారణ చేస్తే, ఆ సాధకుడికి ఆకాశగమనంతోపాటు, సమస్త సుఖాలు లభిస్తాయి. అనగా విశుద్ధ చక్రతత్వము వస్తుంది!

భగవద్గీతలో అభ్యాసం ద్వారా యోగ సంబంధమైన ధారణను సాధించిన సాధకుడికి జన్మ, మరణ, దుఃఖాలనుండే కాకుండా, సుఖాలనుండి సైతం పూర్తిగా విముక్తిని పొందుతాడని చెపుతోంది. ఆదిశంకరులు ధారణ గూర్చి ఈ విధంగా అన్నారు. మనస్సు ఎక్కడికి పడితే అక్కడల్లా బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందుతూ మనస్సును స్థిరంగా ఉంచుకోవటమే ఉత్తమమైన ధారణ అన్నారు. అలాగే అజ్ఞానం వలన ఏర్పరచుకొన్న నామరూపాలను త్యజించాలి! అపుడే సాధకుడు ధారణ అనే స్థితిని పొందుతాడు.


యోగసాధనలో వచ్చే 'ధ్యానము' గూర్చి తెల్పండి?

ధ్యానము అనగా 'ధ్యాస', మనస్సు, ప్రాణము, శరీరం ఈ మూడింటిని ఏకం చేసి ఒకే వస్తువు మీదకు ఏకాగ్రతతో కేంద్రీకరించి, ఆ పరమాత్ముని మానసికంగా ప్రార్థించుటను ధ్యానమందురు. అలాగే మూడు గంటలపాటు ధ్యేయంతో మనస్సు లగ్నం చేయటాన్ని ఒక ధార అనీ, అట్టి 12 ధారణ కాలం అంటే 36 గంటలపాటు ధ్యేయంలో మనస్సు లగ్నం అగుటను ధ్యానమని యోగ తత్త్వోపనిషత్తులో చెప్పబడినది.

ఘేరండ సంహితలో ధ్యానాన్ని మూడు విధాలుగా చెప్పారు. అవి 1. స్థూల ధ్యానం 2. సూక్ష్మధ్యానం 3. జ్యోతిర్థ్యానం. ఏదో ఒక ఇష్ట దేవత రూపాన్ని మనస్సునందు నిలిపి ధ్యానము చేయుటను స్థూలధ్యానమందురు. ఈ స్థూల ధ్యానము చేయుటకు విగ్రహము అవసరం ఉంటుంది. ఈ స్థూల ధ్యానాన్ని అభ్యాసం చేసి క్రమేణా ఆధారం లేకుండా మనస్సును ధ్యానమునందు లగ్నం చేయగల స్థితికి రావాలి. సర్వాంతర్యామి, నిరాకారుడైన ఆ పరమాత్మయందు మనస్సును నిల్పి, ధ్యానము చేయుటను సూక్ష్మ ధ్యానమందురు. ఈ ధ్యానము ఒక్క యోగులకు మాత్రమే సిద్ధించును. అలాగే మూలాధార చక్రములో దీపకళికలాగా వెలుగొందుతూ ఉండే కుండలినీ శక్తి మీద విషయరహితమైన మనస్సుతో ధ్యానము చేయుటను జ్యోతిర్థ్యానం అందురు. ఈ జ్యోతిర్థానం తాంత్రిక పద్ధతికి చెందినది. అలాగే శాంభవి ముద్రతో ధ్యానము చేయుటను సూక్ష్మధ్యానమందురు.

