కుండలినీశక్తి
కుండలినీ శక్తి గూర్చి చెప్పండి?
మూలాధార చక్ర త్రికోణము యొక్క మధ్యభాగంలో సుషుమ్ననాడి ప్రారంభమగునని తెలుసుగదా! ఈ సుషుమ్ననాడి యొక్క ముఖ భాగము ఒక చిన్న పువ్వు మొగ్గలాగా వుండి ఒక చిన్న రంధ్రము కలిగి ఉంటుంది. ఈ మొగ్గ లింగాకృతిలాగా ఉంటుంది. అందుకే ఈ మొగ్గను స్వయం భూలింగమందురు. ఈ లింగమును మూడున్నర చుట్లు చుట్టుకొని, సర్పంలాగా, తన తోకను తన నోటిలో పెట్టుకొని, ఈ లింగాన్ని ఒక శక్తి కప్పి ఉంచును. దీనినే కుండలినీ శక్తి అందురు. ఇది సహజంగా నిద్రావస్థలో ఉంటుంది. సాధకుడు ఈ కుండలినీ శక్తిని తన సాధనాలు ద్వారా జాగృతి చెయ్యాలి. అపుడు ఈ శక్తి మూలాధార చక్రము నుండి సహస్రారము వరకు ప్రవహించును. అపుడు సాధకుడికి సమాధిస్థితి కలిగి, తద్వారా ముక్తిని పొందుతాడు. ఈ కుండలినీ శక్తి జాగృతి అవ్వటం అంత ఆషామాషీ కాదు. దీనికి గురువు అనుగ్రహము కావాలి. అపుడే ఈ కుండలీ శక్తి జాగృతి అగును. అదే విధంగా సాధకుడు జపము, ధ్యానము, ప్రాణాయామము ద్వారా మరియు మున్నగు సాధనలు ద్వారా ఈ శక్తిని జాగృతి చేసుకోవాలి.
షట్చ్ క్రాలు గూర్చి తెల్పండి. ఇవి మన శరీరంలో ఎక్కడ ఉంటాయో తెల్పండి?
ఇడ, పింగళ నాడులు తమ మూలాధార చక్రమునుండి ఆరంభమై, తమ స్థానాలకు ముక్కు రంధ్రాలలోనికి ప్రవేశించే లోపల వెన్ను పూసకు బయట అయిదు స్థానాల్లో సుషుమ్ననాడితో కలుస్తాయి. అట్లా కలిసే చోట సుషుమ్న నాడిలో 5 చక్రాలు మరియు భ్రూమధ్యానికి వెనుక భాగంలో సుషుమ్ననాడి లోపల ఆరవ చక్రముంటుంది. అంటే షట్చ్ క్రాలు అనగా 6 చక్రములని అర్ధము అవి. 1. మూలాధార చక్రము, 2. స్వాధిష్ఠాన చక్రము, 3. మణిపూరక చక్రము, 4. అనాహత చక్రము, 5. విశుద్ధ చక్రము, 6. ఆజ్ఞా చక్రము. ఇవిగాకుండా సహస్రచక్రమనేది ఇంకొకటి ఉంటుంది!
సాధకుడి యొక్క గుదంలో మూలాధార చక్రము, సాధకుడి యొక్క లింగస్థానమునందు స్వాధిష్ఠాన చక్రము, సాధకుడి యొక్క నాభి అంటే బొడ్డు యందు మణిపూరక చక్రము సాధకుడి యొక్క హృదయము (గుండె) యందు అనాహత చక్రము, సాధకుడి యొక్క కంఠము (గొంతు) యందు విశుద్ధ చక్రము, అలాగే సాధకుడి యొక్క కనుబొమ్మల మధ్యనున్న భ్రూమధ్యానికి వెనుక భాగంలో సుషుమ్ననాడి లోపల ఆజ్ఞాచక్రముంటుంది.
ఈ ఆరు చక్రాలకు పైభాగంలో సుషుమ్ననాడి అంతమయ్యేచోట అంటే కపాలంలో సహస్రార చక్రం ఉంటుంది. ఈ సహస్రారానికి పై వైపుననున్న పరమగుహయే స్థానం. ఈ ఆరు చక్రాల ద్వారా నాడుల్లో అంతః ప్రేరణా తరంగాలు పుడుతూనే ఉంటాయి. ఈ షట్ చక్రాలకు అధిష్టాతృ శక్తి "కుండలినీ" అని రుద్రయామలం, షట్చక్ర నిరూపణం, గరుడపురాణం, వాయుపురాణం, తంత్ర గ్రంథాలలో, హఠయోగ గ్రంథంలో ఇలా మున్నగు గ్రంథాలు ద్వారా మనకు తెలుస్తోంది.
మూలాధార చక్రము గూర్చి పూర్తిగా తెల్పండి?
