అరుణాచల శివ పరమేశ్వరుడి లీల అనుగ్రహం
యోగ దర్శనం
అంకితం :
పరబ్రహ్మ స్వరూపులైన
పరమేశ్వరి , పరమేశ్వరుల
పాదారవిందములకు….
నా ఆది గురువైన శ్రీ అరుణాచలవాసి అయిన దక్షిణామూర్తి స్వామివారికి
పాదారవిందములకు….
పరమ భక్తితో, నిండు ప్రేమతో
సమర్పిస్తున్నాను!
- పరమహంస
మానవుడి లక్ష్యం
మానవుడి పుట్టుకకి అసలైన సాక్ష్యం
అహం బ్రహ్మాస్మి స్థితిని పొంది
ఆత్మసాక్షాత్కారమును చేసుకోగలగడం
ఇది ప్రతి మనిషి ఎప్పటికైనా
పొందవలసిన ఏకైక జయం!
ఇదే మరణానికి శాశ్వత మరణం ఇస్తుంది.
ఇది మీ జీవాత్మను పరమాత్మగా మారుస్తుంది.
ఇదియే దేవుడిని మాధవుడిగా మారుస్తుంది.
దీనికి మించిన మంత్రం గానీ, స్థితి గాని లేదు.
- పరమహంస
యోగ సాధన:
అసలు నీకు నీవు ఎవరో తెలుసుకో!
నేను అంటే ఏమిటో తెలుసుకో!
నీవే దైవమని మరచిపోయానని తెలుసుకో!
నీవు విశ్వానికి అధిపతివని తెలుసుకో!
నీకు నీవే శత్రువని తెలుసుకో!
నీకు నీవే మహా మాయవని తెలుసుకో!
నీకు నీవే ఆప్తమిత్రుడవని తెలుసుకో!
నీకు నీవే ఆత్మబంధువని తెలుసుకో!
నీకు నీవే గురువని తెలుసుకో!
నీకు నీవే శిష్యుడవని తెలుసుకో!
నీకు నీవు కష్టపడి తెలుసుకో!
నిన్ను మించిన దైవం లేదని తెలుసుకో!
నిన్ను సృష్టించిన పరమాత్ముడిని తెలుసుకో!
పరమాత్ముడిని సృష్టించిన పర బ్రహ్మమును తెలుసుకో!
ఆయన నిన్ను ఎందుకు సృష్టించాడో తెలుసుకో!
ఈ విశ్వమంతా నీ ప్రతిబింబాలేనని తెలుసుకో!
అవసరమైనది అవసరమైనప్పుడు ప్రకృతి మాత ఇస్తుందని తెలుసుకో!
పరబ్రహ్మం సంకల్పించినప్పుడే నీవు అహం బ్రహ్మాస్మిస్థితిని పొందుతావని తెలుసుకో!
అప్పుడు చిరునవ్వుతో భౌతిక మరణాన్ని పొంది జీవన్ముక్తిని పొందుతావని తెలుసుకో!
- పరమహంస
విషయ సూచిక
యోగ సూక్తులు
యోగ తత్వ బోధనలు
యోగ పరి ప్రశ్నలు
యోగ సారములు
పరబ్రహ్మం
సృష్టి
యోగితత్వము
కుండలిని శక్తి యోగము
అష్టాంగ యోగము
కర్మయోగము
భక్తి యోగము
జ్ఞాన యోగము
సన్యాస యోగము
పంచ సాధన యోగము
గురుతత్వ యోగము
కుండలిని యోగము
సాక్షాత్కార యోగము
అనుభూతి యోగము
సాధన శక్తుల అశక్తుల యోగము
జీవన్ముక్తి యోగము
సాధన లక్ష్య యోగము
మరణ యోగము
గ్రంథ సారము
మీకు తెలుసా
......................................................................................................................
గ్రంథ పరిచయం
ఈ గ్రంథం మీ చేతికి వచ్చేసరికి మీకు ఈపాటికి యోగం మీద చాలావరకు అవగాహన వచ్చేసి ఉంటుంది. అనగా కర్మయోగం, భక్తి యోగం, ధ్యానయోగం, జ్ఞాన యోగం…. ఇలా 18 రకాల యోగాల మీద మీరు ఎన్నో విషయాలు తెలుసుకుని ఉంటారు. అలాగే యోగశాస్త్రమునకు సంబంధించి ఎన్నో గ్రంథాలు, అలాగే ఎన్నో పుస్తకాలు చదివేసి ఉంటారు. ఈపాటికి వాటిలో చెప్పినట్టుగా సాధనను మొదలుపెట్టి ఉంటారు. ఒక నిమిషం ఆగండి.