యోగ తత్త్వోపనిషత్తు ప్రకారము ధ్యానము రెండు విధాలుగా ఉన్నది. అవి 1.సగుణ ధ్యానము, 2. నిర్గుణ ధ్యానము. ఈ సగుణధ్యానములో విగ్రహారాధన చేయాలి! అంటే విగ్రహములో ఆ భగవంతుడు ఉన్నాడని భావించుకొని, ఆయనకు షోడశోపచార పూజగాని, పంచాయతన పూజగాని, నిత్యపూజ గాని, లేదా సూక్ష్మపూజగాని చేయవలెను. ఇలా సాధకుడు పూజ చేయగా, ఆ సాధకుడి మనస్సు నిర్మలమై కోరికలు లేని వాడిగా ఏర్పడి, ఆ భగవంతుడి సాక్షాత్కారము లభించును. ఈ సగుణధ్యానము మళ్లీ మూడు విధాలుగా ఉండును. అవి 1. రూపధ్యానం అనగా సాధకుడు తన ఇష్టదేవత మూర్తి రూపమును విగ్రహము తన ఎదుట ఉంచుకొని, తదేక ధ్యానంతో చూచుచూ, మానసికముగా ఆ రూపమును మనస్సులో ముద్రించుకొని ధ్యానము చేయుటను రూపధ్యానము అందురు. ఈ విధముగా సాధన చివర స్థితికి వచ్చినపుడు భగవత్ సాక్షాత్కారము లభించును. ఉదాహరణకు రామకృష్ణ పరమహంస, కాళీకాదేవి విగ్రహమును 12సం||రాల పాటు ఆరాధన చేసి, ఆ మాత ప్రసన్నము పొందారు. అలాగే జ్ఞానదేవుడు పాండురంగడు విగ్రహమును ఈ రూపధ్యానములో ఆరాధన చేసి, ఆయనను ప్రసన్నము చేసుకొన్నారు! ఈ విధంగా వీరిద్దరూ రూపధ్యానంలో తరించారు ఇక నా మధ్యనములో సాధకుడు తన ఇష్ట దేవతా మూర్తి నామము గాని మంత్రము గాని స్తోత్రములు కానీ భక్తిశ్రద్ధలతో లయబద్ధముగా….రాగయుక్తముగా, బిగ్గరగా పల్కుచూ భజన చేయవలెను. ఈ విధముగా కొంతకాలము చేసిన పిమ్మట, ఆ భజనలో తన్మయత్వము చెంది, అలసి సొలసి మైమరచే స్థితికి సాధకుడు చేరుకొంటాడు. ఆ స్థితిలో నామధ్యానము మనస్సులో మానసికముగా జరుగుతుంది. ఈ విధంగా కొంతకాలము సాధన చేసిన తర్వాత తనను తాను మర్చి పోయేస్థితికి సాధకుడు వస్తాడు. దీనినే సమాధి స్థితి యోగమందురు. అపుడు సాధకుడికి ఈ స్థితిలో బ్రహ్మానుభూతిని పొందుతూ తన ఇష్టదేవత మూర్తి రూపము కనిపించును. తిరిగి కొంతసేపటికి ఆ అనుభూతి తగ్గుతుంది. అప్పుడు సాధకుడు మిక్కిలి ఆవేదన చెందుతాడు. మళ్లీ సాధకుడు ఆత్మవిశ్వాసముతో, అత్యుత్సాహంతో నామధ్యానము చేసినచో మళ్లీ ఆ బ్రహ్మానంద అనుభూతిని పొందుతాడు. ఈ స్థితిలో సాధకుడు మూడుగంటలు మించి ఉండలేడు. ఈ విధమైన స్థితిని సాధకుడు పదే పదే పొందుతూ ఉండాలి. ఈ విధంగా చేస్తే అపుడు ఆ సాధకుడికి నిర్వికాల సమాధిస్థితి పొందే అవకాశముంటుంది. తద్వారా ఆ సాధకుడు ముక్తిపధము చేరుకొంటాడు. ఉదా:- శబరి! ఇక భావ ధ్యానములో సాధకుడు తన ఇష్టదేవతమూర్తి యొక్క రూపము గూర్చిగాని, గుణగణములు గూర్చిగాని, ఆయన చేసిన లీలలు గూర్చిగాని, ఆయన చూపించిన అనుభవాలు గూర్చిగాని, ఆయన కల్గించిన అనుభూతులు గూర్చిగాని ఎల్లప్పుడు మననం చేసుకొంటూ, కీర్తించుచూ ధ్యాన నిమగ్నమై ఉంటాడు. అంటే తన ఇష్టదేవత మూర్తి యొక్క లక్షణాలను, రూపమును, గుణగణాలను పద్యాల రూపములో, పాటల రూపములో, కథల రూపములో, కీర్తనల రూపములో పాడుతూ, ఆనందమును పొందుతూ, ధ్యానమునందు నిమగ్నమవుతాడు. ఇలా సాధకుడు కొంతకాలము చేస్తే తన్మయత్వమును చెందుతాడు. తద్వారా బ్రహ్మానుభూతిని లేదా బ్రహ్మానందమును పొందుతాడు. అపుడు ఆ సాధకుడికి తన ఇష్టదేవతా మూర్తి స్వరూపము కనపడును. తద్వారా ముక్తిని పొందుతాడు. ఉదా:- త్యాగయ్య, అన్నమయ్య.


ఇక నిర్గుణధ్యానమును యోగధ్యానమని కూడా అంటారు. నిర్గుణ ధ్యానమనగా నిరాకారుడైన, ఆ పరమాత్ముడి గూర్చి, ధ్యానము చేయుటను నిర్గుణధ్యానమందురు. ఈ ధ్యానమునందు విగ్రహము ఉండదు. గమనించగలరు. ఎటువంటి ఆధారము లేకుండా, మనస్సును ధ్యానమునందు నిల్పుట చాలా బహుకష్టము. ఇది మానవ మాత్రులకు సాధ్యముగాదు! ఈ నిర్గుణ ధ్యానము యోగులకు మాత్రమే సిద్ధించును. గమనించగలరు. ఈ సాధనలో సాధకుడు మొదట ఇంద్రియాలను జయించి ఇంద్రియ నిగ్రహమును పొందాలి! ఈ తర్వాత మనస్సును స్థిరముగా చేసుకొని మంచి ఏకాగ్రతతో నిరాకారుడైన ఆ పరమాత్ముని ధ్యానము చేయవలెను. ఈ విధంగా కొన్నాళ్లు పాటు చేస్తే, ఆపై తత్త్వజ్ఞానము, పరమ బోధనలను ఆచార్యుల మార్గమువైపు మరల్చి, ఆత్మజ్ఞానమును తెలుసుకోవటానికై సహాయము! తద్వారా ఆ ఆత్మజ్ఞానము మనలోని తేజస్సును లీనం చేసి, తద్వారా ఆ పరమాత్మ సాక్షాత్కారమును కల్గించును. ఈ విధమైన నిర్గుణ ధ్యానము సిద్ధించుటకు సాధకుడు అష్టాంగాలైన యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము అభ్యాసము చేయవలెను. తద్వారా సాధకుడికి సమాధిస్థితి పొందే అవకాశము కల్గును. తద్వారా ఆ సాధకుడు ముక్తి పథమును చేరుకొంటాడు.

యోగసాధనలో వచ్చే 'సమాధిస్థితి' గూర్చి తెల్పండి?

ధ్యానము యొక్క చివరస్థితి ఫలమే సమాధిస్థితి. ఏ దివ్యస్థితిలో సాధకుడు తన ఆత్మ స్వరూపాన్ని తన హృదయమునందు దర్శిస్తాడో, ఆ దివ్యానుభూతిని సమాధి అందురు. లేదా సాధకుడి మనస్సు, ఆత్మయందు లయం చెందుటవలన కలిగే స్థితిని సమాధిస్థితి అందురు. ఈ సమాధి స్థితి రెండు రకాలుగా ఉంటుంది! అవి 1. క్షణిక సమాధిస్థితి 2. దీర్ఘ సమాధిస్థితి! వీటిలో ఆత్మలో లయించిన మనస్సు తిరిగి వెంటనే బహిర్ముఖం అంటే బయటకు వచ్చేదాన్ని క్షణిక సమాధి స్థితి అందురు! అదే ఆత్మలో లయించిన మనస్సు తిరిగి బహిర్ముఖముగా రాకుండా, స్థిరంగా, నిలకడగా నిలిచిపోతే ఆ స్థితిని దీర్ఘ సమాధిస్థితి అందురు! దీనినే నిర్వికల్ప సమాధి అందురు! క్షణిక సమాధి స్థితి పొందడమే దుర్లభమని శాస్త్రం చెపుతుంటే, దీర్ఘ సమాధి స్థితి పొందటం ఎంతటి దుర్లభమో ఆలోచించండి! అసలు ఎన్నో జన్మలలో ఈశ్వర ఆరాధన చేస్తేగాని, ఎన్నో జన్మలలో ధ్యానసాధనలు చేస్తేగాని గురువు అనుగ్రహం ఉంటేగాని, సమాధిస్థితి అనుభూతి మనకు కలుగదు! అందుకే భగవద్గీత ఇలా అన్నది! లక్షమందిలో ఎవరో ఒకడు మాత్రమే సమాధి స్థితిని పొందుతున్నాడని చెప్పినది! పతంజలి యోగసూత్రాల ప్రకారం సమాధి అనేది మూడు రకాలుగా ఉంటుంది! అవి 1. సవికల్ప సమాధి లేక సంప్రజ్ఞాత సమాధి 2. అసంప్రజ్ఞాత సమాధి 3. నిర్వికల్ప సమాధి! సవికల్ప సమాధి :- ఈ సమాధిలో సామాన్యంగా మనస్సు మానసికముగా ఓంకారజపము చేస్తూ ఉంటుంది! అంటే ఓంకారజపము రూపంలో క్రియ అనేది ఉంటుంది గదా! అదిగాక మనస్సు, బుద్ధి అనే ఈ రెండు ఈ సమాధిలో ఉంటాయి! ఎందుకంటే ప్రజ్ఞా అంటే బుద్ధి గదా అంటే మనస్సు, క్రియ, బుద్ధి ఆధారంగా ఉండే సమాధి కాబట్టి దీనిన సంప్రజ్ఞాత సమాధి లేక ప్రజ్ఞా సమాధి అన్నారు! ఈ సమాధియోగంలో బుద్ధి మొదలుకొని పంచస్థూల భూతాలు అలాగే పంచసూక్ష్మ భూతాలు అంటే పంచతన్మాత్రలకు సంబంధించి సంపూర్ణ జ్ఞానముంటుంది! ఈ సమాధి యోగములో 1. వితర్క సమాధి 2. విచార సమాధి 3. ఆనందానుగత సమాధి 4. అస్మితానుగత సమాధి అనే నాలుగు రకాల సమాధులున్నాయి! అంటే ఈ సమాధి యోగములో సంపూర్ణ జ్ఞానము అంతా మిగిలే ఉంటుంది! కాబట్టి దీనిని సవికల్ప సమాధి యోగము అని కూడా అనవచ్చును!


అసంప్రజ్ఞాత సమాధి : ఇందులో బుద్ధి మాత్రము ఉండదు! మనస్సు యొక్క స్వరూపం సంస్కార మాత్రంగా మాత్రమే మిగిలి ఉంటుంది! అంటే ఈ సమాధిలో జీవుడు బుద్ధి యొక్క ఆధారాన్ని వదిలివేస్తాడు. అయితే తనదైన మనస్సు యొక్క స్వరూప జ్ఞానము ఇంకా మిగిలే ఉంటుంది. అదియుగాక ఈ మనస్సు యొక్క వృత్తులన్నీ అంటే పనులన్నీ నిరోధించబడుతాయి! ఈ సమాధిని సవికల్ప సమాధికి, నిర్వికల్ప సమాధికి మధ్యస్థితిగా చెప్పుకోవచ్చును!

నిర్వికల్ప సమాధి : జీవాత్మకు తన స్వరూపానికి సంబంధించిన జ్ఞానం కూడ ఆ పరమాత్ముడి యందు లీనమైపోయినపుడు కలిగే సమాధి యోగమును నిర్వికాల సమాధి యోగమందురు! ఇందులో సంస్కార బీజము నశించిపోవును! అలాగే ఈ సమాధి యోగములో జీవుడు- ఈశ్వరుడు లేడు! ఉన్నది బ్రహ్మమే అనే అనుభూతి కలుగుతుంది! అలాగే సమాధిస్థితినందు ఉన్నదంతా బ్రహ్మానందమే! ఇప్పటి వరకు సాధకుడు అష్టాంగ యోగము గూర్చి తెలుసుకొన్నాడు! ఈ అష్టాంగ యోగము సిద్ధించుటకు చిత్త శుద్ధి అవసరం. ఈ చిత్త శుద్ధి కోసం కర్మవాసనలు లేకుండా చేసుకోవాలి! అందుకు ప్రతి సాధకుడికి కర్మ అంటే ఏమిటి, అవి ఎన్ని రకాలు, పాపపుణ్యాలు అంటే ఏమిటి మున్నగు విషయాలు కర్మయోగములో పొందుపరిచారు! అందువల్లన ప్రతిసాధకుడు కర్మయోగం గూర్చి తెలుసుకోవాలి!

ఇపుడు సమాధిస్థితులు ఎక్కడ కల్గుతాయో తెల్సుకొందాం! అసలు సమాధిస్థితి అనేది విశుద్ధ చక్రతత్వములో వస్తుంది! అనగా సాధకుడు 20 ని॥లపాటు తన బాహ్య స్థితిని అనగా శరీర స్మృతిని మర్చిపోతాడు! దీనినే ప్రారంభ సమాధి స్థితి అందురు! దీనివలన మీ ఇష్టదేవత దర్శనం కలుగును! అనగా మీ ఇష్టదేవత అశరీరముతో, ఉండి మాటలు వినిపించును! ఆ తర్వాత సాధకుడు తన సాధన కొనసాగించినట్లయితే ఆ సాధకుడికి ఆజ్ఞాచక్రతత్వములో సవికల్ప సమాధిస్థితి కలుగుతుంది! దీనివలన ఆ సాధకుడికి ఇష్టదేవత సాక్షాత్కారము కలుగును! అనగా ఇష్టదేవత శరీరముతో కనపడి మాట్లాడును! ఉదాహరణకు రామకృష్ణ పరమహంసకు కాళీకాదేవి కనపడినట్లుగా, నామదేవుడికి పాండురంగడు కనిపించినట్లుగా, మీరాబాయికి పాండురంగడు కనిపించినట్లుగా కనపడతారు! కాని సాధకుడికి తన ఆత్మ స్వరూపము జ్ఞానము ఉండదు ఈ సమాధి స్థితిలో! అందుకు సద్గురువు అనుగ్రహం కావాలి! అందుకు ఈయన అనుగ్రహం వలన మాత్రమే సాధకుడికి ఆత్మ దర్శనం కలుగును! అనగా సద్గురువు వల్ల, సాధకుడికి భ్రుకుటి స్థానము నందు గాడు పెట్టినట్లైతే మాత్రమే , దైవదర్శనాలు దైవసాక్షాత్కారాలు ఆగిపోయి తద్వారా బ్రిటి స్థానములో ఒక కోడిగుడ్డు ఆకారంలో ఒక జ్యోతి బిందువు కనపడుతుంది. దీనినే ఆత్మదర్శనం అందురు! అంటే సాధకుడికి సవికల్ప సమాధి స్థితిలో దైవసాక్షాత్కారము అలాగే సద్గురువు అనుగ్రహం వలన ఆత్మదర్శనం కలుగుతాయి అన్నమాట! ఆ తర్వాత సాధకుడు ఇక తన సాధనను కొనసాగించినట్లయితే ఆ సాధకుడు సహస్ర చక్రతత్వములోనికి ప్రవేశించును! అపుడు సాధకుడికి నిర్వికల్ప సమాధిస్థితి కలుగుతుంది! అపుడు శుద్ధమైన ఆత్మయందు పరమాత్మ ప్రకాశం గోచరిస్తుంది! అనగా సత్ జ్యోతి స్వరూపము కనపడుతుంది! దీనినే పరమాత్మ సాక్షాత్కారం అందురు! ఈ సత్ జ్యోతి స్వరూపములోని జ్యోతి బిందువులో తన స్వరూపాన్ని చూడటంను ఆత్మసాక్షాత్కారం అందురు! అనగా సాధకుడు ఈ జ్యోతి బిందువులో తన రూపాన్ని చూస్తాడు అన్నమాట! దీనినే ఆత్మసాక్షాత్కారం అందురు! అదే సాధకుడు నిర్వికల్ప సమాధి స్థితిలో 3 సం॥రాలు పాటు అనగా ప్రకృతి కాలమానం ప్రకారం 10 లక్షల సం॥రాలు పాటు ఉండే తన సహస్ర చక్రములోని 1000 దళాలు సంపూర్ణముగా విచ్చుకొంటాయి! అనగా సాధకుడి మెదడు సంపూర్తిగా, సంపూర్ణముగా వికాసము పొందును! అపుడు పరమాత్ముడు 1000 తలలతో, 1000 చేతులతో విశ్వరూపమును చూపించును! దీనినే విశ్వరూప సాక్షాత్కారము అందురు! ఆ తర్వాత ఇట్టి సాధకుడు పరమ గురువు లేదా పరమయోగి లేదా పరమాత్ముడు అవుతాడు! ఇక సాధకుడు తన యోగసాధనను కొనసాగించినట్లయితే బ్రహ్మరంధ్రము వద్ద ఆనంద సమాధి స్థితి కలుగుతుంది! దీనివలన సాధకుడు ఇతరులకు తన విశ్వరూపమును చూపించగలడు! దీనినే విశ్వరూప దర్శనం అందురు! ఈ విశ్వరూప దర్శనం చూపించినవారు శ్రీకృష్ణుడు, దధిచి మహాముని! అంటే ఈ లెక్కన సాధకుడి జీవాత్మ, ఆత్మగాను (దైవాలు), పరమాత్మగాను (శ్రీకృష్ణ పరమాత్మగా) విశ్వాత్మగాను (విశ్వరూపము) మారుతుంది అన్నమాట! అలాగే దైవదర్శనంవలన తన్మయస్థితి, దైవసాక్షాత్కారము వలన అనుభవస్థితి, ఆత్మదర్శనంవలన ఆత్మాదర్శనానుభూతి, ఆత్మ సాక్షాత్కారం వలన ఆత్మానుభూతి, పరమాత్మ సాక్షాత్కారం వలన పరమానందానుభూతి, విశ్వరూప సాక్షాత్కరము వలన బ్రహ్మానందానుభూతి కల్గుతాయి! గమనించండి! అలాగే విశుద్ధ చక్రములో ప్రారంభ సమాధిస్థితి, ఆజ్ఞా చక్రములో సవికల్ప సమాధిస్థితి, సహస్ర చక్రములో నిర్వికల్ప సమాధిస్థితి, బ్రహ్మరంద్రము వద్ద ఆనంద సమాధి స్థితులు కలుగుతాయని గ్రహించండి! అంటే ఈ సమాధి స్థితులవలన ధ్యాన అనుభవాలు అనగా దైవదర్శనాలు, దైవ సాక్షాత్కారాలు కలుగుతాయని ధ్యాన అనుభూతులు అనగా ఆత్మదర్శనానుభూతి, ఆత్మానుభూతి, పరమానందానుభూతి, బ్రహ్మానందానుభూతి, కైవల్యస్థితి, ఆత్మనిష్ఠస్థితులు కలుగుతాయని గ్రహించండి!

అలాగే ఈ సమాధి స్థితుల గూర్చి, వీటి దళాలను గూర్చి శాస్త్రాలలో వివిధ రకాల చిన్న అభిప్రాయాలున్నాయి! అందులో కొందరు సమాధి స్థితులు రెండు రకాలు అని అవి సవికల్ప మరియు నిర్వికల్ప సమాధి స్థితులని చెపుతారు! మరికొందరు అయితే ఈ సమాధి స్థితులు రెండు విధానాలని అవి సవికల్ప సమాధి మరియు నిర్వికల్ప సమాధి అని అందురు! మరికొందరు అయితే క్షణిక సమాధి మరియు దీర్ఘసమాధి అని రెండు రకాలుగా చెపుతారు! అదే పతంజలి మహర్షి అయితే సంప్రజ్ఞాత సమాధి మరియు అసంప్రజ్ఞాత సమాధి మరియు నిర్వికల్ప సమాధి అని మూడు విధాలుగా ఉండునని చెప్పియున్నారు! అదే రామకృష్ణ పరమహంసగారు అయితే ఈ సమాధి స్థితులు మూడు విధాలుగా ఉంటుందని అవి సవికల్ప సమాధి మరియు నిర్వికల్పసమాధి మరియు ఆనందస్థితి సమాధిగాను ఉంటాయని చెప్పియున్నారు! అదే విధంగా ఉపనిషత్లు అయితే ఈ సమాధిస్థితులు నాలుగు విధాలుగా వుంటాయని అవి 1. సవికల్ప సమాధి 2. నిర్వికల్ప సమాధి 3. తురియ స్థితి లేదా ఆనందస్థితి 4. తురియాతీతమైన స్థితి లేదా ఆనంద రహిత స్థితి ! ఈ విధంగా నాలుగు విధాలుగా సమాధి స్థితులుంటాయని చెప్పియున్నారు! నేను వీటి ఆధారముగా చేసుకొని మీకు సమాధి స్థితులు వివరించాను! ఎందుకంటే ఈ సమాధి స్థితులు రామకృష్ణ పరమహంసగారు చెప్పిన సమాధి స్థితుల దగ్గర పోలికలు ఉన్నాయి కాబట్టి ! అదియుగాక రామకృష్ణ పరమహంసగారు ఈ మూడు రకాల సమాధి స్థితులను అనగా సవికల్ప, నిర్వికల్ప, ఆనందస్థితి అనే సమాధి స్థితులను స్వయంగా తానే అనుభవించి చెప్పియున్నారు! అదియుగాక, ఆనంద సమాధిస్థితివలన ఏర్పడే బ్రహ్మానందానుభూతిని సామాన్య సాధన శరీరాలు తట్టుకోలేవని అదిగూడ 21 రోజుల మించి ఉంటే ఆ శరీరము, ఎందుకు పనికిరాదని అనగా ఇట్టి సాధకుడు పరమపదించునని వారు చెప్పియున్నారు! ఇక తురియాతీతమైన సమాధిస్థితి అనగా ఆనందరహిత సమాధి స్థితి అనేది మాత్రము సాధకుడు తురియస్థితి లేదా ఆనందస్థితి అనే సమాధి స్థితి దాటినపుడే వచ్చును! అనగా ఈ ఆనందస్థితిలో వుండే భావాలు అనగా ఆనందము, ప్రేమ, కరుణ, మున్నగు భావాలకు అతీతముగా వుంటేనే ఆనంద రహిత సమాధి స్థితి కలుగుతుంది!

ఇపుడు అసలు సమాధి స్థితి యొక్క అనుభవం ఎలా ఉంటుందో రామకృష్ణ పరమహంసగారి మాటలలోనే విందాం! ఈయనకు సమాధిస్థితి అనేక విధాలుగా ఉండేవి! కొన్ని స్థితులలో ఆయన శరీరము కొయ్యబారి పోయేది! ఇట్టి స్థితిలో కూడ ఈయన బాహ్య స్మృతిని కలిగి ఉండేవారు! కాని సమాధి గాఢమై ఉన్న ఇతర సమయాలలో మాత్రం బాహ్య స్ఫురణకు చాలాసేపు సమయము తీసుకొనేవారు! అటువంటపుడు ఆయన అగాథంలో మునిగి బయటికి వచ్చినట్లుగా, ఆయన రూపము, మంత్రోపానం సవినియోగతగా ఉండేదికా! అదిమిగాక ఆయన మాటలు గూడ మధ్యలో ఆగిపోయేటట్లుగా అయ్యేవి ఉండేది! తదుపరి భక్తులు వారి ప్రశ్నలకి వచ్చేవారు! ఈయన సమాధి స్థితిలో ఉండగా ఎన్నో విషయాలు మాట్లాడారని ప్రచురితంచేయరు! కాని గొంతు దాటి మాట బయటకు వచ్చేది గాద! అలాగే సమాధి స్థితి నుంచి సామాన్యస్థాయికి వచ్చేటపుడు ఎవరో అదృశ్య వ్యక్తితో సంభాషిస్తున్నట్లుగా గొణుగుతుండేవారు! ఆ అదృశ్య వ్యక్తి ఎవరోకాదు! కాళికామాత అమ్మవారే!


కాని సమాధి స్థితి పొందటానికి మరియు తట్టుకోవడానికి సాధకుడి యొక్క మనస్సు, స్థితి, శరీర ఆరోగ్య అవస్థ, హృదయ నిర్మలత్వము, సూక్ష్మత్వము, విచారము, పవిత్రముగా ఉండుట, పూర్ణ వైరాగ్యము కలిగియుండుట మున్నగు లక్షణాలు కలిగి ఉంటేనే సాధకుడికి సమాధి స్థితి కలుగుతుంది! వీటిలో ఏ ఒక్కటి లేకపోయిన సాధకుడు సమాధి స్థితిని పొందలేడు! తద్వారా ఎటువంటి అనుభూతులను పొందలేడు! అనగా ఆత్మదర్శనానుభూతి, పరమానందనుభూతి, ఆత్మానుభూతి, బ్రహ్మానందనుభూతిని పొందలేరు! తద్వారా ద్వైత సిద్ధి మరియు అద్వైత సిద్ధిని పొందలేరు! అనగా నేను వేరు, దేవుడు వేరు అనే అనుభూతిని (ద్వైతసిద్ధి), అలాగే అంతా ఉన్నది పరబ్రహ్మమేనని అనే అనుభూతి (అద్వైతసిద్ధి) ని పొందలేరు! ఈ ఇటువంటి అనుభూతులను సాధకుడు అనుభవపూర్వకముగా అనుభూతి పొందకపోతే అతడి సాధన అథోగతిపాలు అగును! గ్రహించండి! అనగా సప్త సముద్రాలు ఈది, ఇంటి వెనుక ఉన్న మురికి కాలువలో చచ్చినట్లుగా వీరి పరిస్థితి ఉంటుంది! ఎంతో కష్టపడి యమనియమాలు పాటించి, ఆసనసిద్ధిని పొంది, ప్రాణాయామ ప్రక్రియలతో నాడులను శుద్ధి చేసుకొని, ప్రత్యాహారం, ధారణ ప్రక్రియలతో మనస్సును శుద్ధి చేసుకొని, ధ్యానము ద్వారా స్థిరమనస్సుతో బాహ్య స్మృతిని కోల్పోయి సమాధిస్థితిని పొందాలి! అపుడే అనుభవ పూర్వకమైన అనుభూతులు కలుగుతాయి! తద్వారా మీరు అద్వైతసిద్ధి వలన అహం బ్రహ్మాస్మి అనగా నేనే దేవుడిని అని అనుభూతిని పొందుతారు! పొందాలి! ఇదే సమాధి స్థితి ఫలం!