ఇడ, పింగళ, సుషుమ్న అనే ఈ మూడు నాడులు పుట్టుక మూలాధార చక్రములో ఉంటుంది. దీనినే "త్రివేణి" అందురు. ఈ చక్రం వెన్నుపూస క్రింద, గుదము, లింగమూలం వీటికి కొంచెం క్రిందుగా సుషుమ్ననాడిలో ఉంది. దీని ఆకారం అండాకారంలో ఉంటుంది. ఇది నాలుగు దళాలను కలిగి ఉంటుంది. ఇది నాలుగు దళాలను కలిగి ఉంటుంది. అలాగే త్రికోణాకృతిలో ఉంటుంది. ఇది భూమితత్త్వము కలది. దీని అధిష్ఠాన దైవం "గణపతి"గాను, 'శక్తి' 'ఢాకిని' గాను, అధిష్ఠాతృదేవత 'బ్రహ్మ' గా ఉంటారు. ఇది పీతవర్ణం కలది. ఈ చక్రానికి బీజాక్షరం "లం”.
ఈ త్రికోణాకారంలో మధ్యలో, వెన్నుపూస దిగువ లోపలి భాగంలో ఒక లింగం ఉంది! అది పూవు మొగ్గలాగా ఉండి మధ్యలో చిన్న రంధ్రం కలిగి వుంటుంది! ఈ రంధ్రాన్ని సుషుమ్ననాడి ముఖం అంటారు! మొగ్గలాగా ఉండే ఈ లింగాన్ని స్వయంభూలింగం అంటారు! మొగ్గలాగా ఉండే ఈ లింగాన్ని స్వయంభూలింగం అంటారు! ఈ లింగాన్ని మూడున్నర చుట్లు చుట్టుకొని, మహతేజస్సుతో కూడి బంగారంలాగా మెరిసే జ్యోతి స్వరూపం ఒకటి. సర్పంలాగా, తన తోకను తన నోటిలో పెట్టుకొని, ఆ సుషుమ్ననాడి రంధ్రాన్ని కప్పి వున్నట్టి ఒక మహశక్తి వుంటుంది! దీనినే కుండలినీశక్తి లేదా సప్తకుండలిని అందురు! అనగా విశ్వాన్ని నడిపించే శక్తి విశ్వశక్తి లేదా కాస్మిక్ ఎనర్జీ లేదా మహాకుండలినీ శక్తి అందురు! అదే జీవుడిని నడిపించే శక్తిని జీవశక్తి లేదా ప్రాణశక్తి లేదా కుండలినీ శక్తి అందురు! ఈ కుండలినీ శక్తి స్థానం ఈ మూలాధార చక్ర అడుగు భాగములో వుంటుంది కాబట్టి ఈ చక్రమును మూలాధార చక్రమందురు!
స్వాధిష్ఠాన చక్రము గూర్చి తెల్పండి?
ఈ చక్రము లింగము యొక్క మొదలుకు పైభాగంలో వెన్నుపూసలోని సుషుమ్నలో దీని స్థానం. ఇది అరురేకుల గల పద్మం. ఇది జలతత్త్వానికి ప్రతీకగా ఉన్నది. ఇది
నీటిలాంటి రంగు కలది. ఈ చక్రము యొక్క శక్తి పేరు “రాకినీ”, దీని అధికృత దైవం 'బ్రహ్మ'. ఈ చక్రానికి బీజాక్షరం 'వం' అనే అక్షరం. ఈ చక్రం అపాన, ప్రాణాన్ని నడుపుతుంది.
మణిపూరక చక్రము గూర్చి తెల్పండి?
నాభికి అంటే బొడ్డు వెనుక భాగంలో, వెన్నుపూసలోని సుషుమ్ననాడిలో ఉంటుంది. ఇది పది రేకులు గల పద్మం! ఇది అగ్ని తత్త్వమును కలది. అలాగే అగ్నిలాంటి రంగు కలది. 'రూపం' అనేది దీని గుణం! ఈ చక్రానికి శక్తి పేరు 'లాకిని', దీని అధిష్ఠాన దైవం విష్ణువు! ఈ చక్రానికి 'రం' అనేది బీజాక్షరం! ఈ చక్రం సమాన ప్రాణ సంచాలనం చేస్తూ ఉంటుంది.
అనాహతము చక్రము గూర్చి తెల్పండి?
హృదయానికి (గుండె) ముందుభాగంలో, వక్షస్థలమునకు వెనుక వెన్నుపూసలోని సుషుమ్ననాడిలో ఉంటుంది. ఇది 12 రేకులు కలిగిన కమలమువలె ఉంటుంది. ఇది వాయువు తత్త్వమును కలది. దీనిరంగు ధూమ్రవర్ణం! 'స్పర్శ' అనేది దీని గుణము. ఈ చక్రానికి శక్తి పేరు 'కాకిని' అధిష్టాతృదేవత ఈశ్వరుడు, అధికృత దైవం శివుడు. ఈ చక్రములో ఉండే లింగమును 'బాణలింగము' అందురు. ఈ చక్రము ప్రాణాన్ని నడుపుతూ ఉంటుంది. దీని బీజాక్షరం 'యం' అనే అక్షరం.