అసలు భగవంతుడు ఉన్నాడా? లేడా? చూద్దాం. అసలు నిజంగా భగవంతుడు అనే వాడు ఉంటే మనకి కనిపించాలి కదా! పోనీ మనకు కష్టాలు ,బాధలు లేకుండా చేయాలి కదా! అంటే మనం పడే బాధలు లేకుండా చేయాలి కదా! అంటే మనం పడే బాధలు, కష్టాలు తొలగించకపోతే భగవంతుడు లేనట్లే కదా! మన లెక్క ప్రకారం భగవంతుడు లేడు అనుకుందాం. మరి గాలి ఉన్నదా! లేదా? పాలలో వెన్న ఉన్నదా? లేదా? ఉంటే మరి గాలి మనకి కనిపించాలి కదా! పోనీ గాలి లేదు అనుకుందాం. మరి మనం ఎలా జీవిస్తున్నాము. ఒకసారి ఆలోచించండి. అంటే భగవంతుడు ఉన్నట్లే కదా! మరి భగవంతుడు లేకపోతే సూర్యుని చుట్టూ నవగ్రహాలు ఎవరో చెప్పినట్లుగా నిర్ణీతమైన కక్ష్య లలో ఎలా సంచారం చేస్తున్నాయో ఒక్కసారి ఆలోచించండి. దానికి మనవాళ్లు అయస్కాంత శక్తి వలన సంచారం చేస్తున్నాయి అంటారు. మరి ఈ శక్తి ఎక్కడినుండి వచ్చిందో ఆలోచించండి. అంటే ఏదో ఒక ఆకారం నుండి ఈ శక్తి రావాలి కదా! ఆ ఆకారమునే భగవంతుడు అనవచ్చు కదా! అంటే మన లెక్క ప్రకారం భగవంతుడు ఒక్కడు ఉన్నాడని తెలిసింది. అంటే విశ్వము నడిపించే శక్తి ఒకటి ఉన్నదని తెలిసింది కదా! ఈ శక్తిని విశ్వశక్తి లేదా చైతన్య శక్తి లేదా కాస్మిక్ ఎనర్జీ అందురు.
సరే ఇప్పుడు మనిషి నిద్రపోతున్నా కూడా జీవించి ఉంటున్నాడు కదా? ఇది ఎలా సాధ్యం. అంటే మనిషి నిద్రపోవడం అంటే మెదడుకి విశ్రాంతి ఇవ్వటం లాంటిది. అని అవయవాలను, అలాగే అన్ని పనులు చేసే మెదడు నిద్రపోతే మరి గుండె ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి ఆలోచించండి. అంటే మనలో కూడా ఒక శక్తి అంతర్గతంగా ఉండి ఈ శరీరమును నడిపిస్తుందని అనవచ్చు కదా! ఈ శక్తి ఏ కుండలని శక్తి లేదా ప్రాణ శక్తి అందురు. ఇంతవరకు బాగానే ఉంది.
ఈ విశ్వశక్తి, కుండలినీ శక్తి ఎక్కడినుండి వచ్చినాయో, ఎందుకు వచ్చినాయో? ఈ గ్రంథము ద్వారా భగవంతుడు అంటే ఎవరు? అనే విషయం దగ్గర నుండి నీవే భగవంతుడివి అని ఎలా తెలుసుకోవాలో వివరించాను. అలాగే ప్రారంభ సాధకుడి నుండి పరిపూర్ణ జ్ఞాన సిద్దుడిగా ఎలా మారవచ్చునో సందేహాలకు - సమాధానాల రూపంలో వివరించాను. అలాగే కుండలిని శక్తి జాగృతి అయినప్పుడు కలిగే స్థితుల నుండి అనుభూతి పొందినప్పుడు కలిగే స్థితుల వరకు సంపూర్ణంగా వివరించాను. అంటే ఈ గ్రంథం ద్వారా సంపూర్ణంగా వివరించాను. అంటే ఈ గ్రంథం ద్వారా ఏమీ తెలియని వాడు కూడా పరిపూర్ణ జ్ఞాన సిద్ధుడు అవుతాడని ఘంటాపదంగా చెప్పవచ్చును. కాకపోతే అతడు దానికి తగినట్లుగా సాధన స్థాయిలను పెంచుకుంటూ పోవాలి! అదియు గాక సృష్టిలోనే రహస్యాలుగా ఉండిపోయిన సృష్టి రహస్యాలను అనగా సృష్టి ఎందుకు ఏర్పడింది …జీవుడు మరణానంతరం ఎక్కడికి వెళతాడు? ఇలాంటి సందేహాలను కూడా వివరించడం జరిగింది. అలాగే ఈ గ్రంథరాజం ద్వారా ఎంతోమందికి తెలియని తత్వ విషయాలను తెలియపరచడం జరిగింది. ఇది వ్యక్తి రచించిన గ్రంథం కాదని శక్తి రచించిన అపూర్వ గ్రంథం అని గ్రహించండి. ఈ గ్రంథం ప్రారంభ సాధకులకు సూటియైన, సులభమైన శ్రేయోమార్గమును చూపుతుంది. అలాగే పండితులకు, తత్వవేత్తలకు, ఎన్నో శాస్త్ర విషయాలను ముడులను అనగా సందేహాలకు సమాధానాలు ఇస్తుంది. అలాగే విపరీతమైన భావాలతో చరించే యోగసాధకులకు తమ సాధన స్థాయిలు ఏమిటో తెలియజేస్తుంది! అలాగే ఎవరు నిజమైన గురువులు? ఎవరు నకిలీ గురువులు అన్నది తెలియచేస్తుంది. అలాగే మేమే గురువులమని, మేమే స్వామీజీలమని, మేమే బాబాలమని, అలాగే మేమే దైవాలమనే బ్రాంతిలో ఉన్నవారికి వారి అవివేకాన్ని పోగొట్టి వారి అసలైన నిజమైన ఆధ్యాత్మిక స్థాయి ఏమిటో చూపుతుంది. ఈ గ్రంథం సందేహాలను పెంచి ముడులు వేసే గ్రంథం కాదని, ఇది సందేహాలకు తగ్గ సమాధానాలు ఇస్తూ, ఆ సందేహాలను సమూలంగా నాశనం చేస్తూ ఎన్నో శాస్త్ర విషయాలను తెలిపే గ్రంథరాజమని గ్రహించండి. కాబట్టి……..
ఆత్మసాక్షాత్కారమును కోరుకునే ప్రతి బ్రహ్మ జ్ఞాన సాధకుడు తప్పనిసరిగా అధ్యయనం చేయవలసిన అసామాన్య గ్రంధరాజం! కాబట్టి చాలా నెమ్మదిగా, శాంతంగా, ప్రశాంతంగా, సునిశితంగా ఈ పవిత్ర గ్రంధాన్ని అధ్యాయనం చేయండి. ఇది మొదటిలో అర్థం అయినా, అర్థం కాకపోయినా ఒకటికి పది సార్లు సహనంతో, శ్రద్ధగా, భక్తిగా ,అనురక్తిగా ఆసక్తిగా అధ్యయనం చేయండి. తద్వారా నిజమైన ఆధ్యాత్మిక జీవితం ఏమిటో, అలాగే దానికి సాధన మార్గం ఏమిటో, నిజమైన సాధన అంతిమ లక్ష్యం ఏమిటో, దాని పరమార్థం ఏమిటో తెలుస్తాయి. కానీ ఈ గ్రంథమును మీరు కొన్ని గంటలలో చదివేయగలరు. కానీ దీనిలోని విషయాలు మీ సొంత అనుభవం లోనికి రావడానికి అనగా హృదయగతం చేసుకోవడానికి కొన్ని జన్మలు పడతాయి. ఈ గ్రంథ రాజ రచనకు ఉపయోగపడిన పతంజలి యోగ దర్శనం, అలాగే భగవద్గీత, అలాగే గురుగీత, శివ గీత, ఘేరాండ సంహిత , ధ్యాన యోగము, మహాయోగము, రాజయోగము, భక్తి యోగము, కర్మయోగము, జ్ఞాన యోగము, గరుడ పురాణము, ప్రాణాగ్ని హోత్రోపనిషత్తు, జ్యోతిష్టోమ యోగం, హఠయోగము, యోగ శిఖోపనిషత్తు, యజుర్వేదము, మహా నిర్వాణ తంత్రం, యోగ కొండలోపనిషత్తు, రుద్రయామలం, శివ సంహిత, గోరక్ష పద్ధతి, జ్ఞానార్ణవ తంత్రం, సౌందర్య లహరి, లలితా సహస్రనామావళి, హఠ యోగ ప్రదీపిక, బైబిల్, యోగినీ తంత్రము, బ్రహ్మవిద్యోపనిషత్తు, క కఠోపనిషత్తు ఈ విధంగా ఈ గ్రంథ రచనలో ఉపయుక్తమైన గ్రంథాలకు, వాటి రచయితలకు కృతజ్ఞతా పూర్వక నమస్కారాలు తెలియజేస్తూ…….
పరమహంస