అసలైన సమాధి స్థితిలో నిజమైన అసలు, సిసలైన ఆత్మానుభూతిని పొందినవారు ఇంక తిరిగి ప్రాపంచిక విషయాలు వైపు చూడరు! అనగా కీర్తి ప్రతిష్టల కోసము, ధనార్జన కోసము, తన స్వార్ధము కోసము యోగసిద్ధులను ఉపయోగించటం లాంటివి చేయలేరు! ఎందుకంటే వీరు ఎపుడు ఆత్మ సంధానము కోసము, ఆత్మానుభూతిని పొందటం కోసము ప్రయత్నిస్తూ ఉంటారు! తద్వారా బాహ్య స్మృతిని అలాగే శరీర స్మృతిని మర్చిపోతారు! ఎవరైతే నిజంగా అసలైన ఆత్మానుభూతిని పొందుతారో వారు అసలు మనస్సే లేని పసిపాపలాగా వుంటారు! ఎపుడు ఏదో ఆలోచిస్తూ, ఏదో చూస్తూ నవ్వుతూ, తాను తానే బాధపడుతూ ఆవేశపడుతూ భార్య ప్రపంచానికి ఉన్మాదిలాగా పిచ్చివాడిలాగా కనపడతారు. కానీ నిజానికి దీనికి ఎటువంటి పిచ్చితనము ఉండదు. కానీ మీరు చేష్టలు పసిపాప లాగా ఉంటాయి. కానీ వీరు చేసే పనులు లోకకల్యాణమునకు ఉపయోగపడతాయి. అందుకే సిద్ధపురుషులు లోకానికి తెలియకుండా, నివాసమునకు యోగ్యము గాని మారుమూల ప్రాంతాలయందు నివసిస్తూ, పిచ్చివాడి మాదిరిగా వుంటూ ఎల్లపుడు తమ ఆత్మను పరమాత్మయందు అనుసంధానం చేస్తూ, ఆత్మనుభూతిని పొందుతూ వుంటారు! ఉదా:- రామకృష్ణ పరమహంస, శిరిడి సాయిబాబా, రమణమహర్షి మున్నగువారు! కాని ప్రస్తుతకాలములో ఉన్నవారు ఒకసారి అనుభూతిని పొంది, అదిగూడ అసంపూర్తిగా పొంది తమ అవివేకమును పెంచుకొని, మాయలో పడిపోయి అనగా ధనార్జన విషయములోగాని, స్త్రీ సంబంధ విషయములోగాని, తన స్వార్థము కోసము యోగసిద్ధులు ఉపయోగించటంలో పడిపోయి తమ యోగసాధనను అథోగతి పాలు చేసుకొంటున్నారు! ప్రస్తుతం ఇలాంటి వారే తామే గురువులమని, తామే దైవాలమని చెప్పుకొని ఎన్నో మఠాలు, పీఠాలు పెట్టి, వాటి ద్వారా ఎన్నో కోట్ల రూపాయలు గడిస్తూ తమకు తోచిన జ్ఞానమును ఉపన్యాసాలుగా చెపుతూ కాలము గడుపుతున్నారు! నిజమైన ఆత్మనుభూతిని పొందినవాడు ఎటువంటి ఉపన్యాసాలుగాని, దైవారాధనలుగని చేయడు! చేయలేడు! ఎందుకంటే వాడే దేవుడు అనే అనుభూతిని పొందుతాడు కాబట్టి! ఇప్పటి కాలములో నిజమైన ఆత్మానుభూతిని పొందినవారిని చూడటం చాలా చాలా అరుదైన విషయము! నేను ఫలానా అనుభూతిని పొందినాను, నాకు ఫలానా యోగసిద్ధి ఉన్నది. ఇలాంటి విషయాలు చెప్పారు అంటే వారు పరిపూర్ణమైన అనుభూతిని పొందలేదని అర్థము! ఎందుకంటే నొప్పి బాధ, వర్ణించమంటే మీరు వర్ణించగలరా? ఆలోచించండి! మరి అలాంటిది మనస్సుకు, బుద్ధికి అతీతమైన స్థితిలో అనుభూతులు కలుగుతాయి గదా! మరి వాటిని ఎలా వర్ణించగలరు! మీరే ఆలోచించండి! ఒక్కటి గుర్తుంచుకోండి! ఎవరైతే నిజమైన అసలు సమాధిస్థితిలో అసలైన సిసలైన ఆత్మానుభూతిని పొందితే వారు ఎప్పుడు, ఎల్లపుడు ఆత్మ సంధానము కోసము అనగా అమృతత్వమును పొందటం లాగా తాపత్రయం పడతాడు! దాని కోసము తనకు తాను సంపూర్తిగా మర్చిపోతాడు! ఇలా 20 గం||ల పాటు మర్చిపోతే వారికి సవికల్ప సమాధిస్థితి కలిగి, తద్వారా ఆత్మదర్శనం కలిగి ఆత్మదర్శనానుభూతిని పొందుతారు! అలాగే కొన్ని నెలలు పాటు సమాధి స్థితిలో వుంటే వారికి నిర్వికల్ప సమాధిస్థితి కలిగి, తద్వారా ఆత్మ సాక్షాత్కారం కలిగి, ఆత్మానుభూతిని పొందుతారు! అలాగే 3 సం||లు పాటు అనగా ప్రకృతి కాలమాన ప్రకారం 10 లక్షల సం||లుంటే వారికి విశ్వరూప సాక్షాత్కరం కలిగి పరమానందానుభూతిని పొందుతారు! అలాగే కొన్ని యుగాలు పాటు బ్రహ్మానందం వద్ది ప్రాణశక్తిని వుంచినట్లయితే వారికి ఆనంద సమాధిస్థితి కలుగుతుంది! తద్వారా బ్రహ్మానందానుభూతి కలిగి వేరొకరికి వీరు విశ్వరూప దర్శనం చూపింపగలరు! కాని సామాన్య సాధన తరాలు ఈ స్థితిని 21 రోజుల మించి తట్టుకోలేవు అని  గమనించండి. 







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గ్రంథ పరిచయం

   అరుణాచల శివ పరమేశ్వరుడి లీల అనుగ్రహం  యోగ దర్శనం అంకితం : పరబ్రహ్మ స్వరూపులైన  పరమేశ్వరి , పరమేశ్వరుల  పాదారవిందములకు…. నా ఆది గురువైన శ్...