విశుద్ధ చక్రము గూర్చి తెల్పండి?
కంఠము అంటే గొంతు మొదట్లో, మేరు దండంలో ఉంటే సుషుమ్న నాడిలో ఉంటుంది ఈ చక్రము. ఈ చక్రమునకు 16 దళాలుంటాయి. ఇది ఆకాశ తత్త్వమునకు ప్రతీకగా ఉంటుంది. శబ్దం అంటే స్వరం దీని గుణము. ఈ చక్రము యొక్క రంగు నీలం. ఈ చక్రము యొక్క శక్తి పేరు 'శాకినీ', అధిష్ఠాన దైవం 'సదాశివుడు'. ఈ చక్రాన్ని బ్రహ్మద్వారం అందురు. ఈ చక్రానికి బీజాక్షరం 'హం'! ఈ చక్రము ఉదానమనే ప్రాణాన్ని నడుపుతుంది. మృత్యువును జయించే శక్తి ఈ విశుద్ధి చక్రంలోనే ఉన్నది. అందుకే ఈ చక్రమునకు అమృతకళ అని కూడా పేరు గలదు!
ఆజ్ఞా చక్రము గూర్చి తెల్పండి?
వెన్నుపూసకు పై చివరన సుషుమ్నా శీర్షంలో భ్రూమధ్యానికి వెనుక భాగంలో ఈ చక్రముంటుంది. ఇది 2 దళాలను కలిగి ఉంటుంది. అలాగే పిట్యూటరి గ్రంధి,.
పినల్ గ్రంథిలను కలిగి ఉంటుంది. ఈ చక్రము మహతత్త్వము అంటే బుద్ధికి చెందినది. ఈ చక్రగుణము ఓంకార నాదము. దీని రంగు తెలుపు. ఈ చక్రం యొక్క శక్తి పేరు 'హాకినీ' లేదా 'సిద్ధకాశీ' ! అధిష్టాన దైవము 'శంభువు'. ఈ చక్రస్థానంలో యోగులకు పరమేష్టి అయిన సద్గురువు ఆజ్ఞ పరబ్రహ్మ యొక్క ఆజ్ఞను గురించి తెలుస్తుంది. అందుకే దీనిని ఆజ్ఞాచక్రము అంటారు.
సహస్రారం గూర్చి తెల్పండి?
ఇది ఆజ్ఞా చక్రానికి పైన ఉంది. కుండలినీ, షట్చక్రాల యొక్క గుణాలను, తత్త్వాలను, క్రమంగా ఇక్కడే లయం చేస్తూ, చివరి స్థానమైన ఈ సహస్రార చక్రంలోకి చేరుతుంది. అందుకే దీనిని లయయోగం అందురు. ఈ కుండలినీ శక్తి షట్చక్రాలలోని కమలదళాల మీదుగా పైకిపోయి, మళ్లీ అదే మార్గంలో తన మూల స్థానమైన మూలధారానికి తిరిగి వస్తుంది. అంటే ఈ ఆరు చక్రాలలోనూ ఉన్న మొత్తం దళాల సంఖ్య - 50 (4+6+10+12+16+2) పైకి పోవటం, క్రిందకి రావటంలో ఈ కుండలినీ శక్తి స్పృశించే దళాల సంఖ్య - 100. ఈ వంద సంఖ్యను దశేంద్రియాలసంఖ్యతో (5 కర్మేంద్రియాలు +5 జ్ఞానేంద్రియాలు) అంటే 10తో గుణిస్తే 1000 అవుతుంది! కాబట్టి సమస్తము లయమయ్యే ఈ చక్రాన్ని సహస్రారం అన్నారు. ఈ సహస్రారానికి అధిష్ఠాన దేవత ఆ పరబ్రహ్మమే. ఈ సహస్రారంలోనే యోగి, తనను తాను తెలుసుకొని, సమాధిస్థితిని పొందుతాడు.
ఈ షట్ చక్రాలలో ఉండే దళాలు, ఆయా చక్రాలతత్త్వాలు, బీజాక్షరాలు, రంగులు మున్నగు విషయాలన్నీ అనుభవజ్ఞులు మరియు సాధకులు అయిన సద్గురువుల ద్వారా తెలుసుకోవలసినదే. పుస్తక జ్ఞానంవల్ల లభించేవి కావు. ఈ షట్ చక్రాల అధిదైవతాల గూర్చి ఆయా సంప్రదాయాలల్లో భిన్నత్వం కనిపిస్తుంది. కొందరు అయితే గణేశుడు, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, జీవుడు, గురువు అని చెపుతారు. ఈ షట్చక్రాలను శుద్ధి చేసుకొనుటకు, ఆధీనము చేసుకొనుటకు అష్టాంగ యోగము గూర్చి పూర్తిగా తెలియాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి